Gossip Garage : లెక్కలన్నీ బయటకొస్తున్నాయి. తప్పులేవో తేలుతున్నాయి.. అక్రమాలు జరిగాయా? అడ్డగోలు పనులు చేశారా? వ్యవస్థలను నాశనం చేశారా? అధికారులను మేనేజ్ చేశారా? ఏదైనా సరే మొత్తం బయటపడాల్సిందే… జాతకాలన్నీ తేల్చాల్సిందే… ఇది చంద్రబాబు ప్రభుత్వం స్ట్రాటజీ. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు శ్వేతపత్రాలు విడుదల కొత్తేమీ కాదు. కానీ, ఆయన ఎందుకు ఈ వైట్ పేపర్లను రిలీజ్ చేస్తారనేది అతికొద్ది మందికి మాత్రమే తెలుసు.. శ్వేతపత్రాలతో చంద్రబాబు ఏం చేస్తారు? అసలు వైట్‌పేపర్ వెనుక అసలు ఉద్దేశమేంటి?
బాబు బాగా ఇరికించేస్తున్నారు..
రాజకీయం అంటే ఓ స్ట్రాటజీ… రాజకీయమంటే ఓ విధానం… ఎదుటివారి తప్పులను ఎత్తిచూపడం.. భవిష్యత్‌లో వారిని కంట్రోల్ చేయడానికి స్కెచ్ వేయడమూ రాజకీయంలో భాగమే…. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఇదే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. పక్కా స్కెచ్ ప్రకారం మాజీ సీఎం జగన్ హయాంలో జరిగిన తప్పులన్నీ ఆధారాలతో సహా బయటకు తీస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనేది చాలామందికి అంతుబట్టని విషయం… కానీ, చంద్రబాబు మార్కు పాలిటిక్స్ తెలిసిన వారు… బాబు బాగా ఇరికించేస్తున్నారని చెబుతున్నారు.
గత ప్రభుత్వం తప్పులన్నీ బయటకు తీస్తున్న సీఎం..
అధికారం చేపట్టగానే ఏడు అంశాలపై వైట్ పేపర్ తేవాలనేది చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, అమరావతి, విద్యుత్ రంగాలపై వైట్ పేపర్లను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆర్థిక శాఖపైనా శ్వేతపత్రం విడుదల చేయాలని ముహూర్తం నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్న విషయం ప్రజలకు తెలియజేయాలనేది చంద్రబాబు వ్యూహం. శ్వేతపత్రం విడుదలకు సంబంధించిన సన్నాహాక సమావేశంలో రాష్ట్రం సుమారుగా 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని తెలిపారు అధికారులు. అంటే ఆర్థిక శ్వేతపత్రంలో ఏముందో చెప్పకనే చెప్పినట్లైంది. ఇక పర్యావరణం, ఇసుక, మద్యం విధానాలపైనా వైట్ పేపర్లు రెడీ అవుతున్నాయి. అయితే ఈ వైట్ పేపర్లలో గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్న చంద్రబాబు… భవిష్యత్‌లో తాను ఏం చేయనున్నది ఎత్తి చూపుతున్నారు.
భవిష్యత్‌లో ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేసేలా స్కెచ్..
అయితే చంద్రబాబు శ్వేతప్రతాల ద్వారా కొత్తగా చెబుతున్నదేమీ లేదని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. లెక్కలు తారుమారు చేస్తున్నారని నిందిస్తున్నాయి. కానీ, వాస్తవానికి ప్రతిపక్షాలను కట్టడి చేయడమే ధ్యేయంగా చంద్రబాబు కదులుతున్నారనేది సుస్పష్టం. 2019లో టీడీపీ ప్రభుత్వం పోలవరం పనులను 72 శాతం పూర్తి చేశామని ఇలాంటి శ్వేతప్రతాల ద్వారానే తెలియజేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 72 శాతం పనులు జరిగాయని స్వయంగా అంగీకరించింది. ఇప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య తేడా ఏంటి? ఎవరి హయాంలో ఎంత పని జరిగిందీ చెప్పడానికి శ్వేతపత్రం ఓ అస్త్రంగా మారింది. 2019కు ముందు చంద్రబాబు హయాంలో జరిగిన పనులు.. ఆ తర్వాత ఐదేళ్లు చేసిన పనుల్లో తేడాను శ్వేతప్రతాల్లో తెలియజేయడం ద్వారా మరో ఐదేళ్ల వరకు ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేయడమే చంద్రబాబు ప్లాన్.
ప్రత్యర్థిని కోలుకోకుండా దెబ్బతీయడమే ప్లాన్..
ఒక్క పోలవరమే కాదు, అమరావతి విషయంలోను… తాజాగా సిద్ధం చేస్తున్న ఆర్థిక శ్వేతపత్రంపైనా ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారు చంద్రబాబు. ఇలా లెక్కలు చూపడమే కాదు.. తాను అధికారంలోకి వచ్చాక మార్పు మొదలైందని చాటడమూ ఇందులో వ్యూహమే… పోలవరంపై శ్వేతపత్రాన్ని పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనే విడుదల చేశారు. ఇక అమరావతి విషయంలోనూ అదే వ్యూహం అమలు చేశారు. లెక్కలు చెప్పి ప్రజలను మాయచేయడం అనే విమర్శల స్థానంలో స్వయంగా తాను క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడి పరిస్థితులను వివరించడం ద్వారా గత ఐదేళ్ల నష్టాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కూడా తన వంతుగా శ్వేతపత్రాలు.. ఇతర పరిపాలన వ్యవహారాలను చూస్తూ బాలెన్స్ చేస్తున్నారు. ఇలా ప్రత్యర్థి పార్టీని కోలుకోకుండా దెబ్బతీయడమే చంద్రబాబు ప్లాన్. త్వరలో విడుదల చేయబోయే ఆర్థిక శ్వేతప్రతంపై ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చేశారు చంద్రబాబు.
గత ఐదేళ్ల నష్టాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం..
రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించడం ద్వారా.. పథకాలు, సంక్షేమ పథకాల కోసం తన ప్రభుత్వం ఎంతలా శ్రమిస్తున్నదీ చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని బాగు చేయడంతోపాటు సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లడం అనే విషయం ప్రజల మదిలో చిరస్థాయిలో గుర్తిండిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక వ్యూహం ప్రకారం కదులుతున్న చంద్రబాబు ప్రతిపక్షాన్ని మాత్రం ఊపిరి తీసుకోకుండా… ఇప్పట్లో కోలుకోనీయకుండా దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Also Read : ఓవైపు కేసులు, మరోవైపు తిరుగుబాట్లు..! పీకల్లోతు కష్టాల్లో కొడాలి నాని