శత్రుత్వానికి బైబై..! పిఠాపురంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహం..!

పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఎన్నికైన నుంచి ఇక్కడ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. తన గెలుపు కోసం విశేషంగా కృషి చేసిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు పవన్. వర్మను అవమానించేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఇదివరకే గట్టి సందేశమిచ్చారు.

శత్రుత్వానికి బైబై..! పిఠాపురంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహం..!

Gossip Garage : ఆ ఇద్దరు ఒకప్పుడు ప్రత్యర్థులు… ఇప్పుడు మిత్రపక్షాలకు నేతలు… మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తాలూకా..! ఒకరు పవన్ గెలుపునకు తీవ్రంగా శ్రమిస్తే… మరొకరు పిఠాపురంలో పవన్ నాయకత్వానికి జైకొట్టారు. గతంలో ప్రత్యర్థులుగా తలపడిన ఆ ఇద్దరూ… ఇప్పుడు పవన్‌తో కలిసి నడిచేందుకు సై అంటున్నారు. పాత ప్రత్యర్థులు కొత్తగా చేతులు కలపడానికి సిద్ధపడటమే హాట్‌టాపిక్. ఉప్పు-నిప్పులా మెలిగిన ఆ ఇద్దరూ పొలిటికల్‌గా ఎలా ముందుకు వెళతారు? డిప్యూటీ సీఎం పవన్ ఆ ఇద్దరి మధ్య ఎలా సయోధ్య కుదర్చగలరన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్..

పిఠాపురంలో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా పవన్ అడుగులు ..
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పునరేకీకరణ ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించిన పవన్…. ఇప్పుడు పిఠాపురంలో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే ప్రత్యర్థి పార్టీల్లోని నేతలను ఆకర్షిస్తున్నారు. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును జనసేనలో చేర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన పవన్…. మాజీ ఎమ్మెల్యే వర్మతో ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థిని కలిపి నయా రాజకీయానికి తెరతీస్తున్నారంటున్నారు.

పవన్ సూచనతో శత్రుత్వానికి వర్మ బైబై..
పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఎన్నికైన నుంచి ఇక్కడ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. తన గెలుపు కోసం విశేషంగా కృషి చేసిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు పవన్. వర్మను అవమానించేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఇదివరకే గట్టి సందేశమిచ్చారు. ఇక పిఠాపురం అభివృద్ధి కోసం వర్మ సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. వర్మ కూడా పవన్ నాయకత్వానికి మద్దతుగా… పవన్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో తనతో విభేదించిన జనసేన క్యాడర్‌ను కూడా లైట్ తీసుకుంటున్నారు వర్మ. ఇక ఇప్పుడు పవన్ సూచనతో రెండు దశాబ్దాలుగా రాజకీయ యుద్ధం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతోనూ చేతులు కలిపేందుకు వర్మ సిద్ధమవడమే గోదావరి తీరంలో ఆసక్తి రేపుతోంది.

ఉప్పు-నిప్పులా రాజకీయాలు నెరిపిన వర్మ, దొరబాబు..
మాజీ ఎమ్మెల్యేలైన వర్మ… దొరబాబు… పిఠాపురంలో ఉప్పు-నిప్పులా రాజకీయాలు నెరిపారు. ఒకరిపై ఒకరు పోటీకి దిగారు… 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దొరబాబును… 2014లో దొరబాబుపై ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వర్మ భారీ విక్టరీ సాధించారు. ఇక 2019లో వర్మపై ప్రతీకారం తీర్చుకున్నారు దొరబాబు. ఇక గత ఐదేళ్ల నుంచి పిఠాపురం వేదికగా ఈ ఇద్దరి మధ్య పెద్ద రాజకీయ యుద్ధమే జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేగా దొరబాబు… టీడీపీ ఇన్చార్జిగా వర్మ తగ్గేదేలే అన్నట్లు రాజకీయాలు చేశారు.

తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన దొరబాబు..
ఐతే అనూహ్యంగా ఈ ఇద్దరికీ ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం రాలేదు. పొత్తుల్లో భాగంగా జనసేనాని పవన్‌కు మద్దతుగా వర్మ పోటీ నుంచి తప్పుకుంటే… ఎమ్మెల్యేల మార్పుల్లో భాగంగా తొలివేటు దొరబాబుపైనే వేసింది వైసీపీ… ఐదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేని దొరబాబు… ఎన్నికల ముందే వైసీపీని వీడతారనే ప్రచారం జరిగింది. ఇక ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు దొరబాబు. ఇదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి వర్మతో రాజీకి ప్రయత్నించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

పిఠాపురంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే వ్యూహం..
పిఠాపురంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే వ్యూహంతో అడుగులు వేస్తున్న పవన్… మాజీ ఎమ్మెల్యే దొరబాబుకు చేరికకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. దొరబాబుతోపాటు ఆయన అనుచరులు కూడా భారీగా చేరే అవకాశం ఉండటంతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన బలమైన శక్తిగా ఆవిర్భవించనుందంటున్నారు. మరోవైపు దొరబాబు జనసేన చేరిక విషయంలో టీడీపీ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని టాక్‌. వైసీపీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకునే విషయంలో కూటమి పార్టీలు మూడూ చర్చించుకోవాలని గతంలో నిర్ణయించాయి. దీంతో వైసీపీ నుంచి ఏ నేత వచ్చిన కూటమిలో చర్చిస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు విషయంలోనూ ఈ చర్చ జరిగినట్లు చెబుతున్నారు.

దిగువ స్థాయి క్యాడర్ కలుస్తారా? లేదా?
డిప్యూటీ సీఎం పవన్‌పై భరోసాతో దొరబాబు చేరికపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదట మాజీ ఎమ్మెల్యే వర్మ. దీంతో రాజకీయ ప్రత్యర్థుల మధ్య వైరానికి ఫుల్‌స్టాప్ పడినట్లైంది. ఐతే మాజీ ఎమ్మెల్యేలు చేతులు కలిపేందుకు సిద్ధమైనా, దిగువ స్థాయి క్యాడర్ కలుస్తారా? లేదా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. జనసేనలో చేరేందుకు సిద్ధమైన దొరబాబు తనకు ఏ పదవులూ అవసరం లేదని ప్రకటించారు. ఇదే సమయంలో వర్మకు రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో పిఠాపురంలో బడా నేతలు అంతా ఎలా ముందుకు వెళతారన్నదే ఆసక్తికరంగా మారింది.

Also Read : దారుణ ఓటమితో రోజా సంచలన నిర్ణయం? ఏపీ రాజకీయాలకు గుడ్‌బై?