Kethireddy Venkataramireddy : పక్కా ప్లాన్ తో సీఎం జగన్ కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం : ఎమ్మెల్యే కేతిరెడ్డి

ధర్మవరంలో ఏ రైతుకి అన్యాయం జరుగనివ్వనని స్పష్టం చేశారు. టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న రైతులకు కూడా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల పరిహారం ఇప్పించానని తెలిపారు.

Kethireddy Venkataramireddy : సీఎం జగన్ కాన్వాయ్ ని రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయడం పక్కా ప్లాన్ తో జరిగిందని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. తుంపర్తి, మోటమర్ల వద్ద భూసేకరణ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని తెలిపారు. అప్పట్లో ఎకరాకు రూ.5 లక్షల పరిహారంగా నిర్ణయించి ఆ డబ్బును కోర్టులో డిపాజిట్ చేశారని పేర్కొన్నారు. భూముల్లో పచ్చటి తోటలు ఉన్నా.. అప్పటి ఎమ్మెల్యే సూర్యనారాయణ బలవంతంగా తొలగించారని వెల్లడించారు.

మహిళా రైతులు అడ్డుకుంటే చెప్పుతో కొట్టమని సూర్యనారాయణ చెప్పారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా కేసులు లేకుండా చూసుకుంటానని సూర్యనారాయణ అన్న వీడియోలు కూడా ఉన్నాయన్నారు. రైతులకు రూ. 5లక్షల కాదు రూ.20 లక్షలు ఇవ్వాలని అప్పట్లో తాను పోరాడినట్లు గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులతో కలిసి అధికారుల దగ్గరికి వెళ్ళామని చెప్పారు.

Chandrababu: టీడీపీ అధికారంలోకి వస్తే వీటిని తొలగిస్తామని తప్పుడు ప్రచారం.. మైండ్ గేమ్ ఆడుతున్నారు: చంద్రబాబు

అయితే, ఒక్కసారి కోర్టులో డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత పరిహారం పెంచబోరని.. అది చట్టం అన్నారు. రైతులకు రూ.5 లక్షల పరిహారం టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిందేనని తెలిపారు. పరిహారం పెంచడం సాధ్యం కాదని అప్పుడే రైతులకు చెప్పానని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు సీఎం జగన్ ను అడ్డుకునేలా కొందరు రైతులను రెచ్చగొట్టి పంపించారని ఆరోపించారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎవరు చేశారో అందరికీ తెలుసన్నారు.

అయితే, రైతులు అడ్డుకుంటారని కొందరికి ముందే తెలుసని చెప్పారు.  కాగా, ధర్మవరంలో ఏ రైతుకి అన్యాయం జరుగనివ్వనని స్పష్టం చేశారు. టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న రైతులకు కూడా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల పరిహారం ఇప్పించానని తెలిపారు. సీఎం జగన్ భయపడే వ్యక్తి కాదని.. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొనగలరని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు