Perni Nani : సీఎం జగన్‌కు బలమైన గాయమైంది, పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి- వైసీపీ నేతలు

ఎన్నికల ముందు దాడులు చేయించడం చంద్రబాబుకు అలవాటే అన్నారు.

Perni Nani : సీఎం జగన్ పై దాడి ఘటనపై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. సీఎం జగన్ పై రాయిని బలంగా విసిరారని ఆయన చెప్పారు. ఈ దాడిలో ముఖ్యమంత్రికి బలమైన గాయం తగిలిందని పేర్నినాని వెల్లడించారు. నీరసంగా ఉన్నప్పటికీ సీఎం జగన్ మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్తున్నారని పేర్నినాని తెలిపారు.

ముందస్తు ప్రణాళిక ప్రకారమే సీఎం జగన్ పై దాడి జరిగిందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసినా అధికారం రాదని చంద్రబాబుకు అర్థమైందన్నారు. ఎన్నికల ముందు దాడులు చేయించడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. దీన్ని చట్టబద్దంగా ఎదుర్కొంటామని అంబటి రాంబాబు తెలిపారు. ఈ దాడికి కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు.

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగ్ నగర్ లోని గంగానమ్మ గుడి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తుండగా రాయి వచ్చి తగిలింది. సీఎం జగన్ కన్నుబొమ్మకు వేగంగా రాయి తాకింది. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి జగన్ ఎడమ కంటి నుదుటిపై రాయి తగలడంతో గాయమైంది. పూలతో పాటు రాయి కూడా విసిరాడు ఆగంతకుడు.

ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. జగన్ కు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు వైద్యులు. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రథమ చికిత్స అనంతరం సీఎం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక టీడీపీ వర్గాలే ఈ దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read : ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై దాడి.. కనుబొమ్మపై గాయం

 

 

 

ట్రెండింగ్ వార్తలు