మాగంటి, పిన్నమనేని ఫ్యామిలీస్‌ రిటైర్మెంట్‌!

  • Publish Date - December 27, 2019 / 02:13 PM IST

మాజీ మంత్రులు మాగంటి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరావు ఇక రాజకీయాలు గుడ్‌బై చెప్పేస్తారని జనాలు అనుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిన్నమనేని, మాగంటి కుటుంబాల గురించి తెలియని వారెవరూ ఉండరు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో మాగంటి బాబు తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, కృష్ణా జిల్లాలో పిన్నమనేని వెంకటేశ్వరరావు తండ్రి కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కులా ఉండేవారు.

1983 ఎన్టీఆర్ హవా తట్టుకుని కూడా రాజకీయాల్లో నిలదొక్కుకోగలిగారు. 1984 జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎన్టీఆర్ గాలికి ఎదురొడ్డి నిలిచి గెలవగలిగారు. రెండు జిల్లాల్లో వారిద్దరూ జడ్పీ చైర్మన్లుగా పదవులు పొందారు. ఆ తర్వాత వారి వారసులు కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి మంత్రులుగా పని చేశారు. వైఎస్సార్‌ కేబినెట్లో మాగంటి బాబు, పిన్నమనేని వెంకటేశ్వరావు మంత్రులుగా ఉన్నారు.

టీడీపీ నేతలతో అంటీముట్టనట్టుగా :
మాగంటి బాబు విషయానికి వస్తే సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీతో బంధాన్ని తెంచుకుని 2009లో టీడీపీలో చేరారు. ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2014లో ఏలూరు ఎంపీగా విజయం సాధించారు. మళ్లీ 2019లో ఓటమి చవిచూశారు. ఆ ఓటమి తర్వాత నుంచి నియోజకవర్గానికి దూరంగా విజయవాడలో ఉంటున్నట్టు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతలతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారని అంటున్నారు. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన చింతమనేని ప్రభాకర్ జైల్లో ఉన్నా మాగంటి బాబు పట్టించుకోలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. గడిచిన ఆరు నెలలుగా ఆయన తీరు చూస్తుంటే ఇక రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తారనే టాక్‌ నడుస్తోంది. ఆయన కుమారుడు రాంజీ జిల్లాలోనే ఉండి యువతలో తిరుగుతున్నా పెద్దగా ప్రభావం చూపించలేక పోతున్నారు.

మాగంటి బాబు పరిస్థితి ఇంతే :
మరోపక్క పిన్నమనేని కోటేశ్వరావు కుమారుడు వెంకటేశ్వరరావు పరిస్థితి కూడా మాగంటి బాబు తీరుగానే ఉందంటున్నారు. వీరి కుటుంబం ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ నియోజకవర్గం ముదినేపల్లి 2009లో రద్దవటంతో వీరి దృష్టి గుడివాడపై పెట్టారు.

అక్కడ 2009లో కొడాలి నానిపై ఓటమి చవిచూశారు వెంకటేశ్వరావు. ఆ తర్వాత పోటీ చేసే అవకాశమే వీరికి రావటం లేదు. 1999, 2004లలో ముదినేపల్లి నుంచి గెలిచిన పిన్నమనేని వెంకటేశ్వరరావు అప్పటి వైఎస్సార్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలో చేరిన పిన్నమనేని కుటుంబం గుడివాడ అసెంబ్లీ సీటు ఆశించి సాధించలేకపోయింది.

ప్రస్తుతం ఆప్కాబ్ చైర్మన్‌గా పని చేస్తున్నా అది ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. పిన్నమనేని కుటుంబానికి చెందిన బాబ్జి ప్రస్తుతం గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా పని చేస్తున్నారు. ఇక కృష్ణా జిల్లా రాజకీయాల నుండి కూడా పిన్నమనేని కుటుంబం అవుట్ అయినట్టేనని ఊరంతా అనుకుంటున్నారు.

ఈ పరిస్థితుల్లో నేటి రాజకీయాల నుంచి మాగంటి, పిన్నమనేని కుటుంబాలు తెరమరుగైనట్టేనని చెబుతున్నారు. వీరి పెద్దలకు ఉన్న చొరవ, లౌక్యం, రాజకీయ చతురత వారసులకు లేకపోవడంతో సక్సెస్ కాలేకపోతున్నారని డిస్కస్‌ చేసుకుంటున్నారు.