Gannavaram YCP Politics : ఎంతకూ తేలని ‘గన్నవరం’పంచాయతీ’.. జగన్‌కు ఎవరు కావాలి? వల్లభనేనా? దుట్టానా?

‘గన్నవరం’ YCP పంచాయతీ’ ఎంతకూ తేలటం లేదు. స్వయంగా జగనే చెప్పినా వల్లభని వంశీలకి దుట్టా రామచంద్రరావుకి మధ్యసయోధ్య కుదరటంలేదు. దీంతో వైసీపీ గన్నవరం నేతలమద్య పెరుగుతున్న గ్యాప్ పెద్ద తలనొప్పిగా మారింది.

Gannavaram YCP Politics : ఒకసారి.. ఇద్దరిని పిలుస్తారు. మరోసారి.. ఒక్కరినే రమ్మంటారు. కొన్నిసార్లు ఫోన్‌లోనే మాట్లాడతారు. అప్పుడప్పుడు తాడేపల్లికి రావాలని కబురు పంపుతారు. ఓసారి.. ఇద్దరినీ కూర్చొబెట్టి మాట్లాడతారు. తర్వాత.. విడివిడిగానూ చర్చిస్తారు. ఎన్ని రకాలుగా చేసినా.. పంచాయతీ మాత్రం తేలడం లేదు. ఎప్పటికి.. తేలుతుందో తెలియదు. ఎప్పుడు.. పుల్ స్టాప్ పెడతారో అర్థం కావట్లేదు. రాసి.. రాసి.. చెప్పి.. చెప్పి.. మాకే చిరాకొస్తుంది. కానీ.. గరం మీదున్న గన్నవరం వార్‌కు మాత్రం చెక్ పడట్లేదు. అది.. పడట్లేదో.. వీళ్లు పడనివ్వట్లేదో.. అర్థం కావట్లేదు. నాయకులు తగ్గడం లేదు.. నాయకత్వం వల్ల కావట్లేదు. అసలు.. గన్నవరంలో జగన్‌కు ఎవరు కావాలి? వల్లభనేని వంశీయా? సీనియర్ లీడర్ దుట్టా రామచంద్రరావా?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో.. ఏ కుర్రాడినడిగినా చెబుతాడు గన్నవరం గురించి. అక్కడి రాజకీయాల గురించి. ప్రశాంతంగా ఉన్న వైసీపీలోకి.. తెలుగుదేశం నుంచి తుపానులా ఎంటరయ్యాడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అప్పటి నుంచి.. లోకల్ వైసీపీలోని విభేదాలు, వర్గపోరు మొదలయ్యాయ్. అవి.. ఇప్పటికీ ఆగట్లేదు. ఒకప్పుడు.. కేసులు, కోర్టులు అంటూ.. తమను ఇబ్బంది పెట్టిన వంశీకి.. ఇప్పుడు గన్నవరం పార్టీ బాధ్యతలు ఎలా అప్పజెబుతారంటూ.. స్థానిక నాయకులు గోల గోల చేస్తున్నారు. లోకల్‌గా నెలకొన్న పరిస్థితులతో.. వంశీ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. గన్నవరం పంచాయతీకి.. పుల్ స్టాప్ పెట్టేందుకు.. అధినేత జగన్‌తో పాటు అగ్ర నాయకత్వమంతా ప్రయత్నిస్తోంది. కానీ.. వాళ్ల వల్ల కావడం లేదనే చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు మధ్య తలెత్తిన వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. ఎప్పటికి అవుతుందో తెలియదు. పార్టీ కీలక నేత.. సజ్జల రామకృష్ణారెడ్డితో ఇప్పటివరకు.. రెండు సార్లు భేటీ అయినా.. పంచాయతీ కొలిక్కి రావడం లేదు. మొన్నటికి మొన్న.. వంశీని, దుట్టాను పిలిచి మాట్లాడారు. లోపలేం జరిగిందో తెలియదు గానీ.. బయటకొచ్చిన తర్వాత.. రామచంద్రరావు మాత్రం.. వంశీని, అతని నాయకత్వాన్ని.. ఒప్పుకునేదే లేదని చెప్పారు. తాజాగా.. కేవలం వంశీని మాత్రమే పిలిచి మాట్లాడారు. లోపలేం జరిగిందో ఆయన చెప్పలేదు. కానీ.. గన్నవరంలో వైసీపీ నేతల మధ్య ఇప్పట్లో సయోధ్య కుదిరే చాన్స్ లేదనే టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది.

ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేసేది లేదని.. దుట్టా రామచంద్రరావు తెగేసి చెప్పేశారు. కలిసొస్తే.. కలుపుకొని పోయి పనిచేస్తానని వంశీ అంటున్నారు. అయితే.. ఎమ్మెల్యే వంశీ పాత వైసీపీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని.. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. దుట్టా వర్గం ఆరోపిస్తోంది. ఇదే అదనుగా.. వంశీ అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారని.. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు దుట్టా. అందరినీ కలుపుకొని వెళ్తున్నా.. కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని వంశీ వివరించారట. ఇదంతా చూస్తుంటే వీళ్లిద్దరి మధ్య పంచాయతీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదనే చర్చ నడుస్తోంది.

అయితే.. ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో.. ఇద్దరు నాయకుల్లో సీఎం జగన్‌కు ఎవరు కావాలన్నదే.. ఇంట్రస్టింగ్‌గా మారింది. దానిమీదే.. పార్టీలో హాట్ డిబేట్ నడుస్తోంది. అయితే.. జగన్ మాత్రం గన్నవరం విషయంలో వంశీ మీదే ఆసక్తిగా ఉన్నట్లు వైసీపీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే టైంలో.. అక్కడున్న నాయకులంతా కలిసి పని చేయాలని సూచిస్తున్నారు. కానీ.. వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు మాత్రం ఇప్పటికీ.. ఉప్పూ-నిప్పులాగే ఉండటంతో.. వారిని బుజ్జగించి.. సర్ది చెప్పి.. గన్నవరంలో నెలకొన్న హీట్‌ను తగ్గించేందుకు వరుసగా మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. అయినా.. ఫైటింగ్ ఆగడం లేదు. మరోసారి.. ఈ ఇద్దరు నేతలు సీఎం జగన్‌తో సమావేశమవుతారని.. అప్పుడు ఆయనే ఓ నిర్ణయం తీసుకుంటారనే.. టాక్ వినిపిస్తోంది. చాలాకాలంగా నడుస్తున్న ఈ పంచాయతీకి.. నెక్ట్స్ మీటింగ్‌లోనైనా పుల్ స్టాప్ పడుతుందా.. లేదా.. అన్నది ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు