జగన్‌పై మాజీమంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు.. పవన్‌పై ప్రశంసల వర్షం..

బాలినేని లాంటి మంచి వాళ్లు ఉన్నారు అని పవన్ కల్యాణ్ రెండు మూడుసార్లు నా గురించి చెప్పారు. నేను పవన్ తో మాట్లాడకపోయినా ఆయన నా గురించి మాట్లాడారు. దాంతో పవన్ కల్యాణ్ మీద ఎంతో నమ్మకం, ప్రేమ కలిగాయి.

Balineni Srinivasa Reddy : జనసేన పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు బాలినేని. తాను జనసేనలో చేరతానని ఆయన స్పష్టం చేశారు. మంచి రోజు చూసుకుని ఒంగోలులో జనసేనలో జాయిన్ అవుతానని చెప్పారు. తనతో పాటు అనుచరులు, కేడర్ కూడా జనసేనలో చేరతారని బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

పవన్ కల్యాణ్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలినేని.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 17 మందికి జగన్ అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు.

”జగన్ కోసం నేను మంత్రి పదవిని కూడా వదిలేశాను. వైఎస్ఆర్ కుటుంబం కోసం మంత్రి పదవిని వదిలి వచ్చాను. నాతో పాటు 17మంది ఎమ్మెల్యేలు జగన్ కోసం రాజీనామా చేసి వచ్చారు. ఆ 17 మందికి జగన్ న్యాయం చేయలేదు. 17 మందిలో ఒక్కరినైనా మంత్రిగా ఉంచారా? కనీసం నలుగురు ఐదుగురిని అయినా ఉంచాలి. కనీసం ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవడం జగన్ మనస్తత్వాన్ని అందరూ గమనించాలి. వైఎస్ఆర్ పై ఉన్న ప్రేమ వల్ల ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, అవమానించినా.. నేను వైసీపీలో నెట్టుకుని వచ్చాను.

Also Read : వైసీపీకి మరో బిగ్ షాక్.. జనసేనలోకి సామినేని ఉదయభాను..!

వైసీపీలోనూ మంచి వాళ్లు ఉన్నారు. బాలినేని లాంటి మంచి వాళ్లు ఉన్నారు అని పవన్ కల్యాణ్ రెండు మూడుసార్లు నా గురించి చెప్పారు. నేను పవన్ తో మాట్లాడకపోయినా ఆయన నా గురించి మాట్లాడారు. దాంతో పవన్ కల్యాణ్ మీద ఎంతో నమ్మకం, ప్రేమ కలిగాయి. జగన్ ఏనాడు కూడా పబ్లిక్ మీటింగ్ లో నా గురించి మాట్లాడలేదు. అలాంటిది.. అపోజిషన్ లో ఉన్నా పవన్ కల్యాణ్ నా గురించి మాట్లాడారు. మంచి రోజు చూసి ఒంగోలులో జనసేనలో జాయిన్ అవుతా. నాతో పాటు కేడర్ కూడా జనసేనలో జాయిన్ అవుతుంది. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పని చేస్తా” అని బాలినేని అన్నారు.

”వైఎస్ఆర్ కోసమే వైసీపీలో ఎన్నో అవమానాలు భరించా. చాలాసార్లు ఏడ్చా. కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి. ఇంత ఘోరంగా ఓడిపోయినా మళ్లీ అదే కోటరీ నడుస్తోంది. కోటరీ విషయంలో వైసీపీలో ఎలాంటి మార్పు రాలేదు. నాపై ఎమ్మెల్యే దామచర్ల చేసిన ఆరోపణలపై విచారణ చేసుకోండి. నేను స్వచ్చందగా, పవన్ కల్యాణ్ పై ఉన్న నమ్మకంతో జనసేనలో చేరుతున్నా. నాకు గౌరవం ఇవ్వాలని కోరా. ఎలాంటి డిమాండ్లు పెట్టలేదు. జనసేన బలోపేతం కోసం నా వంతు కృషి చేస్తాను. జగన్ కోసం అధికారం వదులుకుని వచ్చా. మంత్రి పదవిని సైతం వదులుకున్నా. నాకు మంత్రి పదవి ఇవ్వడం లేదు అని డైరెక్టుగానే నాతో ఎందుకు చెప్పలేదు. డ్రామాలు ఎందుకు ఆడారు?” అని బాలినేని అన్నారు.