Chinta Mohan: హైదరాబాద్ లో ప్రధాని మోదీ ప్రసంగం నాకు నచ్చలేదు.. ఆయన మాటలకు బాధపడ్డా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా 5 సీట్ల కంటే ఎక్కువ రావని చింతా మోహన్ అన్నారు.

Former Union Minister Chinta Mohan comments on PM Modi and Pawan Kalyan

Chinta Mohan Comments on PM Modi: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ పార్టీకి మద్దతుగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. అధికారం కోసం ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లను బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అంశం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం నిర్ణయిస్తుందని చెప్పారు. హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం తనకు నచ్చలేదని, కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఏమి చేయలేదన్న మోదీ మాటలు బాధించాయని తెలిపారు.

దళితుడిని తొలి రాష్ట్రపతి చేయాలనుకున్నారు.. కానీ
కృష్ణా జిల్లా ఎస్సీల వల్లే మహాత్మ గాంధీకి సౌతాఫ్రికాలో గుర్తింపు వచ్చిందని వెల్లడించారు. ”భారత దేశంలో అంటరానితనం ఉందని గాంధీకి తెలిపింది ఎస్సీలే. దేశ స్వాతంత్ర్యం, అంటరానితనం నిర్మూలన గురించి గాంధీ పోరాడారు. ఒకప్పటి ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వల్ల ఇప్పుడు దళితులు అయ్యారు. నెహ్రు, అంబేద్కర్ కు మంచి సంబంధాలు ఉండేవని.. అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్త కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. రాజ్యాంగ రూపకర్తగా రెండు సార్లు అంబేద్కర్ రాజీనామా చేస్తే దాన్ని నెహ్రు తిరస్కరించారు. విజయవాడకి చెందిన దళితుడు చక్రయ్యను దేశానికి తొలి రాష్ట్రపతిని చేయాలని గాంధీ భావించారు.. కానీ ఆయన చనిపోవడంతో అది జరగలేద”ని చింతా మోహన్ వివరించారు.

బీజేపీ చేసిందేమి లేదు
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు బీజేపీ చేసిందేమి లేదని.. అదానీ, అంబానీలకే ప్రధాని మోదీ అన్ని చేస్తున్నారని ఆరోపించారు. యూపీలో దళితుల్లో అనేక వర్గాలు ఉన్నాయని.. ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించారని ప్రశ్నించారు. ఓట్ల కోసం మోదీ చేస్తున్న ప్రసంగాలను ఖండిస్తున్నానని అన్నారు. ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని గుర్తు చేశారు.

బీజేపీ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ తప్పు చేశారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి తప్పు చేశారని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. రెండు పార్టీలకు 5 సీట్లకు మించిరావని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో ఎన్టీఆర్ పోటీ చేసినా గెలవడని అన్నారు. ఏపీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారని.. కానీ తమ పార్టీ నేతలే ప్రజలను ఓట్లు అడగడం లేదని చురక అంటించారు. జగన్ పాలన బాగుంటుందని అనుకున్నానని కాని ఆయన డీలా పడ్డారని వ్యాఖ్యానించారు.

Also Read: అమరావతే రాజధాని, పేదలకు ఉచిత ఇసుక- టీడీపీ జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో

ట్రెండింగ్ వార్తలు