Chandrababu: ఆడబిడ్డల ప్రశ్నలకు జగన్ ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుంది?: మాజీ సీఎం చంద్రబాబు ట్వీట్

ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పధకాలు అక్కరకు రావడం లేదంటూ మహిళలు అడిగిన తీరుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Chandrababu: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పధకాలపై..ఇటీవల కొందరు మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరుపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పధకాలు అక్కరకు రావడం లేదంటూ మహిళలు అడిగిన తీరుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “పన్నుల బాదుడు, పెంచిన కరెంట్ చార్జీల పై ఎమ్మెల్యేలను సైతం నిలదీస్తున్న ఆ మహిళల ధైర్యానికి వందనం. తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనం పై గళమెత్తిన సోదరీమణుల ఆవేదన కు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా?. జగన్ జేబు నుంచి ఇచ్చారా…అసలు దోచింది ఎంత? ఇచ్చింది ఎంత?. మేము వాటితో బతుకుతున్నామా అంటూ ఆడబిడ్డల ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుంది?. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, తాము పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ప్రశ్నించిన ఆ సోదరి తెగువ అందరికీ స్ఫూర్తి కావాలి!” అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

Also Read:Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న వైయస్ఆర్ పెన్షన్ల పంపిణీ

కాగా కర్నూలు జిల్లా కోడుమూరులో మహిళలకు ఇటీవల సున్నా వడ్డీ డబ్బులు పంపిణీ చేశారు. కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ముఖ్యఅతిధిగా వచ్చి మహిళలకు డబ్బు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందంటూ ఎమ్మెల్యే సుధాకర్ ప్రసగింస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు మహిళలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని..నడి వేసవిలో తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా లేవని, రేషన్ బియ్యం కూడా సరిగా ఇవ్వడంలేదంటూ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే సుధాకర్ త్వరత్వరగా కార్యక్రమాన్ని పూర్తిచేసి బయలుదేరుతుండగా మహిళలంతా కలిసి ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు.

Also read:vidadala rajini: బాధితురాలికి అండగా ఉంటాం: మంత్రి విడదల రజిని

దీంతో అక్కడే ఉన్న కొందరు స్థానిక నాయకులూ, మహిళా పోలీస్ సిబ్బంది మహిళలకు నచ్చజెప్పి ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించారు. అయితే ‘సీఎం జగన్ అందిస్తున్న పధకాలు ఏ మాత్రం తమకు ఉపయోగంగా లేవని, ప్రభుత్వం తరుపున రూ.3000 ఇస్తున్న జగన్, ఆ తరువాత ఇళ్ల పన్ను, నీటి బిల్లు, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నుంచి దండుకుంటున్నారని’ ఓ మహిళ మాట్లాడుతుండగా..మీడియా ప్రతినిధులు చిత్రీకరించారు. సదరు మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవగా..అదే వీడియోను ప్రతిపక్ష నేత చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు