వైసీపీకి షాక్ మీద షాక్..! మున్సిపాలిటీల్లోనూ పాగా వేయాలని టీడీపీ ప్లాన్..!

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు పెద్దగా నిధులు విడుదల చేయకపోవడంతో చాలా మంది దిగువస్థాయి నేతలు ఆర్థికంగా చితికిపోయారు.

Gossip Garage : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న వైసీపీకి…. షాక్‌ మీద్‌ షాక్‌ ఇస్తోంది టీడీపీ.. గత ఎన్నికల్లో వైసీపీ కంచుకోటల్లో పాగా వేసిన పసుపు దళం.. ఇప్పుడు వైసీపీ ఖాతాలో ఉన్న స్థానిక సంస్థల్లోనూ పాగా వేయాలని ప్లాన్‌ చేస్తోంది. అధికారం చేతుల మారడంతో స్థానిక నేతలు కూడా వైసీపీకి బైబై చెప్పేసి… సైకిల్‌ సవారీకి సిద్ధం అంటున్నారు. దీంతో మున్సిపాలిటీల్లోనూ టీడీపీ జెండా రెపరెపలాడుతోంది.

స్థానిక సంస్థల్లో మారుతున్న లెక్కలు..
ఏపీలో స్థానిక సంస్థల్లో లెక్కలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఖాతాలో ఉన్న మున్సిపాలిటీల్లో టీడీపీ జెండా ఎగురుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో మొదలైన ఈ మార్పు నెమ్మదిగా రాష్ట్రమంతా విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. చిత్తూరులో వైసీపీకి గట్టి పట్టున్న పుంగనూరు, చిత్తూరు మున్సిపాలిటీలు ప్రస్తుతం టీడీపీ కైవసం చేసుకుంది. ఈ రెండు మున్సిపాలిటీల్లో మెజార్టీ కౌన్సిలర్లు… వైసీపీకి గుడ్‌బై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు. మూడేళ్ల క్రితం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది.

గోడ దూకేందుకు మున్సిపల్ చైర్మన్లు సిద్ధం..
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురవడం.. మిగిలిన రెండేళ్లు ప్రభుత్వ సహకారం అవసరం ఉండటంతో మున్సిపల్‌ చైర్మన్లు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. పుంగనూరు, చిత్తూరు మున్సిపాలిటీల దారిలోనే జిల్లాలోని మిగిలిన పట్టణాల్లోనూ పాలకవర్గాల్లో ఎక్కువ మంది పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా తిరుపతి కార్పొరేషన్‌లో చాలా మంది కార్పొరేటర్లు టీడీపీ లేదా జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే వీరిని చేర్చుకునే విషయంలో ఆయా పార్టీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తిరుపతి కార్పొరేషన్‌లో మార్పు ఆలస్యమవుతోందంటున్నారు.

చిత్తూరు కార్పొరేషన్‌లో టీడీపీ జెండా రెపరెపలు..
గతంలో ఎప్పుడూ లేనట్లు ఈ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాను టీడీపీ ఊడ్చేసింది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు 12 చోట్ల ఏకపక్ష విజయాలను నమోదు చేసింది. దీంతో మున్సిపల్‌ పాలకవర్గాలు ఆలోచనలో పడ్డాయి. చిత్తూరు కార్పొరేషన్‌లో మేయర్ అముదా, డిప్యూటీ మేయర్ రాజేశ్‌ రెడ్డితో సహా మొత్తం 24మంది కార్పొరేటర్లు ఒకేసారి పార్టీ మారారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇంకో ఇద్దరు ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు కూడా జనసేనలో చేరాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉండగా, ప్రస్తుతం 24 మంది టీడీపీలో చేరారు. ఇదివరకే ఆ పార్టీకి ఓ కార్పొరేటర్‌ ఉండటం, కో ఆప్షన్ సభ్యుడిగా ఎంఎల్ఏ ఓటు పరిగణలోకి తీసుకుంటే మొత్తం బలం 26 అవుతోంది. దీంతో కార్పొరేషన్‌పై టీడీపీ జెండా ఎగరేసినట్లైంది.

