Gudiwada Temple : దేవాలయంలో బంగారు కిరీటం మాయం వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తింపు..
Gudiwada Temple : కల్యాణ వేంకటేశ్వర స్వామికి వజ్రాలు పొదిగిన రూ.75లక్షల విలువైన బంగారు కిరీటాన్ని 2025లో బహూకరించామని, దాన్ని ఆలయ కమిటీవారు రూ.38లక్షలకు కుదువ పెట్టారని దాత మాటూరి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కల్యాణ మండపం అధ్యక్షుడు పోకూరి మోహనరావు, కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు.
Gold Crown Missing In Gudivada Venkanna Temple
- గుడివాడ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బంగారు కిరీటం అదృశ్యం
- కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం
- తాకట్టు పెట్టుకున్న వ్యాపారి రాజస్థాన్ లో ఉన్నట్లు గుర్తింపు
Gudiwada Temple : కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో సుమారు కోటి విలువైన బంగారు కిరీటం మయామైన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, తాజాగా ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కిరీటం మాయంపై టూటౌన్ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. దాత సుబ్బారావు ఫిర్యాదు మేరకు ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్‌రావుపై BNS 314, 316(2), 318(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కల్యాణ వేంకటేశ్వర స్వామికి వజ్రాలు పొదిగిన రూ.75లక్షల విలువైన బంగారు కిరీటాన్ని 2025లో బహూకరించామని, దాన్ని ఆలయ కమిటీవారు రూ.38లక్షలకు కుదువ పెట్టారని దాత మాటూరి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కల్యాణ మండపం అధ్యక్షుడు పోకూరి మోహనరావు, కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు. భక్తుని మోసం చేయడం, నమ్మక ద్రోహానికి పాల్పడి స్వామివారి కిరీటాన్ని దుర్వినియోగం చేయడంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా.. సీఐ ఇప్పటికే రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. అయితే, కిరీటం తాకట్టు పెట్టుకున్న వ్యాపారి రాజస్థాన్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
సుమారు కోటి విలువైన బంగారు కిరీటం మాయమైన ఉదంతంపై దేవాదాయ శాఖ ఉన్నత స్థాయి విచారణ చేపట్టింది. ఘటనపై సమాచారం అందుకున్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత గురువారం హుటాహుటీన ఆలయానికి చేరుకొని అర్చకుల నుంచి వివరాలు సేకరించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ ట్రస్ట్ బోర్డులోని 31 మందిసభ్యుల్లో ఒక్కరు కూడా అందుబాటులోకి రాకపోవడం, ఫోన్లలో దాటవేత సమాధానాలు చెప్పడంపై లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత కిరీటాన్ని విరాళంగా ఇచ్చిన దాత కుటుంబ సభ్యులను లలిత స్వయంగా కలిసి పూర్తి వివరాలు సేకరించారు.
మీడియా కథనాల ఆధారంగా, ప్రభుత్వ ఆదేశాలతో ప్రాథమిక విచారణకు వచ్చామని ఏసీ లలిత పేర్కొన్నారు. పాలకవర్గం ఎవరూ అందుబాటులో లేరు. రికార్డులు గదిలో లాక్ చేశారు.
ఉదయం 9 గంటలకు వస్తామని సమాచారం ఇచ్చినా పాలకవర్గం స్పందించలేదు.
అర్చకులు, కిరీటం దాత, భక్తుల నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నామని ఏసీ లలిత తెలిపారు. లభించిన స్టేట్మెంట్ల ఆధారంగా ప్రాథమిక నివేదిక సిద్ధం చేసి త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆమె చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. అయితే, తాజాగా.. కల్యాణ మండపం అధ్యక్షుడుతోపాటు కమిటీ సభ్యులపై కేసు నమోదైంది.
