వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

అధికారం పోయిన నెల రోజులుకే ఈ పరిస్థితి ఎదురైతే.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…. అందుకేనేమో పవర్‌ లేని పార్టీలో ఉండటానికి నేతలు ఇష్టపడరు… అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోడానికి ప్రయత్నిస్తుంటారు. రాజకీయంలో ఇది చాలా కామన్‌ అయినా… ఏపీలో ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తున్న వైసీపీకి చాలా కష్టంగానే కనిపిస్తోంది. 151 సీట్లతో తిరుగులేని అధికారం చెలాయించిన వైసీపీ… ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైంది. ఇక ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీల అండతో ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామంటే… వారు కూడా ఒక్కొక్కరుగా జారిపోతున్నారట. సేఫ్‌ జోన్‌ కోసం కూటమి పార్టీలను ఆశ్రయిస్తున్నారట… వైసీపీ నుంచి చాలా మంది జంపింగ్‌కు సిద్ధమవుతుండగా, గోదావరి తీరంలో ఇద్దరు నేతల తీరు మాత్రం సందేహస్పదంగా మారిందంటున్నారు.

బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లుగా ప్రచారం..
వైసీపీకి షాకిచ్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు, ఎంపీలు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని టీడీపీ… ఇప్పటికే కొందరు రాజ్యసభ ఎంపీలతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా, కొందరు ఎమ్మెల్సీలు అధికార కూటమి దిశగా అడుగులు వేస్తున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు… బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం ఎక్కువైంది. అసెంబ్లీ లాబీల్లో మంత్రి లోకేశ్‌ సమక్షంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు ఈ చర్చను లేవనెత్తినట్లు చెబుతున్నారు.

అధికార పార్టీ అండ లేకపోతే నష్టమే అన్న భావన..
గోదావరి జిల్లాలకు చెందిన తోట త్రిమూర్తులు బలమైన కాపు నేత. గతంలో టీడీపీలో పనిచేశారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో వైసీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. ఐతే శిరోముండనం కేసులో దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న త్రిమూర్తులుకు విశాఖ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పీలుకు వెళ్లిన త్రిమూర్తులు తాత్కాలికంగా ఉపశమనం పొందారు. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ అండ లేకపోతే రాజకీయం చేయడం వ్యక్తిగతంగా కూడా నష్టమని భావిస్తున్న త్రిమూర్తులు…. కూటమిలోని బీజేపీలో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ విషయంపై అదే జిల్లాకు చెందిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి… మంత్రి సత్యకుమార్‌ వద్ద ఆరా తీయడంతో అసలు సమాచారం బయటకు వచ్చింది. వైసీపీ నుంచి ఏ నాయకుడు వచ్చినా కూటమి మధ్య చర్చ జరగాలని ఆ సందర్భంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

బీజేపీ బలపడాలంటే అలాంటి నాయకుల చేరికను ప్రోత్సహించాలనే భావన..
కానీ, రాజకీయ అవసరాల దృష్ట్యా త్రిమూర్తులు చేరికను బీజేపీ వ్యతిరేకించే అవకాశం లేదంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే త్రిమూర్తులు వంటి నాయకులు చేరికను ప్రోత్సహించాలని ఆ పార్టీ భావిస్తోందంటున్నారు. దీంతో త్రిమూర్తులు త్వరలో బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి నష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మరో సీనియర్‌ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కూడా పార్టీ మారే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తోంది.

కూటమి సునామీలో ఓటమిపాలయ్యారు..
2019 ఎన్నికల్లో మండపేట నుంచి పోటీ చేసిన బోస్‌ ఓటమి పాలయ్యారు. ఐతే మాజీ సీఎం జగన్‌కు మద్దతుగా తొలి నుంచి బోస్‌ పని చేయడం వల్ల…. ఎన్నికల్లో ఓడినా ఎంపీగా అవకాశం ఇచ్చింది వైసీపీ. ఐతే తన సొంత నియోజకవర్గం రామచంద్రపురంలో అప్పటి ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుతో విభేదాల వల్ల పార్టీపై తీవ్ర అసంతృప్తి పెంచుకున్నారు బోస్‌. ఇది గమనించిన మాజీ సీఎం జగన్‌.. మాజీ మంత్రి వేణును రాజమండ్రి రూరల్‌కి మార్చి… రామచంద్రపురం టికెట్‌ను బోస్‌ కుమారుడు సూర్యప్రకాశ్‌కు ఇచ్చారు. కానీ, కూటమి సునామీలో సూర్యప్రకాశ్‌ గెలవలేకపోయారు.

బోస్ పార్టీ వీడతారనే ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ మాత్రం పడటం లేదు..
ఐతే బోస్‌కు ఇంకా రాజ్యసభ పదవీ కాలం ఉండటంతో ఆయనతో టీడీపీ టచ్‌లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, తొలి నుంచి కాంగ్రెస్‌ వాదిగా టీడీపీలో ఇమడలేనని భావించిన బోస్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఐతే తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌ కోసం జనసేనలో చేరేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు తనపై జరుగుతున్న ప్రచారాన్ని బోస్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా…. బోస్‌ పార్టీ వీడతారనే ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ మాత్రం పడటం లేదు.

బోస్‌ పార్టీ మారతారనే ప్రచారానికి ప్రధాన కారణం ఆయన కుమారుడే..!
ఇలా బోస్‌ పార్టీ మారతారనే ప్రచారానికి ప్రధాన కారణం ఆయన కుమారుడే అన్న టాక్‌ వినిపిస్తోంది. గోదావరి జిల్లాల్లో బలమైన శక్తిగా ఎదుగుతున్న జనసేనలో చేరేందుకు బోస్‌ కొడుకు సూర్యప్రకాశ్‌ ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయన జనసేన నేతలతో టచ్‌లో ఉన్నారని అంటున్నారు. దీంతో బోస్‌ కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఐతే ఎంపీ బోస్‌, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇద్దరూ రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన నాయకులే కావడం గమనార్హం. ఈ ఇద్దరూ గతంలో వేర్వేరు పార్టీల్లో ఉంటూ ప్రత్యర్థులుగా రాజకీయం చేశారు. 2019 ఎన్నికల తర్వాత ఇద్దరూ ఒకే పార్టీలో ఉంటూ సర్దుకుపోతున్నారు. 2019లో బోస్‌, 2024లో తోట త్రిమూర్తులు మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

వైసీపీకి మరిన్ని ఇబ్బందులు తప్పవనే ఆందోళన..
ఇప్పుడు ఇద్దరూ ప్రత్యామ్నాయం వెతుకుతున్నారనే టాక్‌… రాజకీయంగా అలజడి రేపుతోంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిన వైసీపీ… త్రిమూర్తులు, బోస్‌ వంటి కీలక నేతలు వలస పోతే మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయాలు ఆసక్తిరేపుతున్నాయి. అధికారం పోయిన నెల రోజులుకే ఈ పరిస్థితి ఎదురైతే.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.

Also Read : టీడీపీని వీడి వైసీపీలో చేరి పెద్ద తప్పు చేశారా? ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ లైఫ్ ఇక క్లోజేనా?

ట్రెండింగ్ వార్తలు