Visakha Pharma City : విషవాయువు లీక్, ఒకరు మృతి.. విశాఖ ఫార్మా సెజ్‌లో మరో ప్రమాదం..

గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పటికీ యాజమాన్యం తెలియజేయడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Visakha Pharma City : విశాఖ ఫార్మా సెజ్ లో మరో ప్రమాదం జరిగింది. ఠాగూర్ ల్యాబోరేటరీస్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికుల్లో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. పరవాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు.

పరవాడ ఫార్మా సిటీలో వరుస ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. నెలలు గడుస్తున్న కొద్దీ ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. గత 2 నెలల్లో చూసుకుంటే పలు ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అధికారులు పరిశీలించి ఫార్మా కంపెనీలకు నోటీసులు ఇచ్చి ఉత్పత్తులను నిలిపివేయాలంటూ కఠినంగా వ్యవహరించారు. అయినప్పటికీ ప్రమాదాలు ఆగడం లేదు.

తాజాగా పరవాడ ఫార్మా సిటీలో గల ఠాగూర్ ల్యాబోరేటరీస్ పరిశ్రమలో విషవాయువులు లీకైన ఘటనలో ఒక కార్మికుడు చనిపోయాడు. 8 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాధితులు అందరికీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. అయితే, యాజమాన్యం దీన్ని గోప్యంగా ఉంచినట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగితే, యాజమాన్యం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడం దారుణం అన్నారు. కనీసం గాయపడిన కార్మికుల కుటుంబసభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయకపోవడం ఘోరం అని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పటికీ యాజమాన్యం తెలియజేయడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు పరిశ్రమకు వెళ్లారు. ప్రమాదం ఎలా జరిగింది? నిర్వహణ సరిగా ఉందా లేదా? అన్నది పరిశీలిస్తున్నారు. మొత్తంగా ఫార్మా సిటీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించారు. 8 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

Also Read : నేనేమీ భయపడటం లేదు.. వీడియో విడుదల చేసిన ఆర్జీవీ.. సంచలన వ్యాఖ్యలు