Gossip Garage: ఎన్నికల్లో వైసీపీ ఓటమికి మాజీమంత్రి ప్లాన్? సిట్టింగ్ ఎమ్మెల్యేపై కుట్రలు? ఎవరా నేత, ఎందుకిలా..

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జరిగిన మండల పరిషత్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ సంచలన విజయం సాధించడంతో కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చాయట.

Gossip Garage: ప్రకాశం జిల్లాలో ఆ మాజీ మంత్రి తన దూకుడును ప్రదర్శిస్తున్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎర్త్ పెట్టేందుకు ఆ మాజీ మంత్రి వర్యులు ప్రయత్నిస్తున్నారా? సొంత పార్టీలోనే ఉంటూ తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నారా? ఆ మాజీ మంత్రి ఎత్తులు, పైఎత్తులు బయటకు లీక్ కావడంతో సొంత పార్టీ నేతల నుంచే సెగ మొదలైందా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఆయన చేస్తున్న కుట్రలేంటి? పార్టీ అధిష్టానం ఎలాంటి అక్షింతలు వేసింది?

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారాయి. సొంత పార్టీలోనే ఉన్న ఆదిమూలపు సురేష్ తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నట్లు ఇటీవల బయటపడిందన్న టాక్ వినిపిస్తోంది.

జిల్లా రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకొని ఏకచక్రాధిపత్యంగా జిల్లాను ఏలాలని ఆదిమూలపు సురేష్ భావించారని జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జరిగిన మండల పరిషత్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ సంచలన విజయం సాధించడంతో కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చాయట.

Also Read: తెలంగాణ రాజకీయాల్లో ‘కొత్త’ మంటలు.. ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నదెవరు?

ఎమ్మెల్యే చంద్రశేఖర్ నియోజకవర్గంలో పాతుకుపోతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంట..
తన స్థానమైన యర్రగొండ పాలెంలో ప్రస్తుత ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ విజయం సాధించడం మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ కు అస్సలు నచ్చడం లేదంట. ఎందుకంటే తన కంటే ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖర్ బెటరనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఏర్పడటమే కాకుండా ఆయన నియోజకవర్గంలో పాతుకుపోతుండటాన్ని సురేష్ జీర్ణించుకోలేక పోతున్నారంట.

దీంతో మొన్న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి సురేష్ చక్రం తిప్పారని.. కానీ చివరకు ఆయన వేసిన ఎత్తుగడలేవీ ఫలించక వైసీపీ సంచలన విజయాన్ని నమోదు చేయడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

టీడీపీకి సపోర్ట్ చేశారన్న టాక్..
త్రిపురాంతకంలో ఎంపీపీ, పుల్లలలచెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో లోపాయికారీగా ఆదిమూలపు సురేష్ టీడీపీకి సపోర్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. త్రిపురాంతకంలో గత ఎన్నికల్లో 18కి 18 వైసీపీ దక్కించుకుంది. పుల్లలచెరువులో 15 స్దానాలకు 10 వైసీపీ, 5 టీడీపీ గెలిచింది. కోట్ల సుబ్బారెడ్డి తొలి రెండున్నరేళ్లు, ఆళ్ల ఆంజనేయరెడ్డి తర్వాత రెండున్నరేళ్లు ఎంపీపీ పదవిని నిర్వహించేలా అధిష్టానం ఒప్పించింది.

అయితే కోట్ల సుబ్బారెడ్డి రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. అదే సమయానికి ఎంపీటీసీగా ఉన్న ఆళ్ల ఆంజనేయరెడ్డి జైల్లో ఉండటంతో ఎంపీటీసీగా ఉన్న ఆయన సతీమణి ఆళ్ల సుబ్బమ్మను వైసీపీ అధిష్టానం ఎంపీపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది.

అయితే ఆమె భర్త ఆంజనేయరెడ్డి జైలుకెళ్లడంతో ఎంపీపీ ఎన్నికల్లో 17 మంది ఎంపీటీసీలే హాజరయ్యారు. ఒక దశలో వైసీపీకి 8, టీడీపీకి 8 మంది ఎంపీటీసీల మద్దతు లభించటంతో ఎంపీటీసీ మాలపాటి సృజన ఓటు కీలకమైంది. ఆమె కూడా టీడీపీకే మద్దతిస్తుందని భావించారు. అనూహ్యంగా సృజన వైసీపీకే జైకొట్టడంతో ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ విజయం సాధించారు.

Also Read : ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్.. రూ.20వేలు ఇచ్చేది ఈ నెలలోనే.. డేట్ చెప్పేసిన మంత్రి

 

ఎంపీపీ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ తెరవెనుక నడిపించిన తతంగం అంతా బయటకు వచ్చిందట. సురేశ్‌కు చెందిన జార్జ్ కళాశాలలో ఎంపీటీసీ సృజన సోదరి మాలపాటి వసుంధర లెక్చరర్ గా పని చేస్తున్నారు. చల్లా జ్యోతికి అనుకూలంగా సృజన ఓటు వేయకపోవడంతోనే ఆమె సోదరిని విధుల నుంచి తప్పించారని టాక్. పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఎమ్మెల్యే చంద్రశేఖర్‌..ఎప్పటికప్పుడు వాటిని హైకమాండ్‌కు చేరవేస్తున్నారట. దీంతో హైకమాండ్‌ ఆదిమూలపు సురేశ్‌కు గట్టిగానే మందలించినట్లు తెలుస్తోంది.

అయితే పొరపాటు జరిగిందని ఒప్పుకున్న సురేశ్‌ తిరిగి విధుల్లో చేరాలని వసుంధరను కోరారట. యర్రగొండపాలెం విషయంలో జోక్యం చేసుకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ అధినేత జగన్ మందలించారట. సురేష్ రీఎంట్రీ కోసమే నియోజకవర్గంలో పార్టీని రెండు గ్రూపులుగా చేసి ఉంటారని పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన సురేష్ టీడీపీతో జట్టుకట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సురేష్ ఇక పార్టీలో ఉండలేరని ఆయన పార్టీ మారడం ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో యర్రగొండపాలెంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here