మళ్లీ టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆ ముగ్గురు నేతలు..! చీరాలలో రసవత్తర రాజకీయం

మొత్తానికి నిన్నటి వరకు నువ్వానేనా అన్నట్లు తలపడిన ఇద్దరు నేతలు... మళ్లీ ఒకే పార్టీ వైపు చూడటమే ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇద్దరిలో ఎవరికి గ్రీన్‌సిగ్నల్‌ వస్తుందనేదే సస్పెన్స్‌గా మారింది.

Gossip Garage : నిన్నటి వరకు ఆ ముగ్గురు నేతలు రాజకీయ ప్రత్యర్థులు. ముగ్గురివీ మూడు భిన్న దృక్పథాలు. వేర్వేరు దారులు. కానీ, కాకతాళీయమో… యాథృచ్చికమో.. ముగ్గురిదీ ఎప్పుడూ ఒకే పార్టీ. అయితే ఒకే గూటిలో ఉన్నా.. వారి మధ్య సఖ్యత మాత్రం కనిపించదు. ఓ ఇద్దరు నేతలైతే ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతుంటారు. గత ఐదేళ్లు ఇదే లెక్కన ఢీకొట్టిన నేతలు…. ఇప్పుడు మళ్లీ ఒకే పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? ఏ నియోజకవర్గం వారు? వారు చేరదామనుకున్న పార్టీ ఏంటి?

టీడీపీలో చేరేందుకు తెగ ప్రయత్నం..
చీరాల…. రాష్ట్ర రాజకీయాల్లోనే చీరాల నియోజకవర్గానికి సెపరేట్‌ చాప్టర్‌. ఎప్పుడూ హైవోల్టేజ్‌ రాజకీయాలకు నెలవైన చీరాలలో.. తాజా రాజకీయం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. నిన్నటివరకు ఉప్పు-నిప్పులా రాజకీయం నెరపిన ఈ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నేతలు…. అధికార టీడీపీలో చేరేందుకు తెగ ప్రయత్నిస్తున్నారనే టాక్‌ పాలిటిక్స్‌ను రసవత్తరంగా మార్చేస్తోంది. చీరాల తాజా మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం…. ఎన్నికల ముందు వైసీపీకి గుడ్‌బై చెప్పిన మరో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రస్తుతం టీడీపీలో చేరేందుకు ట్రై చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

మళ్లీ టీడీపీ తలుపు తడుతున్నారనే టాక్..
2019 ఎన్నికలకు ముందు వరకు ఈ ముగ్గురూ టీడీపీలో కొనసాగిన వారే… 2019 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలో చేరగా, ఆ తర్వాత కరణం బలరాం, పోతుల సునీత వైసీపీలోకి వచ్చారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమంచి వైసీపీని వీడగా, ప్రస్తుతం కరణం, పోతుల సునీత ఇంకా ఆ పార్టీలోనే ఉన్నారు. ఐతే ఖాళీగా ఉన్న ఆమంచి… ఓడిపోయిన పార్టీలో ఎందుకని కరణం, పోతుల సునీత మళ్లీ టీడీపీ తలుపు తడుతున్నారనే టాక్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మళ్లీ సైకిల్ ఎక్కేందుకు సుజనా చౌదరి ద్వారా మంత్రాంగం..
2019 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేశారు కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్‌. బలరాం ఎమ్మెల్యేగా గెలవగా, కొద్దికాలంలోనే వైసీపీకి సానుభూతిపరుడిగా మారిపోయారు. ఇక గత ఎన్నికల్లో ఆయన కుమారుడు వెంకటేశ్‌ను పోటీకి దింపారు. 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బలరాం… ఆ తర్వాత వైసీపీకి దగ్గరైనా ఎప్పుడూ ఆ పార్టీ కండువా మాత్రం కప్పుకోలేదు. సీఎం చంద్రబాబుకు సమకాలీకుడిగా చెప్పుకునే బలరాం… నాలుగు దశాబ్దాలుగా టీడీపీతో సుదీర్ఘ అనుబంధం కొనసాగించారు. కానీ, 2019 ఎన్నికలయ్యాక వైసీపీకి దగ్గరై… టీడీపీ హైకమాండ్‌కు దూరమయ్యారు. ఇదే సమయంలో వైసీపీలో అంతర్గత పోరుతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, తన రాజకీయ అనుభవంతో గత ఎన్నికల్లో కుమారుడికి టికెట్‌ తెప్పించుకున్నా, గెలిపించుకోలేకపోయారు.

