WhatsApp Governance
వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రకాల పౌరసేవల్ని ప్రజలకు తేలికగా అందిస్తోంది. వాట్సప్ గవర్నెన్స్ కింద తిరుమల తిరుపతి దేవాస్థాన(టీటీడీ) సేవలను కూడా అనుసంధానించే ప్రణాళికలను వేసుకుంది. వాట్సప్ ద్వారా పౌరులకు ప్రభుత్వ సేవలను అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం గత నెలలో ‘మన మిత్రా’ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ సేవలకు అధికారిక వాట్సప్ నంబర్ 9552300009ను కూడా కేటాయించింది. ప్రజల కోసం వాట్సప్ గవర్నెన్స్ ద్వారా మరిన్ని సేవలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రధాన సేవలు ఇవే..
తిరుమల తిరుపతి సేవలు: దర్శన టిక్కెట్ల బుకింగ్ నుంచి వసతి బుకింగ్‌ల వరకు చేసుకోవచ్చు. స్వామివారి భక్తులు తిరుపతి దేవస్థానానికి చెందిన పలు సేవలను నేరుగా వాట్సప్ ద్వారా పొందవచ్చు.
రైల్వే టిక్కెట్లు: కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో పౌరులు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రైల్వే టిక్కెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు.
సినిమా టిక్కెట్లు: వాట్సప్ ద్వారా సినిమా టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతించే సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తోంది.
ప్రజాభిప్రాయం: ప్రజలు ప్రభుత్వ సేవలపై అభిప్రాయాన్ని అందించడానికి వాట్సప్ గవర్నెన్స్ వీలు కల్పిస్తుంది. మెరుగైన పాలన, జవాబుదారీతనాన్ని పెంచుతుంది.
సైబర్ భద్రతను పెంచడం: వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సైబర్ భద్రతను పెంచుతుంది. ప్రభుత్వం సైబర్ భద్రతా చర్యల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. అన్ని విభాగాలు కఠినమైన సైబర్ భద్రతా ప్రోటోకాల్‌లను అమలు చేయాల్సి ఉంటుంది.
భవిష్యత్ ప్రణాళికలు: వాట్సప్ గవర్నెన్స్ సేవల భద్రతతో పాటు సౌలభ్యాన్ని మరింత పెంచడానికి క్యూఆర్ కోడ్ ధ్రువీకరణ, ఆధార్ ప్రామాణీకరణను ప్రవేశపెట్టే అవకాశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.