Maharaju Govt Hospital
MahaRaju Govt Hospital : విజయనగరంలో మహారాజు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం జరిగింది. ఆక్సిజన్ అందక నలుగురు కరోనా రోగులు మృతిచెందారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఆక్సిజన్ నిలిచిపోయింది. ఊపిరి అందక కరోనా రోగులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. మరికొందరి కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ప్రైవేటు ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోగుల బంధువులు పరుగులు తీస్తున్నారు. ఆక్సిజన్ నిలిచిపోయిన ఘటనపై అధికారులు నోరు విప్పకపోవడంతో రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి ముందు భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆస్పత్రి ప్రాంగణంలోకి అధికారులు ఎవరిని రానివ్వడం లేదు. ప్రైవేటు అంబులెన్స్ లను అధికారులు పిలిపించారు. తెల్లవారుజామున రహస్యంగా మృతదేహాలను తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీరుపై రోగుల బంధువులు మండిపడుతున్నారు.