Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతిపట్ల పవన్ కల్యాణ్, జగన్ మోహన్ రెడ్డి సంతాపం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం, వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతిపట్ల పవన్ కల్యాణ్, జగన్ మోహన్ రెడ్డి సంతాపం

Manmohan Singh

Updated On : December 27, 2024 / 8:34 AM IST

Manmohan Singh Passes Away: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ నాయకులు, రాజకీయరంగ ప్రముఖులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు మన్మోహన్ సింగ్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తూ.. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ ప్రధాని మృతికి సంతాపం తెలియజేశారు.

Also Read: Manmohan Singh: తెలంగాణలో ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు

పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా మన్మోహన్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ‘‘భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆధ్యులలో మన్మోహన్ సింగ్ ఒకరు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ చైర్మన్ గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. మన్మోహన్ సింగ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేశారు. ‘‘మన్మోహన్ సింగ్ మృతివార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం దేశానికి తీరని లోటు. పదేళ్లపాటు దేశ ప్రధానిగా గొప్ప సేవలందించారు. ఆర్బీఐ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిటీ చైర్మన్‌గా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్‌ సింగ్‌ గొప్ప మేధావి. దేశంలో పేదరికాన్ని పారదోలేందుకు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అసమాన సేవలందించారు. ఆయన కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ఏ బాధ్యత నిర్వహించినా ప్రతిచోటా తనదైన ముద్ర కనబర్చారు. ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయం. మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక మహానాయకుడిని కోల్పోయింది.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ మృతిపట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.