Jogi Ramesh
Fake Liquor Case : ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు రాము, అనుచరుడు ఆరేపల్లి రాములను పోలీసులు అరెస్టు చేశారు.
నకిలీ మద్యం తయారీ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఇటీవల పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ప్రోద్భలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే సిట్ బృందం ఆదివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత జోగి రమేశ్ నివాసానికి వెళ్లారు. జోగి రమేశ్ తోపాటు ఆయన సోదరుడు రాము, ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అదుపులోకి తీసుకొని భవానీపురం పీఎస్ కు తరలించారు. జోగి రమేశ్‍ను విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.
జోగి రమేశ్ నివాసంకు సిట్ బృందం వచ్చిన సమాచారం అందుకున్న అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం ముందస్తు కుట్రలో భాగంగానే అన్యాయంగా జోగి రమేశ్‌ను నకిలీ మద్యం కేసులో ఇరికించి, అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేశ్ ను అరెస్టు సమయంలో కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది రాజకీయ కక్ష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగానే మా నాన్నను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికార పార్టీకి అంటుకున్న నకిలీ మద్యం మరకను జోగి రమేశ్‌కు అంటించి రాక్షస ఆనందం పొందాలని చూస్తున్నారని, నిజం నిలకడగా తెలుస్తోంది.. మా నాన్న కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని ఆయన పేర్కొన్నాడు.
ఇదిలాఉంటే.. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ కోరుతూ పిటీషన్ వేశారు. వచ్చే మంగళవారం జోగి రమేష్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఇప్పటికే నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
నకిలీ మద్యం కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని దుర్గ గుడి ప్రాంగణంలో దీపం పట్టుకొని జోగిరమేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కల్తీ మద్యం పేరుతో నా హృదయం గాయపరిచారని, నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని అమ్మవారి సాక్షిగా చెబుతున్న నేను తప్పు చేయలేదని అన్నారు. ఈ కేసులో నేను నార్కో ఎనాలసిస్, లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని జోగి రమేశ్ పేర్కొన్నారు.