Gossip Garage : ఎమ్మెల్సీ సీటు కోసం టీడీపీలో తీవ్రమైన పోటీ.. రేసులో ఉన్నది ఎవరెవరు? చంద్రబాబు లెక్కలేంటి?

ఇన్నీ సమీకరణాల మధ్య ఎవరెవరికి ఎమ్మెల్సీగా చాన్స్ వస్తుందో చూడాలి మరి.

Gossip Garage : వైసీపీలో ఎమ్మెల్సీల అసంతృప్తి రాగాలు.. తెలుగుదేశం తమ్ముళ్ల ఆశావహుల్లో జోష్ నింపుతున్నాయి. మరోవైపు కొందరు ఎమ్మెల్సీల పదవీకాలం దగ్గర పడుతుండడంతో ఆశావహుల ఉత్సాహం ఊరకలేస్తోంది. ఈసారి ఎమ్మెల్సీ సీటు తెచ్చుకోవాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరి హైకమాండ్‌ దగ్గర ఉన్న లెక్కలేంటి? ఎవరెవరికి ఎమ్మెల్సీ సీట్లు కట్టబెడుతుంది? ఎవరిని హోల్డ్‌లో పెడుతుంది? మండలిలో బలం కోసం కూటమి సర్కార్ ఆపరేషన్ ఆకర్ష్‌ ఫలిస్తుందా..

టీడీపీలో ఎమ్మెల్సీ ఆశావహులు జోష్ ఊపందుకుంది. వైసీపీలో ఇమడలేమంటూ ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మరో 8మంది ఎమ్మెల్సీలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీళ్లు ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై చెప్పొచ్చు. ఈ జంపింగ్‌లు ఇప్పుడు టీడీపీ తమ్ముళ్లకు వరాలుగా కనిపిస్తున్నాయి. ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ సీట్లలో సెటిల్ అవ్వాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.

15 ఎమ్మెల్సీ స్థానాల్లో ఖాళీలు ఏర్పడే అవకాశం..
మరోవైపు మార్చిలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. మొత్తంగా 15 ఎమ్మెల్సీ స్థానాల్లో ఖాళీలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించడంతో ఆ పార్టీ నుంచి నాగబాబు ఎమ్మెల్సీ బెర్తు ఖరారైపోయినట్టే.. ఇక తెలుగుదేశం నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధినేత చంద్రబాబు కొందరు ముఖ్యనేతల్ని విడివిడిగా పిలిచి మాట్లాడుతుండటంతో.. ఎవరికి మండలిలో బెర్త్‌ కన్‌ఫామ్‌ అవుతుందనేది సస్పెన్స్‌గా మారింది.

వైసీపీలో ఉండలేమంటూ పార్టీకి, ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. వీరిలో ముగ్గురు రాజీనామాలు చేసి దాదాపు 3 నెలలవుతోంది. మండలి ఛైర్మన్ వీటిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ఛైర్మన్‌ను వ్యక్తిగతంగా కోరడంతో పాటు గత మండలి సమావేశాల్లో సైతం నిరసన తెలిపారు. వచ్చే సమావేశాల్లోపు రాజీనామాలపై ఛైర్మన్ నిర్ణయం తీసుకోకుంటే మరికొందరు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు కలిసి మండలి ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ బలాన్ని గణనీయంగా తగ్గించడం పక్కా..!
ప్రస్తుతం శాసనమండలిలో కూటమికి మెజార్టీ లేదు. వైసీపీ అసంతృప్తుల రాజీనామాలు, మార్చిలో ఏర్పడే ఖాళీలతో వైసీపీ బలాన్ని గణనీయంగా తగ్గించడం పక్కాగా కనిపిస్తోంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ 2 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవ్వడంతో టీడీపీ ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్.. ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఓటర్ నమోదు ప్రక్రియను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.

పొత్తుల సద్దుబాట్లతో సీట్లు కోల్పోయిన వారికి ఈసారి ప్రయారిటీ..!
మిగిలిన ఖాళీల విషయానికొస్తే.. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హత ఉన్నా.. పొత్తుల సద్దుబాట్లతో సీట్లు కోల్పోయిన వారికి ఈసారి ప్రయారిటీ ఇవ్వనున్నారు. నామినేటెడ్ పదవులు, టీటీడీ పాలక మండలిలో చోటు దక్కని వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. పిఠాపురం టీడీపీ నేత వర్మ, మాజీ మంత్రులు జవహర్, దేవినేని ఉమ, వంగవీటి రాధ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, నల్లపాటి రాము, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేశ్‌ వెంట ఉండి గట్టిగా పోరాడిన మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్థన్, బుద్ధా వెంకన్న, అంగర రామ్మోహన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకుండా క్లిష్ట సమయంలో వీరు గట్టిగా నిలబడ్డారు. దీంతో వీరి పేర్లను ఎమ్మెల్సీల ఖాళీల భర్తీకి పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీలుగా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ మరికొంతమంది ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు, పీతల సుజాత ఎమ్మెల్సీ రేసులోకి వచ్చారు. యువగళం పాదయాత్రలో క్రియాశీలకంగా పనిచేసిన మద్దిపట్ల సూర్యప్రకాశ్‌ సైతం ఈసారి అవకాశం దక్కుతుందనే ఆశతో ఉన్నారు. కలిశెట్టి అప్పలనాయుడు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాశ్‌ పార్టీ కోసం కలిసి పని చేసిన జాబితాలో ఉన్నారు. వీళ్లే కాకుండా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చంగల్ రాయుడు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, నాగుల్ మీరా, మోపిదేవి వెంకట రమణరావు, విష్ణువర్థన్ రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి, కలమట వెంకటరమణ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా లిస్ట్ ఉంది. ఐతే హైకమాండ్ షార్ట్ లిస్ట్‌లో ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది..

మెగా బ్రదర్ నాగబాబుకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామంటూ ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వంగవీటి రాధాను పిలిపించి మాట్లాడడంతో ఆయనకు కూడా ఎమ్మెల్సీ బెర్త్ ఖరారు అయినట్లు గాసిప్ మొదలైంది. ఇదిలా ఉండగా.. మరికొందరు నేతలతోనూ అధినేత ఫేస్‌ టు ఫేస్ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నీ సమీకరణాలు మధ్య ఎవరెవరికి ఎమ్మెల్సీగా చాన్స్ వస్తుందో చూడాలి మరి.

Also Read : ఆళ్ల నాని సైకిల్‌ సవారీకి లైన్ క్లియరైనట్టేనా?