Gnaneswari Mother: మీకు దండం పెడతా.. మా పాప గురించి అలాంటి కామెంట్లు పెట్టొద్దు..
సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాలు, నెగెటివ్ కామెంట్లు తమను మరింత కృంగదీస్తున్నాయని చిన్నారి తల్లి భవానీ (Gnaneswari Missing Case) కన్నీటిపర్యంతమయ్యారు.
Gnaneswari mother emotional comments regarding negative remarks on social media
- పది రోజులైనా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు.
- నెగెటివ్ కామెంట్లు పెట్టవద్దని తల్లి వేడుకోలు.
- ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డు.
Gnaneswari Missing Case: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి (Gnaneswari) అదృశ్యమై పది రోజులవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పాప కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి అన్ని ప్రాంతాల్లోనూ తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే, ఈ కష్టసమయంలో సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాలు, నెగెటివ్ కామెంట్లు తమను మరింత కృంగదీస్తున్నాయని చిన్నారి తల్లి భవానీ కన్నీటిపర్యంతమయ్యారు. తమ బిడ్డ క్షేమంగా తిరిగి వస్తుందనే నమ్మకంతో ఉన్నామని, దయచేసి తమ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా అసత్యపు వీడియోలు, బ్యాడ్ న్యూస్ పెట్టవద్దంటూ ఆమె చేతులు జోడించి వేడుకున్నారు. వారం రోజులుగా తిండి, నిద్ర లేకుండా తాము పడుతున్న నరకాన్ని అర్థం చేసుకోవాలని, వీలైతే పాప క్షేమంగా రావాలని కోరుకోవాలే తప్ప ఎక్కడో ఉండి ఏదేదో ఊహించుకుని బాధాకరమైన కామెంట్లు పెట్టవద్దని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ అదృశ్యం కేసును కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఘటనా స్థలిని పరిశీలించారు. పాప కిడ్నాప్ అయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నప్పటికీ, అందుకు సంబంధించిన ఎలాంటి ప్రాథమిక ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని ఎస్పీ స్పష్టం చేశారు. చిన్నారిని ఏదైనా క్రూర మృగం లాక్కెళ్లి ఉండవచ్చనే కోణంతో పాటుగా సాధ్యమైన అన్ని మార్గాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశామని ఆయన తెలిపారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీని కనిపెట్టి సమాచారం అందించిన వారికి ప్రభుత్వం తరఫున ఒక లక్ష రూపాయల నగదు రివార్డును కూడా ప్రకటించారు.
ఈ కేసులో అత్యంత కీలకమైన అంశంగా మారిన కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క మృతిపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ కుక్క తీవ్రమైన డీహైడ్రేషన్ కారణంగానే చనిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అయితే దానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి పోస్టుమార్టం నిర్వహించామని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి చిన్నారిని వీలైనంత త్వరగా కాపాడేందుకు పోలీస్ శాఖ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