పుంగనూరులో పెద్దిరెడ్డి హవాకు బ్రేక్‌..
అదేవిధంగా జిల్లాలో పుంగనూరు మున్సిపాలిటీని టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాషాతో సహా మొత్తం 12 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పుంగనూరులో వైసీపీ నేత పెద్దిరెడ్డి గెలిచినా, టీడీపీ ప్రభుత్వం గెలిచిందనే ఉద్దేశంతో కౌన్సిలర్లు వైసీపీకి బైబై చెప్పేశారు. పైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వల్ల తమకు స్వతంత్రం లేకపోయిందని విమర్శిస్తూ… పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి షాక్‌నిచ్చినట్లైంది. పుంగనూరులో పెద్దిరెడ్డికి ఎదురేలేదన్నట్లు ఆయన హవా కొనసాగేది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో అతికష్టం మీద గెలిచిన పెద్దిరెడ్డి… ఇంతవరకు నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇకపై పెద్దిరెడ్డికి చెక్‌ చెప్పాలనే ఉద్దేశంతో ముందుగా మున్సిపల్‌ పాలనను తన గుప్పెట్లోకి తీసుకుంది టీడీపీ… దీంతో పెద్దిరెడ్డి హవాకు బ్రేక్‌ పడినట్లైంది.

తిరుపతి కార్పొరేషన్ లోనూ సేమ్ సీన్..
ఇదేవిధంగా తిరుపతి కార్పొరేషన్‌లోనూ వైసీపీ కార్పొరేటర్ల స్వరం మార్చుతున్నారు. తిరుపతి నగరంలో 50 డివిజన్లకు గాను 49 మంది వైసీపీ కార్పొరేటర్లే ఉన్నారు. ఎన్నికల ముందు ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. కూటమి అధికారంలోకి వచ్చాక.. ఇప్పుడు మెజార్టీ కార్పొరేటర్లు జెండా మార్చేద్దామనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పలువురు కార్పొరేటర్లు టీడీపీ లేదా జనసేనలోకి జంప్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. కనీసం పాతికమంది వైసీపీ కార్పొరేటర్లు తిరుపతిలో పార్టీ మారడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

బాబు, పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే తిరుపతిలో మార్పు ఖాయం..!
తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గెలిచారు. కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డి…. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అభినయ్‌ ఓటమి తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా అధికారం పోవడంతో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి సైతం కార్పొరేషన్‌ను లైట్‌గా తీసుకున్నారు. దీంతో మిగిలిన రెండేళ్లు పనులు చేయించుకోవాలనే ఉద్దేశంతో అధికార కూటమి నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు కార్పొరేటర్లు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం జనసేనాని పవన్‌కల్యాణ్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంటనే తిరుపతిలో మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా భారీ మార్పులు జరిగే అవకాశం..
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు పెద్దగా నిధులు విడుదల చేయకపోవడంతో చాలా మంది దిగువస్థాయి నేతలు ఆర్థికంగా చితికిపోయారు. ఎన్నికల్లో చేసిన ఖర్చులు కూడా తిరిగిరాలేదనే ఉద్దేశంతో… కూటమి ప్రభుత్వంలో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు. మిగిలిన రెండేళ్లు అయినా అధికార పార్టీ ఆశీస్సులతో నష్టపోయిన డబ్బును సమకూర్చుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఈ పరిస్థితులను గమనిస్తే… ఇకపై రాష్ట్రవ్యాప్తంగా భారీ మార్పులు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : అధికారంలో లేకపోయినా బిజీబిజీగా వైసీపీ కీలక నేతలు, జగన్ అత్యంత సన్నిహితులు..! ఎందుకో తెలుసా

ట్రెండింగ్ వార్తలు