RBI Repo Rate : లోన్లు తీసుకున్న వారికి లడ్డూ లాంటి న్యూస్.. ఆర్బీఐ కీలక నిర్ణయం..
RBI Repo Rate : లోన్లు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లడ్డూ లాంటి న్యూస్ చెప్పింది. కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది.
RBI Governor Sanjay Malhotra
- లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం
- ఆర్బీఐ వడ్డీరేటు యధాతథం
- వివరాలు వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
RBI Repo Rate : లోన్లు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లడ్డూ లాంటి న్యూస్ చెప్పింది. కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈమేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఎంపీసీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.
సంక్షోభం వేళ వడ్డీ రేట్లు పెరగొచ్చనే అంచనాలు తలకిందులు చేస్తూ ప్రస్తుతానికి వడ్డీలో ఎలాంటి మార్పు లేదని ఆర్బీఐ ప్రకటించింది. దీంతో లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం లభించినట్లయింది. ప్రస్తుతానికి పాత ఈఎంఐలే కొనసాగనున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనత, పశ్చిమ ఆసియా ప్రాంతంలోని భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ తెలిపింది. దీంతో రెపో రేటు 5.25శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో జరిగిన సమీక్షలోనూ వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచిన విసయం తెలిసిందే.
రెపో రేటులో మార్పులు లేకపోవడంతో గృహ రుణాలు, వాహన రుణాలు వంటి ఫ్లోటింగ్ వడ్డీ రుణాలపై ఈఎంఐలు తక్షణ ప్రభావానికి గురికావని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రుణగ్రహీతలకు ప్రస్తుతం ఉపశమనం లభించినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, అంతర్జాతీయ పరిస్థితులు, చమురు ధరల పెరుగుదల, రూపాయి మారక విలువలో ఒత్తిడి వంటి అంశాలపై ఆర్బీఐ అప్రమత్తంగా ఉందని, భవిష్యత్లో పరిస్థితులను బట్టి విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.
