సుదీర్ఘ పాదయాత్ర ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలన్నీ వరసగా అమలు చేస్తున్న సీఎం జగన్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. స్వయం సహాయక సంఘాలకు ఉన్న బ్యాంకుల రుణాలను నేరుగా వారికే చెల్లిస్తూ, వైయస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ‘వైయస్సార్ ఆసరా’ పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
ఎవరు? ఎంత మంది?:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,71,302 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన 87,74,674 లక్షల అక్క చెల్లెమ్మలకు వైయస్సార్ ఆసరా పథకంలో ఆర్థిక సహాయం అందనుంది. గత ఏడాది ఎన్నికల నాటికి, అంటే ఏప్రిల్ 11, 2019 నాటికి వివిధ బ్యాంకుల్లో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు ఉన్న రుణాలను నాలుగు విడతల్లో నేరుగా అక్క చెల్లెమ్మలకే ఇస్తామని సీఎం శ్రీ వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ మేరకు తొలి విడత మొత్తాన్ని శుక్రవారం విడుదల చేస్తున్నారు.
ఎంత మొత్తం?:
రాష్ట్రంలోని మొత్తం 8,71,302 లక్షల స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు గత ఏడాది ఎన్నికల నాటికి మొత్తం రూ.27,168.83 కోట్ల రుణాలు ఉండగా, వాటిలో నాలుగో వంతు మొత్తాన్ని నేరుగా వారికే ఇస్తున్నారు. ఆ మేరకు రూ.6,792.20 కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి, పథకాన్ని ప్రారంభించిన వెంటనే ఆ మొత్తం నేరుగా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ కానుంది.
సచివాలయాల్లో జాబితాలు:
వైయస్సార్ ఆసరా పథకం లబ్ధిదారుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. అర్హత ఉన్నా పొరపాటున ఆ జాబితాల్లో పేర్లు లేని సంఘాలు ఏవైనా ఉంటే, వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే, విచారణ చేసి మంజూరు చేస్తారు. అందుకే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వారి సొమ్ము.. వారి ఇష్టం:
ప్రభుత్వం ఇప్పుడు జమ చేస్తున్న మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్నది ఆ అక్కచెల్లెమ్మలదే నిర్ణయం. పాత బాకీల కింద ఆ మొత్తం జమ చేసుకోకుండా బ్యాంకర్లతో మాట్లాడిన ప్రభుత్వం, వాటిని అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో వేస్తోంది.
ఒక వేళ ఆ అక్క చెల్లెమ్మలు సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటే వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, హిందుస్తాన్ యూనిలివర్, అమూల్, అల్లానా సంస్థలతో ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చింది. మరోవైపు బ్యాంకర్లతో కూడా చర్చలు జరిపింది. ఆ విధంగా అక్క చెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన, సాధికారత ధ్యేయంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో..:
స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు 2014 ఎన్నికల నాటికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) లెక్కల ప్రకారం ఉన్న రూ.14,204 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని, ఇంకా వారికి సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేదు.
ఫలితంగా ఆ సంఘాలన్నీ అప్పులపాలు కావడంతో పాటు, వాటిలో 18.36 శాతం నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా మిగిలిపోయాయి. దీంతో ఆ అక్క చెల్లెమ్మలు అపరాధ వడ్డీతో సహా బ్యాంకులకు ఏకంగా రూ.3,036 కోట్ల వడ్డీని చెల్లించాల్సి వచ్చింది.