Devineni Uma: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి దేవినేని ఉమ. జగన్ రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని ఆయన అన్నారు. ధనుంజయ రెడ్డికి మచ్చ లేదన్న జగన్ తన సావాసంతో మకిలి అంటించినందుకు సిగ్గుపడాలన్నారు. మిగులు జలాలపై జగన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు మిగులు జలాలు, నికర జలాలు అంటే ఏంటో జగన్ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు.
”గోదావరి మిగులు జలాలపై జగన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. లంచ్ మీటింగ్ లు పెట్టి ముద్దులు పెట్టుకున్నప్పుడు గోదావరి జలాల గురించి జగన్ రెడ్డికి తెలియదా? నీతో కలిసి పని చేసిన పాపానికి ఐఏఎస్ చదువుకున్న వారు నేడు జైల్లో చిప్పకూడు తింటున్నారు. పరమ దుర్మార్గుడితో సావాసం చేశాను, నట్టేట ముంచాడని కుమిలిపోతున్నారు.
జగన్ వ్యవహారం చూస్తుంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాను అన్నట్లు ఉంది. రాయలసీమ ద్రోహిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. హంద్రీనీవా, ముచ్చుమర్రి కాలవల్లో నీళ్లు వస్తున్నాయంటే జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. పోలీసులు సహా ఉద్యోగులందరికీ వేల కోట్లు బకాయిలు పెట్టి నిరసన తెలిపితే దాడులు చేయించారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లను బ్రాందీ షాపుల దగ్గర నిలబెట్టారు” అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు దేవినేని ఉమ.