Gossip Garage : ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. కేంద్ర హోంశాఖ జోక్యంతో రంగంలోకి సీఐడీ..!

సునీల్‌పై నమోదైన ప్రతి అభియోగం వాస్తవమా కాదా అనేది తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Gossip Garage : గత సర్కార్ హయాంలో ఏపీ సీఐడీలో ఆయనే కీలకం. అప్పట్లో అన్నీ తానై వ్యవహరించిన సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్ ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కస్టోడియల్ టార్చర్‌ కేసుతో పాటు పలువురిని టార్గెట్‌ చేసి మరీ ఇబ్బంది పెట్టినట్లు అలిగేషన్స్ ఉన్నాయి. ఆయన మీద వచ్చిన అభియోగాల కథేంటో తేల్చేందుకు ఆ మధ్యే పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది ఏపీ సర్కార్. ఇప్పుడు దర్యాప్తు స్టార్ట్‌ చేసింది సీఐడీ టీమ్.

సునీల్ పై కేంద్రహోంశాఖకు న్యాయవాది ఫిర్యాదు..
సునీల్‌ సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, కొందరు మీడియా ప్రతినిధులను కూడా అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని టార్చర్ పెట్టారని అలిగేషన్స్ ఉన్నాయి. వీటన్నింటిపై ఓ న్యాయవాది కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారట. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతోనే విచారణ ముందుకు కదిలిందంటున్నారు.

సదరు లాయర్ లేఖపై స్పందించిన కేంద్ర హోంశాఖ.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. దాంతో సీఎస్‌ నుంచి డీజీపీకి.. పోలీస్ బాస్ నుంచి సీఐడీకి ఆర్డర్స్‌ వెళ్లడంతో సునీల్‌కుమార్‌పై విచారణ స్టార్ట్ అయింది. కంప్లైంట్ చేసిన లాయర్‌తో పాటు అప్పుడు బాధింపబడ్డ జర్నలిస్టులు, టీడీపీ నేతల స్టేట్‌మెంట్లను సీఐడీ అధికారులు నమోదు చేసుకుంటున్నారు.

Also Read : జగన్ 2.O మామూలుగా ఉండదు..! మరోసారి వైసీపీ చీఫ్ హాట్ కామెంట్స్..

అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు, నేతలను విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అడ్డగోలుగా టార్చర్ పెట్టారట. ఫేక్‌ కేసులు పెట్టి నరకం చూపించారని చెప్పారట బాధితులు. బట్టలు విప్పించి చిత్రహింసలు పెట్టారని సీఐడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారట. ఇదంతా అప్పటి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ ప్రోద్బలంతో చేశారని అంటున్నారు బాధితులు. అయితే కేంద్ర హోం శాఖకు లాయర్ రాసిన లేఖలో ఉన్న బాధితులందరి నుంచి వివరాలు తీసుకుంటుందట సీఐడీ. అరెస్ట్ చేసిన విధానం, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సీఐడీకి ఇచ్చారట బాధితులు.

బాస్‌ కళ్లల్లో ఆనందం చూసేందుకు వేధింపులు..
అమాయకుల నుంచి.. ఉన్నత స్థాయిలో ఉన్న అప్పటి అపోజిషన్‌ లీడర్ల వరకు ఎవరినీ వదలలేదట సునీల్. బాస్‌ కళ్లల్లో ఆనందం చూసేందుకు పడరాని పాట్లు పడి.. టీడీపీ లీడర్లను, అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారికి చుక్కలు చూపించారట. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును కూడా కస్టోడియల్ టార్చర్ పెట్టారంటూ సునీల్ కుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి.

తన విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ రఘురామ కృష్ణరాజు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం విచారణ అథారిటీని వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటికే కేంద్ర హోంశాఖకు ఓ లాయర్ లేఖ రాయడం..అక్కడి నుంచి సీఎస్‌కు ఆదేశాలు రావడంతో చకచకా దర్యాప్తు కొనసాగుతోందట.

నకిలీ డిపాజిటర్లను సృష్టించి అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాల్సిన సొమ్మును సునీల్‌ రూ.లక్షలు స్వాహా చేశారంటూ ఏసీబీకి గతంలోనే ఫిర్యాదు చేశారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో జమ చేసిన నిధులను సునీల్‌కుమార్, ఆయన సన్నిహితుడు కామేపల్లి తులసిబాబుతో కలిసి దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇక సీఐడీలో టెక్నాలజీ పేరుతో రూ.75లక్షలు నొక్కేశారని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో మెన్షన్ చేశారు రఘురామకృష్ణరాజు. ఐపీఎస్‌ అధికారిగా పనిచేస్తూ తరచూ దుబాయ్‌కి వెళ్లి బినామీలతో కలిసి కుమారుల పేరుతో సునీల్‌ కుమార్‌ అక్కడ వ్యాపారాలు చేస్తున్నట్లు కంప్లైంట్‌లో ఆరోపించారు.

సీఐడీ కస్టడీలో నాటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును టార్చర్‌ చేసిన వారిలో కామేపల్లి తులసిబాబు కూడా ఉన్నారన్న ఆరోపణలపై ఇటీవల పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా తులసిబాబు కీలక అంశాలు చెప్పినట్లు తెలుస్తోంది. అందులో సునీల్‌ అక్రమాల వివరాలు కూడా ఉండటంతో.. పోలీసులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారట. దీంతో ఇప్పటికే సీఐడీ మాజీ చీఫ్‌పై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..రఘురామ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని సునీల్‌పై చర్యలకు సిద్ధమవుతోందట.

Also Read : ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఇలా అయితే ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడరు!

సునీల్ అరెస్ట్ ఖాయమేనని పోలీస్ వర్గాల్లో టాక్..
అయితే సునీల్‌పై నమోదైన ప్రతి అభియోగం వాస్తవమా కాదా అనేది తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దర్యాప్తులో స్పీడును పెంచారు. ఈ నేపథ్యంలో సునీల్ రౌండప్ అయినట్లేనని..ఆయన అరెస్ట్ ఖాయమన్న టాక్ పోలీస్ వర్గాల్లో వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి మరి.