Sankranti Train Tickets Booking: తెలుగు వారు జరుపుకునే అతి ముఖ్యమైన, అతి పెద్ద పండుగ సంక్రాంతి. చదువు, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారంతా ఈ పండక్కి కచ్చితంగా తమ తమ స్వస్థలాలకు వచ్చేస్తారు. కుటుబసభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫుల్ హ్యాపీగా గడిపేస్తారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పండక్కి ఊరు వెళ్లేందుకు జనాలు అప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో అందరి చూపు రైలు ప్రయాణంపై పడింది. పండక్కి ఊరు వెళ్లాలని అనుకునే వారంతా రైలు టికెట్లు బుక్ చేసుకునే పనిలో పడ్డారు. రైలు టికెట్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా, ఎప్పుడెప్పుడు రిజర్వేషన్ చేసుకుందామా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
కాగా, 60 రోజుల ముందే రైలు టికెట్లను బుక్ చేసుకునే ఫెసిలిటీ తీసుకొచ్చింది రైల్వే శాఖ. అంటే.. పండగ తేదీలకు సరిగ్గా 60 రోజుల ముందు IRCTC వెబ్ సైట్ లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయన్న మాట. దీన్ని ఉపయోగించుకుని అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్ చేసుకోవడం వల్ల రైళ్లల్లో బెర్తులను సులభంగా పొందొచ్చు.
సంక్రాంతి పండక్కి రైలు టికెట్ల బుకింగ్ రేపటి నుంచి (నవంబర్ 13) నుంచి ప్రారంభం అవుతుంది. ఉదయం 8 గంటలకు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. జనవరి 12వ తేదీ ప్రయాణానికి సంబంధించి.. 60 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకునే నిబంధన ప్రకారం గురువారం నుంచి ఈ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఇక, జనవరి 14వ తేదీ ప్రయాణానికి ఈ నెల 15న బుకింగ్ మొదలవుతుంది. ఐఆర్ సీటీసీ అధికారిక వెబ్సైట్, యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
కాగా.. ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడానికి జనాలు విపరీతంగా పోటీ పడుతున్నారు. దీంతో వాటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ముందస్తు రిజర్వేషన్‌కు విండో ఓపెన్ అవడం ఆలస్యం టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే పలు తేదీల్లో బుకింగ్ కు సంబంధించిన టికెట్లు పూర్తయ్యాయి. అప్పుడే రిగ్రెట్, వెయిటింగ్ అని దర్శనం ఇస్తోంది. దీంతో పండక్కి ఊరెళ్లడం ఎలా అని ప్రయాణికులు బెంగ పెట్టేసుకుంటున్నారు.