Manmohan Singh: మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఆయన ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారంటే..
మన్మోహన్ సింగ్, గురుశరణ్ కౌర్ కు ముగ్గురు కుమార్తెలు. వారు ముగ్గురు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు.

Manmohan Singh
Manmohan Singh Net Worth: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు రాజకీయ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు మన్మోహన్ సింగ్ పార్ధివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. శనివారం ఉదయం ఆయన పార్ధివ దేహాన్ని తన నివసాం నుంచి ప్రజల సందర్శనార్థం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. అనంతరం రాజ్ ఘాట్ సమీపంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read: Manmohan Singh: ఒరాక్ ఒబామా తాను రాసిన పుస్తకంలో మన్మోహన్ సింగ్ గురించి ఏమన్నారో తెలుసా?
మన్మోహన్ సింగ్ 1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. ఏడాది తరువాత ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. 1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గానూ పనిచేశారు. 1991లో తొలిసారిగా రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఆ తరువాత కొన్ని నెలలకే పీవీ నర్సింహారావు నేతృత్వంలోని కేబినెట్ లో 1996 వరకు దేశ ఆర్థిక మంత్రిగా కొనసాగారు. 1998- 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2004లో భారతదేశ 14వ ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. పదేళ్లపాటు ప్రధానమంత్రి హోదాలో కొనసాగారు. తన పదవీకాలంలో కీలక నిర్ణయాలు తీసుకొని ప్రజా మద్దతు పొందారు. ప్రధానమంత్రి పదవి వీడిన తరువాత తన భార్య గురుశరణ్ కౌర్ తో కలిసి ఢిల్లీలో ఉంటున్నారు. ఇక ఆయన ఆస్తుల గురించి చెప్పాలంటే.. 2019లో చివరిసారిగా ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో తన అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులు, ఆదాయాల వివరాలను వెల్లడించారు. అప్పటి రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.15కోట్ల77లక్షలు. ఢిల్లీ, చండీగఢ్ లో అపార్ట్ మెంట్లు ఉన్నాయి. వాటి విలువ సుమారు రూ.7.27 కోట్లు ఉంటుంది. ప్రస్తుతం దాని విలువ పెరిగింది. ఆయనకు ఎలాంటి అప్పులు లేవు.
Also Read: Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతిపట్ల పవన్ కల్యాణ్, జగన్ మోహన్ రెడ్డి సంతాపం
1932 సెప్టెంబర్ 26న పశ్చిమ పంజాబ్ లోని గాహ్ లో మన్మోహన్ సింగ్ జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్థాన్ భూభాగంలో ఉంది. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్. ఆమె 1937 సెప్టెంబర్ 13న జలంధర్ లో జన్మించారు. 1958లో మన్మోహన్ సింగ్, గురుశరణ్ కౌర్ వివాహం జరిగింది. అయితే, వారిద్దరిదీ ప్రేమ వివాహం అని ప్రచారంలో ఉంది. పెళ్లి జరిగిన కొత్తలో వివాహబంధానికి గుర్తుగా కొనుక్కున్న మారుతి-800ని ఇప్పటికీ ఆమె వాడుతారు. మన్మోహన్ సింగ్, గురుశరణ్ కౌర్ కు ముగ్గురు కుమార్తెలు. వారులో ఉపిందర్ సింగ్, అమృత్ సింగ్, దమన్ సింగ్.
మన్మోహన్ సింగ్ పెద్దకుమార్తె ఉపిందర్ సింగ్ అశోక విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ డీన్. గతంలో ఢిల్లీ యూనివర్శిటీలో చరిత్ర విభాగం హెడ్ గానూ పనిచేశారు. ఆమె ప్రాచీన భారతీయ చరిత్ర, పురావస్తు శాస్త్రం, పొలిటికల్ ఐడియాస్ పై విస్తృతంగా పరిశోధన జరిపారు. మన్మోహన్ సింగ్ రెండో కుమార్తె అమృత్ సింగ్ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది. హింస, ఏకపక్ష నిర్బందం పద్దతులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికపై సైతం ఆమె తన గళం వినిపించారు. చిన్న కుమార్తె దమన్ సింగ్. ఆమె మంచి రచయిత్రి. ఆమె భర్త అశోక్ పట్నాయక్ 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. దమన్ సింగ్ పుస్తకాలు, రచనలు ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రతిబింబిస్తాయి.