అమెరికాలో మృతిచెందిన తెలుగు అమ్మాయి జాహ్నవి కుటుంబంతో రూ.260 కోట్లకు అధికారి సెటిల్మెంట్.. ఏమైందంటే?
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి 2021లో అమెరికా వెళ్లారు. ఆమె సియాటిల్‌లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ చదివేవారు.
Jaahnavi Kandula
- ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి
- సియాటిల్ నగరంలో 2023లో రోడ్డు ప్రమాదం
- కారుతో ఢీకొట్టిన పోలీస్ అధికారి కెవిన్ డేవ్
Jaahnavi Kandula: అమెరికాలోని సియాటిల్ నగరంలో 2023లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులా (23) కుటుంబంతో పోలీస్ అధికారి కెవిన్ డేవ్ రూ.260 కోట్లకు సెటిల్మెంట్ చేసుకున్నారు. జాహ్నవి రోడ్డు దాటుతున్న సమయంలో కెవిన్ డేవ్ వాహనం ఢీకొని ఆమె మృతి చెందారు.
ఆ ప్రాంతంలో కొందరు డ్రగ్ ఓవర్‌డోస్ తీసుకున్నారంటూ వచ్చిన ఓ కాల్‌కు స్పందిస్తూ అక్కడకు కారులో కెవిన్ డేవ్ వెళ్లారు. 25 ఎమ్పీహెచ్ (40 కేపీహెచ్) పరిమితి ఉన్న ప్రాంతంలో 74 ఎమ్పీహెచ్ (119 కేపీహెచ్) వేగంతో వాహనాన్ని నడిపాడు. అత్యవసర లైట్లు ఆన్ చేసి, కూడళ్ల వద్ద సైరన్ మోగించాడు. ఆ సమయంలోనే జాహ్నవి ఆ వాహనం ఢీకొని మృతి చెందారు.
“జాహ్నవి కందులా మరణం హృదయ విదారకం. ఈ ఆర్థిక సెటిల్మెంట్ ఆమె కుటుంబానికి కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నాం” అని నగర అటార్నీ ఎరికా ఇవాన్స్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి 2021లో అమెరికా వెళ్లారు. ఆమె సియాటిల్‌లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ చదివేవారు. గత శుక్రవారం కింగ్ కౌంటీ సూపీరియర్ కోర్టులో సెటిల్మెంట్ నోటీసు దాఖలు అయ్యాయి. స్థానిక వార్తా వెబ్సైట్ పబ్లికోలా ముందుగా ఈ ఒప్పందాన్ని నివేదించింది. చివరకు జాహ్నవి కుటుంబంతో కెవిన్ డేవ్‌కు సెటిల్మెంట్ కుదిరింది.
కెవిన్ డేన్ను పోలీసు శాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కేసులో అతడికి రూ.4.53 లక్షల జరిమానా విధించారు. కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్లు అతనిపై ఫెలనీ చార్జీలు పెట్టలేదు. కందులాను ఢీకొట్టిన సమయంలో భద్రతను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశాడని నిరూపించలేమని తెలిపారు. ఫెలనీ చార్జీలు అంటే తీవ్రమైన నేరాలపై పెట్టే క్రిమినల్ ఆరోపణలు.