ఇదే సమయంలో టీడీపీలో ఆయన సహచరులు అంతా తమ వారసులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం బలరాంను తీవ్రంగా కలిచివేస్తోందని చెబుతున్నారు. దీంతో మళ్లీ టీడీపీలో వెళ్లాలని బలరాం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. తనపట్ల సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నప్పటికీ… పార్టీకి తాను చేసిన సేవలు గుర్తు చేస్తూ… బీజేపీ నేత, విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే సుజనా చౌదరి ద్వారా మంత్రాంగం నడుపుతున్నట్లు చెబుతున్నారు.

కరణం బలరాం చిరకాల ప్రత్యర్థి ద్వారా టీడీపీలో రీఎంట్రీకి ఆమంచి ప్రయత్నాలు..
ఇక బలరాంతో పొసగక వైసీపీకి రాజీనామా చేసి…. గత ఎన్నికల్లో రెబల్‌గా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కూడా టీడీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు ఆమంచి సోదరుడు స్వాములు జనసేనలో చేరారు. ఆ పార్టీలో చేరేందుకు ఆమంచికి లైన్‌క్లియర్‌గా ఉన్నా… తన రాజకీయ ప్రత్యర్థి బలరాంకి చెక్‌ చెప్పాలంటే తాను టీడీపీలో ఉండాలని భావిస్తున్నారట ఆమంచి. అందుకే మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంకి చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా చెప్పే మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ద్వారా తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. రెండుసార్లు చీరాల ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమంచికి నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. 2014లో సొంత పార్టీ పెట్టుకుని గెలిచిన ఆమంచి… ఎమ్మెల్యేగా టీడీపీలో చేరారు.

ఆమె చేరికపై టీడీపీలో అభ్యంతరాలు ఉండకపోవచ్చని టాక్..
2019 ఎన్నికల ముందు కరణం బలరాం చీరాల పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమంచి ఎగ్జిట్‌ అయినట్లు చెబుతున్నారు. ఇక గత ఐదేళ్లు కరణం బలరాంతో తీవ్రస్థాయిలో విభేదించిన ఆమంచి…. ఇప్పుడు బలరాంపై ఆధిపత్యం చెలాయించేందుకు అధికార పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా మళ్లీ టీడీపీలోకి వస్తారనే టాక్‌ వినిపిస్తుండటంతో చీరాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ సునీత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ 2014 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరూ చేతులు కలిపి వైసీపీ అభ్యర్థిని ఓడించారనే టాక్‌ ఉంది. దీంతో సునీత కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకి శాసనమండలిలో తగిన సంఖ్యా బలం లేకపోవడంతో సునీత చేరికపై టీడీపీలో అభ్యంతరాలు ఏమీ ఉండకపోవచ్చంటున్నారు.

చంద్రబాబు ఆయనను మళ్లీ పార్టీలోకి స్వాగతిస్తారా?
ఇటు కరణం బలరాం… అటు ఆమంచి ఎవరికివారుగా టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తుండటంతో చీరాల రాజకీయాల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఎక్కువగా ఉంది. ఎన్నికల ముందు కరణం బలరాంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు… మళ్లీ ఆయనను పార్టీలోకి స్వాగతిస్తారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఐతే తాను వైసీపీకి సానుభూతిపరుడిగా వ్యవహరించినా, ఎప్పుడూ టీడీపీ క్యాడర్‌ను ఇబ్బంది పెట్టలేదని… చంద్రబాబును పెద్దగా విమర్శంచలేదని, ఒకటి రెండు సార్లు మాట్లాడినా… అప్పటి ప్రభుత్వం ఒత్తిడి వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇస్తున్నారట బలరాం.

ఆ ఇద్దరిలో ఎవరికి గ్రీన్ సిగ్నల్?
ఇక ఆమంచి మాత్రం మంత్రి గొట్టిపాటి ద్వారా తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. ఇద్దరికీ మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం టార్గెట్‌ కావడంతో ఆమంచిని చేర్చుకునే విషయంలో టీడీపీ అధిష్టానానికి అభ్యంతరం ఉండదనే టాక్‌ వినిపిస్తోంది. మొత్తానికి నిన్నటి వరకు నువ్వానేనా అన్నట్లు తలపడిన ఇద్దరు నేతలు… మళ్లీ ఒకే పార్టీ వైపు చూడటమే ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇద్దరిలో ఎవరికి గ్రీన్‌సిగ్నల్‌ వస్తుందనేదే సస్పెన్స్‌గా మారింది.

Also Read : శత్రుత్వానికి బైబై..! పిఠాపురంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహం..!

 

ట్రెండింగ్ వార్తలు