Konathala Ramakrishna Likely To Join Janasena
Konathala Ramakrishna : మాజీమంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయ నేత కొణతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నారు. హైదరాబాద్ లో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఉత్తరాంధ్ర రాజకీయాలపైనా ఇరువురూ చర్చించారు. అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్న కొణతాల రామకృష్ణ ఈ నెలలోనే జనసేనలో చేరే అవకాశం ఉంది.
కొణతాల రామకృష్ణ.. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. మాజీమంత్రిగా పని చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికను ఏర్పాటు చేసి ఆ ప్రాంత సమస్యలపై చాలాకాలంగా ఆయన పోరాటం చేస్తున్నారు. చాలా రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో కొణతాల ఒకరు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉత్తరాంధ్ర అభివృద్ది వేదికలో పని చేస్తున్నారు. ఆయన ఇవాళ హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ను కలిశారు. జనసేనలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు కొణతాల ఆసక్తి చూపుతున్నారు.
Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..!
పవన్ తో భేటీ సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన పలు సమస్యలను జనసేనాని దృష్టికి తీసుకెళ్లారు కొణతాల. ఉత్తరాంధ్ర ఏ అంశాల్లో వెనుకబడి ఉంది? ఏయే అంశాల్లో అక్కడ అభివృద్ధి చేయాల్సి ఉంది? పాలకులు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు అనే అంశాలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు కొణతాల. పార్లమెంటులో ఉత్తర్రాంధ ప్రాంతం నుంచి ఒక గళం వినిపించేందుకు గాను తాను అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానని మాజీమంత్రి కొణతాల.. పవన్ కల్యాణ్ తో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, కొణతాలను పార్టీలో చేర్చుకునేందుకు సింసిద్ధత వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. టీడీపీ-జనసేన పొత్తు నేపథ్యంలో.. సీటు విషయంలో ఆలోచించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
2019 ఎన్నికలకు ముందు కూడా కొణతాల రామకృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారమూ జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆయన టీడీపీలో చేరకుండా న్యూట్రల్ గా ఉండిపోయారు. పవన్ కల్యాణ్ ఆలోచన విధానం నాకు నచ్చింది, అందుకే పవన్ ను కలిశాను అని కొణతాల చెబుతున్నారు. కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్రలో గవర సామాజికవర్గానికి చెందిన నేత. పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుంగ అనుచరుడిగా ఉన్నారు. ఆయన మంత్రివర్గంలో ఐదేళ్లు పని చేశారు. నిజాయితీపరుడిగా పేరు పొందారు. అలాంటి నేత రాకతో ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతం అవుతుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు పరిశీలకులు.
Also Read : 23మంది సిట్టింగ్‌లకు నో టికెట్.. సీఎం జగన్ వారిని ఎందుకు పక్కన పెట్టారు? మార్పు వెనుక మర్మం ఏమిటి?