Gossip Garage : అయ్యో.. అయ్యయ్యో..! అనవసరంగా బీఆర్ఎస్‌ను వీడామని ఆ జిల్లా నేతలు ఆవేదన చెందుతున్నారా?

కొందరు పైకి కలివిడిగా కనిపించినా.. విడివిడిగా ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్తున్నారట. మరికొందరు ఎందుకొచ్చిన తలపోటు అని.. హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని టాక్.

Gossip Garage : అయ్యో.. అయ్యయ్యో..! అనవసరంగా బీఆర్ఎస్‌ను వీడామని ఆ జిల్లా నేతలు ఆవేదన చెందుతున్నారా?

Gossip Garage Adilabad Congress

Updated On : December 27, 2024 / 6:36 PM IST

Gossip Garage : ఇటు నుంచి అటు వెళ్లారు.. అక్కడ మంచి పదవుల్లో కొనసాగారు. సరిగ్గా ఎన్నికల ముందు అటు నుంచి ఇటు వచ్చారు. ఐతే ఇక్కడే పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారింది. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను శాసించిన నేతల రాజకీయ భవిష్యత్.. ఇప్పుడు అయోమయంలో పడినట్లు కనిపిస్తోంది. కారు దిగి చేయి పట్టుకున్న నేతలకు.. చేయి అందించే వాళ్లు లేకుండా పోతున్నారా.. సొంత పార్టీ నేతలే కాదు.. జనాలు కూడా పట్టించుకోవడం లేదా.. ఇంతకీ ఎవరా నేతలు.. ఏంటా కథ.. ఆదిలాబాద్ కాంగ్రెస్‌ను వెంటాడుతున్న టెన్షన్ ఏంటి..

హస్తం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదనే గుసగుసలు..
బీఆర్ఎస్‌లో పదేళ్లపాటు అధికారం అనుభవించిన ఆ నేతలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకచత్రాధిపత్యం కొనసాగించారు. ఐతే 2023 ఎన్నికల ముందు కారు పార్టీని వీడి.. అధికార కాంగ్రెస్‌లో చేరారు. ఐతే ఇప్పుడు హస్తం పార్టీలో వారికి ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయ్‌. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.. రెండు దఫాలు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డితో పాటు.. ముథోల్‌, ఖానాపూర్, బోథ్, సిర్పుర్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన విఠల్ రెడ్డి, రేఖా నాయక్, రాథోడ్ బాపూరావు, కోనేరు కోనప్పతో పాటు.. మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి.. కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.

రేఖానాయక్ అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లోనే జంప్‌ చేయగా.. మిగిలిన నేతలు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కారును వదిలి కాంగ్రెస్‌లో చేరారు. కీలక నేతలు చేరారు.. పార్టీ స్ట్రాంగ్ అవుతుంది.. చేరిన నేతలు స్ట్రాంగ్ అవుతారు అనుకుంటే.. అనుకున్నది ఒకటి.. అవుతోంది ఒకటి అన్నట్లుగా సీన్ కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. ఈ నేతలు ఎక్కడా కనిపించకపోవడం.. కొత్త చర్చకు కారణం అవుతోంది.

Also Read : వీడిన మిస్టరీ.. పార్శిల్‌లో మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..

పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని మనోవేదన..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కతో పాటు.. ఇతర మంత్రులు జిల్లాల్లో పర్యటించిన సమయంలో.. ఈ నేతలెవరూ కనిపించలేదు. జిల్లాలో భారీ వర్షాలు, వరదలు సంభవించినా.. ఏ ఒక్కరిని పలకరించకుండా వీళ్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భమూ లేదు. ఐతే పార్టీలో తమకు కనీస గౌరవం దక్కడం లేదని ఆ నేతలంతా మనోవేదనకు గురవుతున్నారట. దీంతో పార్టీకి, ప్రజలకు దూరంగా ఉంటున్నారని టాక్‌.

ఇక అటు వీళ్లు అన్ని కార్యక్రమాలకు గైర్హాజరు అవుతున్నా.. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇంచార్జిలు కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ పరిణామాలను ఆ నేతలు మరింత అవమానంగా భావిస్తున్నారు. దీంతో వారి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ తెరమీదకు వస్తోంది.

పాత, కొత్త నేతల మధ్య విభేదాలు..!
మాజీ మంత్రి ఇంద్రకరణ్‌తో పాటు.. విఠల్ రెడ్డి, రేఖానాయక్, కోనేరు కోనప్ప, రాథోడ్ బాపూరావుతో పాటు మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి అంతా ఓ గ్రూప్‌గా ఏర్పడి తెగ ఫీల్ అవుతున్నారని టాక్. అనవసరంగా బీఆర్ఎస్‌ను వీడామని.. సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. మహేష్‌ కుమార్ గౌడ్‌ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఈ నేతలంతా ఒక గ్రూప్‌గా శుభాకాంక్షలు చెప్తే.. ఆదిలాబాద్‌కు చెందిన పాత కాంగ్రెస్ నేతలంతా మరొక గ్రూప్‌గా విషెస్‌ చెప్పారట.

ఇలా ఆదిలాబాద్‌లో పాత, కొత్త నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి.. పార్టీని మరింత బలోపేతం చేయాలని.. నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేస్తున్నా.. పాత, కొత్త నేతల సమన్వయ లోపం నేతలను టెన్షన్‌ పెడుతోంది. జిల్లాలో పరిమామాలు.. త్వరలో గ్రూప్ రాజకీయాలకు తెరతీసే పరిస్థితులు కనిపిస్తున్నాయ్.

పత్తా లేని ఇంద్రకరణ్‌ రెడ్డి, పాటు వేణుగోపాల చారి..!
ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు వేణుగోపాల చారి పూర్తిగా పత్తా లేకుండా పోయినట్లు కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు పరామర్శలకు తప్పిస్తే.. ఇంద్రకరణ్‌ పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితం అయినట్లు తెలుస్తోంది. వేణుగోపాలచారి కూడా అప్పుడప్పుడు ముధోల్‌లో కనిపించినా.. కాంగ్రెస్‌లో చేరాక మాత్రం అటు వైపు కూడా చూడడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ముథోల్‌ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కూడా.. తమ తమ నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, పార్లమెంట్ ఎన్నికలకు అంటీముట్టనట్టు ఉండటం చూస్తే.. ఈ మాజీల రాజకీయ భవిష్యత్‌ దారి తప్పిందేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు పెద్దగా అటెండ్ కావడం లేదు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు, పార్టీలో ఆధిపత్య పోరు భరించలేక.. ఆయన న్యూట్రల్‌గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఓవరాల్‌గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్‌ నేతల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారయింది. కొందరు పైకి కలివిడిగా కనిపించినా.. విడివిడిగా ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్తున్నారట. మరికొందరు ఎందుకొచ్చిన తలపోటు అని.. హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని టాక్. ఓవరాల్‌గా కారు పార్టీ వదిలిన నేతల రాజకీయ భవిష్యత్‌ను కారు చీకట్లు కమ్ముతున్నాయా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్.

 

Also Read : మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఆయన ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారంటే..