Nallamala Forest Tigers
Fear of tigers for Nallamala forest dwellers : నల్లమల అటవీ ప్రాంత సమీపంలోని గిరిజన గూడేల్లో పులుల భయం వెంటాడుతోంది. వనం వదిలి జనంలోకి వస్తున్న పులులతో వారంతా ఉలిక్కిపడుతున్నారు. ఇటీవల 15 రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా చేసిన పులుల కదలికల నేపథ్యంలో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. రానున్నది వేసవికాలం కావడంతో నీటి వనరులు లేక అటవీ ప్రాంతాల చుట్టూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గుంటూరు-ప్రకాశం జిల్లాల సరిహద్దులోని వెల్దుర్తి మండలం ఆనుకొని ఉన్న నల్లమల ప్రాంతంలో ఈ పరిస్థితి నెలకొంది.
వన్యప్రాణి విభాగం అధికారులు ఐదు జిల్లాల పరిధిలో విస్తరించిన అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న పులులపై దృష్టి పెట్టారు. ఇటీవల పులుల దాడుల్లో మృతి చెందిన పశువులకు వన్యప్రాణి విభాగం తరపున రూ.3.10 లక్షల నష్టపరిహారం కూడా చెల్లించారు. గుంటూరు, ప్రకాశం, నల్గొండ, మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దులో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించింది ఉంది. గుంటూరు-ప్రకాశం జిల్లాల సరిహద్దులో పులుల సంచారం ఉంది. వెల్దుర్తి మండలం సమీపంలోని అటవీ ప్రాంతంలోనే 8 పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
పులి రోజుకు 50 నుంచి 60 కిలోమీటర్లు సంచరిస్తుందని అంచనా. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణ కోసం బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ప్రత్యేక సిబ్బంది వేటగాళ్ల కదలికలతో పాటు, కృష్ణానది వద్దకు నీటి కోసం వచ్చే పులులను పర్యవేక్షిస్తుంటారు. మరోవైపు అటవీ ప్రాంతంలో కూడా ట్యాంకర్ల సాయంతో తొట్టెల్లో నీటిని ఏర్పాటు చేస్తారు. వేసవికాలంలో గిరిజన గూడేల వైపు వచ్చి పశువులపై దాడులు చేసిన ఘటనలున్నాయి.
ఇటీవల వెల్దుర్తి మండలం సరిహద్దులో పులి సంచరించింది. అటవీశాఖ రెస్క్యూ టీం తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపించారు. ఇప్పటిదాకా బయటకు రాలేదు. వేసవికాలం నేపథ్యంలో పులులకు తాగునీటిని అందుబాటులో ఉంచుతాం. సోలార్ బోర్లు పనిచేస్తున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని తొట్టెల్లో నింపుతాం. బేస్‌క్యాంప్‌లో పనిచేసేది గిరిజనులే. పులుల దాడుల్లో మృతి చెందిన పశువులకు నష్టపరిహారం చెల్లిస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.