Bolla Brahmanaidu : గండిపేట భూకబ్జా కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు
Bolla Brahmanaidu : సర్కార్ భూముల కబ్జా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నారు.
- Sreehari A
- Updated on- June 5, 2026 / 03:07 PM IST
Bolla Brahmanaidu
- గండిపేట భూ కుంభకోణం కేసులో అదుపులోకి
- నకిలీ జీవోలతో సర్కార్ భూముల కబ్జాకు యత్నించినట్లు ఆరోపణలు
- తమిళనాడులోని కాంచీపురంలో పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే
Bolla Brahmanaidu : నగర శివారు గండిపేటలో సర్కారు భూముల కబ్జా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, వినుకొండ మాజి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు అయ్యారు.
తమిళనాడులోని కాంచీపురంలో తెలంగాణ సైబరాబాదు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అధికారుల ఫోర్జరీ సంతకాలు, ఫేక్ జీవోలతో గండిపేటలో 1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల కబ్జాకు యత్నించడంతో బ్రహ్మనాయుడిపై కేసు నమోదైంది. ఈ కేసులో బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరు నిందితులు కూడా ఉన్నారు.
Read Also : RBI Repo Rate : లోన్లు తీసుకున్న వారికి లడ్డూ లాంటి న్యూస్.. ఆర్బీఐ కీలక నిర్ణయం..
గత కొన్ని రోజులుగా పరారీలో ఉండగా తమిళనాడులోని కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. గండిపేటలో సర్కారు భూమిని కబ్జా వెనుక బ్రహ్మనాయుడు పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి పోలీసులు కీలక సమాచారాన్ని కూడా సేకరించారు. భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించినవారిలో బ్రహ్మనాయుడు సహా మొత్తం 9 మందిపై కేసులు నమోదయ్యాయి.
ఇటీవల ఏపీలోని నరసరావుపేటలో బ్రహ్మనాయుడు నివాసానికి సైబరాబాద్ పోలీసులు సోదాలు చేసేందుకు వెళ్లగా ఆయన అక్కడ లేరు. ఈ కేసులో ఇతర నిందితులు కొవ్వూరు సునీల్, బొల్లా రమేశ్, మరో ఇద్దరు పరారీలో ఉండగా, కాంచీపురంలో బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు తరలించి ఆయన్ను విచారించనున్నట్లు సమాచారం.
