Anil Kumble-CM Jagan : ఏపీ సీఎం జగన్‌ను అనిల్ కుంబ్లే అందుకే కలిశాడా?

టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కుంబ్లే మర్యాదపూర్వకంగా కలిశాడు. కుంబ్లేను సీఎం జగన్ కండువాతో సత్కరించారు.

Former Cricketer Anil Kumble Meets Ap Cm Jagan Mohan Reddy (1)

Anil Kumble Meets AP CM Jagan : టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కుంబ్లే మర్యాదపూర్వకంగా కలిశాడు. కుంబ్లేను సీఎం జగన్ కండువాతో సత్కరించారు. కుంబ్లే ఏపీ సీఎంను కలవడానికి గల కారణాలు తెలియనప్పటికీ తాజా భేటీపై క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భారత జట్టు ప్రధాన కోచ్ సహా బీసీసీఐలో పలు ఉన్నత పదవులను కుంబ్లే చేపట్టాడు. కర్ణాటకకు చెందిన అనిల్ కుంబ్లే.. ఏపీలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. దానికి సంబంధించి కుంబ్లే సీఎం జగన్ తో భేటీ అయ్యాడని సమాచారం. సీఎం జగన్, కుంబ్లేల మధ్య క్రీడల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

ఏపీలో స్పోర్ట్స్‌ యూనివర్శిటీ పెడితే తన వంతు సహకారం అందిస్తానని కుంబ్లేకి జగన్ చెప్పినట్టు తెలిసింది. క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీని పెట్టే అంశంపైనా దృష్టిసారించాలని కోరినట్టు తెలుస్తోంది. జలంధర్, మీరట్‌ లాంటి నగరాలనుంచే అన్నిరకాల క్రీడా సామగ్రిని తెచ్చుకుంటామని చెప్పాడు. ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో క్రీడా సామగ్రి ఉంటుందని కుంబ్లే సీఎంకు వివరించినట్టు సమాచారం.

సీఎం జగన్‌తో అనిల్ కుంబ్లే భేటీపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు వైజాగ్ లో అకాడమీ ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం 2 ఎకరాలు కేటాయించింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఏపీ నుంచి వెళ్లనున్న క్రీడాకారులకు సీఎం రూ. 5 లక్షల ప్రోత్సాహం అందజేశారు. ఇప్పుడు సీఎం జగన్‌తో కుంబ్లే భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అనిల్ కుంబ్లేకు మంచి గుర్తింపు ఉంది. సుదీర్ఘ కెరీర్‌లో 132 టెస్టులు, 271 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. తన కేరీర్‌లో మొత్తం 956 వికెట్లు పడగొట్టాడు.. 2008లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత్‌కు హెడ్ కోచ్‌ పనిచేశారు. 2017లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాలు తలెత్తాయి. అనంతరం హెడ్ కోచ్ పదవి నుంచి కుంబ్లే వైదొలిగాడు.