Chandrababu Jagan Representative Image (Image Credit To Original Source)
Ys Jagan: మాజీమంత్రి అంబటి రాంబాబును ఫోన్ లో పరామర్శించారు వైసీపీ చీఫ్ జగన్. అంబటిని అడిగి దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న జగన్.. అంబటికి ధైర్యం చెప్పారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందని అంబటికి భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జగన్. రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోయాయని మండిపడ్డారు. అంబటి రాంబాబుపై ఉద్దేశపూక్వకంగానే హత్యాయత్నం, దాడులకు దిగారని ఆరోపించారు. ప్రజలు అన్నీ చూస్తున్నారన్న జగన్.. ఈ అరాచకపాలనను సహించబోరు అని హెచ్చరించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రేక్షకుల్లా వ్యవహరించారని జగన్ విమర్శించారు.
అంబటి రాంబాబు ప్రాణాలకు ముప్పు?
అటు సీఎస్ తో ఫోన్ లో మాట్లాడారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అంబటి రాంబాబుకు రక్షణ కల్పించడంలో పోలీసు అధికారుల వైఫల్యాన్ని సీఎస్ కు వివరించారు. రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలనా యంత్రాంగం ఘోరంగా విఫలమైందన్నారు. డీజీపీ, పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎస్ కు ఫిర్యాదు చేశారు బొత్స. రాంబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరారు. లేకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.