Gossip Garage : కూటమి నేతలకు సీఎం చంద్రబాబు న్యూ ఇయర్ గిఫ్ట్‌..! ఆ లక్కీ చాన్స్ ఎవరికి?

పొత్తులో భాగంగా చాలామంది నేతలకు.. ఎన్నికల సమయంలో నిరాశే మిగిలింది. వాళ్లలో చాలామంది ఎమ్మెల్సీ పదువుల మీద ఆశలు పెట్టుకుంటే.. మరికొందరు కార్పొరేషన్‌ చైర్మన్‌గా అవకాశం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.

Gossip Garage : ఇంకొన్ని రోజుల్లో న్యూ ఇయర్. పార్టీ నేతలకు కొత్త ఏడాది గిఫ్ట్‌లు ఇచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నారు. కూటమి పార్టీల నేతలకు.. కొత్త సంవత్సరం ఆరంభంలోనే నామినేటెడ్‌ పదవుల బహుమతి లభించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలతో పాటు.. సహకార సంస్థలు, మార్కెట్‌ కమిటీల పదవులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ఓ లిస్ట్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ జాబితాలో ఉన్నది ఎవరు.. ఎవరికి ఆ లక్కీ చాన్స్‌..

ఏపీలో పదవుల జాతర..
ఆంధ్రప్రదేశ్‌లో పదవుల జాతర మొదలుకాబోతోంది. NDA పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు.. నూతన సంవత్సర కానుక ఇవ్వనున్నారు. మూడు పార్టీల నుంచి నామినేటెడ్ పదవుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్లంతా.. గుడ్‌న్యూస్ వినే సమయం దగ్గరలోనే ఉంది. ఖరారు చేయాల్సిన పదవులు.. వ్యక్తుల గురించి బీజేపీ, జనసేన నుంచి చంద్రబాబుకు జాబితా అందింది.

చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు కూడా జరిగాయ్‌. దీంతో పెద్ద మొత్తంలో నామినేటెడ్ పదవులను ప్రకటించేందుకు తుది కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గ‌త రెండు జాబితాల్లో జ‌న‌సేన‌, బీజేపీల‌ కంటే.. టీడీపీ నేత‌ల‌కే ఎక్కువగా ప‌ద‌వులు దక్కాయ్‌. ఐతే ఈసారి కూడా పోటీ ఎక్కువగానే కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి రేపుతోంది.

త్యాగం చేసిన టీడీపీ నేతలకు ప్రాధాన్యత..
పొత్తులో భాగంగా చాలామంది నేతలకు.. ఎన్నికల సమయంలో నిరాశే మిగిలింది. వాళ్లలో చాలామంది ఎమ్మెల్సీ పదువుల మీద ఆశలు పెట్టుకుంటే.. మరికొందరు కార్పొరేషన్‌ చైర్మన్‌గా అవకాశం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఎవరికి ఏ పదవి అనే విషయంపై చంద్రబాబు ఇప్పటికే క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్దుల కోసం సీట్లు త్యాగం చేసిన టీడీపీ నేతలకు.. ఈ లిస్టులో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. పిఠాపురం నుంచి వర్మతో పాటు.. దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి లాంటి వారు ఉన్నారు. వీరంతా ఈ లిస్ట్‌లో శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయ్‌.

Also Read : ఆదిలాబాద్ కాంగ్రెస్‌‌లో కొత్త టెన్షన్ ఏంటి..? ఆ నేతల రాజకీయ భవిష్యత్‌ను కారు చీకట్లు కమ్ముతున్నాయా?

ఇక రాష్ట్రస్థాయిలో ఉన్న 60 కార్పొరేషన్ల పదవుల కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. బేవరేజెస్ కార్పొరేషన్, ఆప్కాబ్, ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్, డైరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్, షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదువులు ఉన్నాయి. వీటితో పాటుగా అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్, నెడ్ క్యాప్, ప్రణాళిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా కుల సంఘాల పదవులు ఖరారు కావాల్సి ఉంది.

వారికి పదవులు ఖారారైనట్లుగా ప్రచారం..
ఈసారి జాబితాలో మూడు పార్టీల నుంచి పదవులు ఆశిస్తున్న వారిలో.. కొందరికి పదవులు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీ ఆశావాహుల్లో గన్ని ఆంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవీ సుబ్బారెడ్డి, ప్రభాకర్ చౌదరి, సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పేర్లు ఉన్నాయ్‌.

జనసేన నుంచి అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.. బీజేపీ నుంచి పాతూరు నాగభూషణం, అన్నం సతీష్, బాజీ, కోలా ఆనంద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సీట్లు త్యాగం చేసిన నేతలు.. ఎమ్మెల్సీ స్థానాల పైన ఆశలు పెట్టుకుంటున్నారు. దీంతో, చంద్రబాబు ప్రకటించే జాబితాపై ఉత్కంఠ కనిపిస్తోంది.

వీటితో పాటు.. సహకార సంస్థలు, మార్కెట్‌ కమిటీల పదవులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దాదాపు 10వేల పదవులు క్షేత్రస్థాయి నేతలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయ్. వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలోపు వాటికి నామినేటెడ్‌ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 300 వ్యవసాయ సహకార సొసైటీలు ఉన్నాయ్‌. సంక్రాంతి నాటికి ఈ పదవులు భర్తీ చేయాలన్న యోచనలో ఉన్నారు. ఏమైనా కొత్త ఏడాదిలో నేతలు వరుస గుడ్‌న్యూస్‌లు వినడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Also Read : వైసీపీని వీడి బీజేపీలో చేరిన ఆడారి ఆనంద్.. జగన్ పార్టీకి మరో ఆయుధం దొరికినట్లేనా?