Chandrababu: టీడీపీ అధికారంలోకి వస్తే వీటిని తొలగిస్తామని తప్పుడు ప్రచారం.. మైండ్ గేమ్ ఆడుతున్నారు: చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బీసీ సంఘాలతో చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు.

Chandrababu: టీడీపీ అధికారంలోకి వస్తే వీటిని తొలగిస్తామని తప్పుడు ప్రచారం.. మైండ్ గేమ్ ఆడుతున్నారు: చంద్రబాబు

Chandrababu Naidu

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు తొలగిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పులు తెచ్చి అమలు చేసే సంక్షేమ పథకాలు ముప్పు తెస్తాయని, సంపద సృష్టించే వారికే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే హక్కు ఉంటుందని వ్యాఖ్యానించారు. బీసీలకు ఒకటి రెండు పదవులు ఇచ్చి మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బీసీ సంఘాలతో చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గొర్రెలను రాయితీపై ఇస్తామని చెప్పారు. గొర్రెల పెంపకందారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని అన్నారు. బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు అండగా ఉంటామని తెలిపారు.

అంబేద్కర్ ఇచ్చిన ఆలోచనలను ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు అన్నారు. సాంకేతికత పెరిగిన తరుణంలో బీసీలను పైకి తీసుకురావడం చాలా సులువని తెలిపారు. తాము సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రజక వర్గానికి మొదటిసారి రామారావుని ఎమ్మెల్సీ చేసింది టీడీపీనే అని తెలిపారు.

వైసీపీ వారు వై నాట్ కుప్పం అంటున్నారని, అందుకే టీడీపీ నేతలు వై నాట్ పులివెందుల అంటున్నారని చంద్రబాబు చెప్పారు. బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గించి 17 వేల మందికి పదవులు రాకుండా చేశారని అన్నారు. హత్యలు, దోపిడీలు చేసే వాళ్లను అధికారంలోకి రానీయొద్దని చెప్పారు. కాగా, వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఎన్నికలపై దృష్టి పెడుతున్నాయి.

Kuppam TDP: కుప్పం టీడీపీ వ్యవహారాల బాధ్యతలు ఇక ఆ నేత చేతుల్లోకి.. చంద్రబాబు కీలక నిర్ణయం