వైసీపీకి మరో బిగ్ షాక్.. జనసేనలోకి సామినేని ఉదయభాను..!

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయభాను ఆ పార్టీలో చేరనున్నారు.

వైసీపీకి మరో బిగ్ షాక్.. జనసేనలోకి సామినేని ఉదయభాను..!

Updated On : September 19, 2024 / 4:50 PM IST

Samineni Udayabhanu : వైసీపీకి భారీ షాక్ లు తగులుతున్నాయి. ముఖ్య నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ సన్నిహితుడు బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీకి రాజీనామా చేయగా, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. ఈ నెల 22వ తేదీన ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయభాను ఆ పార్టీలో చేరనున్నారు. బాలినేని శ్రీనివాస్ కూడా అదే రోజున జనసేనలో చేరే ఛాన్స్ ఉంది.

Also Read : జంతువుల కొవ్వుతో..! తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సామినేని..
వైఎస్ఆర్ సీపీకి నిన్న పార్టీ కీలక నేతగా, సీనియర్ నేతగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. ఇవాళ జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి షాక్ ఇచ్చారు. ఉదయభాను కూడా వైసీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. గత ప్రభుత్వంలో విప్ గా కూడా పని చేశారు. టీటీడీ మెంబర్ గా కూడా పని చేశారాయన. సామినేని సైతం ముందు నుంచి కూడా పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రి పదవిని ఆశించారు. అయితే, పదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా పార్టీ, అధినాయకత్వం విషయంలోనూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

జనసేనలోకి ఇద్దరు వైసీపీ సీనియర్లు..!
ఎన్నికలకు ముందే ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ, అప్పుడు జరగలేదు. ఇప్పుడు తాజాగా వైసీపీని వీడాలని సామినేని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22 లేదా 24వ తేదీన జనసేనలో చేరబోతున్నారు. రేపు వైసీపీకి రాజీనామా చేశాక జనసేనాని పవన్ కల్యాణ్ ను కలవబోతున్నారు. ఇప్పటికే జనసేనలో చేరికకు సంబంధించి ఉదయభానుతో సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. వైసీపీ నుంచి ఇద్దరు సీనియర్లు బాలినేని, సామినేని జనసేనలో చేరాలని నిర్ణయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికల సమయంలోనే జనసేనలో చేరతారని ప్రచారం..
వైసీపీ ప్రభుత్వం వచ్చాక సామినేని ఉదయభాను మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, తొలి విడతలో ఆయనకు మంత్రి పదవి రాలేదు. కనీసం రెండో విడతలో అయినా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ, మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొన్నాళ్లు పార్టీ అధిష్టానానికి దూరంగా ఉన్నారు. వైఎస్ జగన్ స్వయంగా ఆయనను పిలిచి మాట్లాడారు. విప్ పదవి ఇచ్చారు. అయినప్పటికీ.. సామినేని అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నికల సమయంలో జనసేనలో చేరేందుకు ఆయన సంప్రదింపులు జరిపారు. అయితే, ఎన్నికల సమయంలో పొత్తులు, పంపకాల విషయంలో క్లారిటీ రాకపోవడం, జనసేన నుంచి స్పష్టత లేకపోవడంతో ఉదయభాను చేరిక ఆగిపోయింది. ఇప్పుడు వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు అన్ని రకాలుగా సిద్ధమైపోయారు. ఇప్పటికే జనసేనలో చేరికపై పవన్ కల్యాణ్ తో సంప్రదింపులు కూడా జరిపారు.