రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది- కూటమి ప్రభుత్వంపై పేర్నినాని ఫైర్

ఇలాంటి కిరాతకం నడుపుతున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. పవన్ కల్యాణ్, చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలి.

Perni Nani : రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు. 60 రోజులుగా కూటమి నేతల రక్త దాహం ఆగడం లేదన్నారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి ఏపీకి తెచ్చారని టీడీపీ నేతలపై మండిపడ్డారు. రోజురోజుకీ రాష్ట్రంలో కూటమి ప్రేరేపిత హింస రెట్టింపు అవుతోందని ధ్వజమెత్తారు పేర్నినాని. కళ్ళ ముందు దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చూసి కూటమి నేతలు సిగ్గుపడాలన్నారు పేర్నినాని.

”నంద్యాల సుబ్బారాయుడు అనే వైసీపీ నేత.. నన్ను చంపేస్తారు కాపాడండి అని ఎస్పీకి ఫోన్ చేసినా స్పందన లేదు. సుబ్బారాయుడు హత్య జరిగిన తర్వాత పోలీసులు వచ్చారు. జగయ్యపేటలో మా పార్టీ కార్యకర్త శ్రీనివాస్ ను ప్రాణం పోయేలా కొట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగంను ఓ పాత డీజీపీ, పాత ఐజీ అమలు చేస్తున్నారు. ఇలాంటి కిరాతకం నడుపుతున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. పవన్ కల్యాణ్, చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలి. శాంతిభద్రతలపై పెద్ద పెద్ద మాటలు చెప్పిన పవన్ కల్యాణ్ కు ఇవి కనిపించడం లేదా..? ఎమ్మెల్యేలు ఏది చెప్తే అదే చెయ్యండి అని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సందేశం ఇచ్చారు.

ఎన్నికల వరకే రాజకీయాలు, అయ్యాక అంతా ఒక్కటే అని జగన్ చెప్పారు. రూల్ కి విరుద్ధంగా మా ఎమ్మెల్యేలు ఏమైనా అడిగితే చేయొద్దని జగన్ చెప్పారు. చంద్రబాబు మాత్రం మాది పొలిటికల్ గవర్నెన్స్, మన వాళ్ళకే పని చెయ్యండి అని చెప్తున్నారు. వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని మా వాళ్ళకు కావాల్సింది చెయ్యమని చెప్తున్నారు. కలెక్టర్ల సదస్సులో.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడలేదు? వాటిని గాలికి వదిలేసినట్టేనా..?

అన్ని శాఖలు లోకేశ్ నడుపుతున్నారు. సకల శాఖల మంత్రి లోకేశ్. పవన్ కల్యాణ్ శాఖలు కూడా లోకేశ్ అండర్ లో నడుస్తున్నాయి. పిఠాపురం డీఎస్పీ గురించి కూడా లోకేశ్ ను అడగాల్సిన పరిస్థితి. పవన్ కల్యాణ్ ఐదుసార్లు ఫోన్ చేస్తే తప్ప పిఠాపురం డీఎస్పీ బదిలీ అవ్వలేదు” అని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు.

Also Read : అలా చేస్తే ఎవర్నీ వదిలిపెట్టను.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు