West Godavari District: ఆ జిల్లా ఎప్పుడో ఏర్పడింది. గత సర్కార్ హయాంలోనే కేంద్రం కూడా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు కొత్త రాజకీయం తెరమీదకు వచ్చింది. జిల్లా కేంద్రం అక్కడికి మార్చాలని ఆయన.. లేదు ఇక్కడే ఉండాలని ఇంకొకాయన. మధ్యలో మా ప్రాంతానికి అన్యాయం జరిగిందని మరో ఏరియాలో నిరసనలు. ఇలా పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఇష్యూ పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. కూటమిలోని రెండు పార్టీల ఎమ్మెల్యేలది చెరో వాయిస్ అయితే..అపోజిషన్ వైసీపీ మాత్రం పాత ప్లేస్‌లోనే జిల్లా కేంద్రం ఉండాల్సిందేనంటోంది. అసలు ఇప్పుడీ రచ్చ ఎందుకు మొదలైంది? జిల్లా కేంద్రంపై పొలిటికల్ ఫైట్ ఎటు దారితీయబోతోంది?
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. జిల్లాల పునర్విభజన సమయంలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని భీమవరంను పశ్చిమ గోదావరి జిల్లా.. జిల్లా కేంద్రంగా డిసైడ్ చేశారు. వైసీపీ హయాంలోనే భీమవరంను జిల్లా కేంద్రంగా డిసైడ్ చేసి..అక్కడ ఆఫీసుల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. కానీ కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో భీమవరంలో కలెక్టరేట్ కన్‌స్ట్రక్షన్స్ పనులు స్టార్ట్ కాలేదు.
ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కొత్త పంచాయితీ తెరమీదకు వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రాన్ని..ఉండి నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం భూములు కొని, కలెక్టర్ ఆఫీసు కట్టాలంటే పెద్దఎత్తున ఖర్చు అవుతుంది కాబట్టి..తన నియోజకవర్గం..ఉండి పరిధిలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కోరుతున్నారు. (West Godavari District)
కలెక్టరేట్ నిర్మాణం కోసం 70 కోట్లు ఖర్చు అయితే 35 కోట్లు ప్రభుత్వం, 35 కోట్లు తాము సమకూర్చి 2 లక్షలు చదరపు అడుగుల విస్తీర్ణంలో జిల్లా కలెక్టరేట్ నిర్మించాలని అనుకుంటున్నామని చెప్పారు. ఆయన ప్రతిపాదనకు కూటమి సర్కార్ సానుకూలంగా స్పందించింది. అయితే తన ప్రపోజల్‌పై కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడుతున్నారు రఘురామకృష్ణరాజు. తాను ఉండి వేరు భీమవరం వేరు అన్నట్లుగా చూడటం లేదని..త్వరలో భీమవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కాబోతుందని..అప్పుడు అన్నీ దాని కిందికే వస్తాయంటున్నారు.
భీమవరం జనసేన ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పులపర్తి రామాంజనేయులు..ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుకు కౌంటర్ ఇస్తున్నట్లుగా మాట్లాడటం హాట్ టాపిక్ అవుతోంది. కలెక్టరేట్ భీమవరం హెడ్ క్వార్టర్స్‌లోనే ఉంటుంది. ఎక్కడికీ తరలి వెళ్లదని క్లారిటీ ఇచ్చారు. భీమవరం మార్కెట్ యార్డ్‌లో గానీ, దిరుసుమర్రు, గొల్లవాని తిప్పరోడ్డులో గాని 20 నుంచి 25 ఎకరాల భూమిని సేకరిస్తామంటున్నారు. జిల్లా కేంద్రం, కలెక్టరేట్ సమస్యను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తానంటున్నారు ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు. (West Godavari District)
భీమవరంలో భూమి లేదని ఎవరు చెప్పారు?
కూటమి పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలది చెరో వాదనగా ఉండగా.. వైసీపీ మాత్రం జిల్లా కేంద్రాన్ని మరో చోటకు తరలిస్తామంటే ఊరుకోమంటోంది. భీమవరమే జిల్లా కేంద్రమని నాలుగేళ్ల క్రితమే నిర్ణయించబడిందంటున్నారు శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు. భీమవరంలో భూమి లేదని ఎవరు చెప్పారని రఘురామను ప్రశ్నించారు. కలెక్టరేట్ భవనాలకు భూమి కావాలని రఘురామను ఎవరు అడిగారని క్వశ్చన్ చేస్తున్నారు. భీమవరమే జిల్లా కేంద్రంగా ఉండాల్సిందేనంటున్నారు. కూటమి ఎమ్మెల్యేలు రఘురామ, పులవర్తి రామాంజనేయులు భీమవరం ప్రజల్ని ఆందోళనకు గురి చేయొద్దంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు మోషేన్ రాజు.
ఇలా జిల్లా కేంద్రం ఇష్యూపై మూడు పార్టీల నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఎవరికి వారు మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడంతో భీమవరం సెంట్రిక్‌గా రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి కొనసాగుతోంది. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు అప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్‌లో జిల్లా కేంద్రం ఏర్పాటు చేశారు. నరసాపురం పార్లమెంట్ హెడ్ క్వార్టర్ నరసాపురం అయినా.. నరసాపురంలో కాకుండా భీమవరంలో జిల్లా కేంద్రం పెట్టి తమకు అన్యాయం చేశారని అక్కడి ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. (West Godavari District)
గత ప్రభుత్వ హయాంలో నరసాపురం నుంచి జిల్లా కేంద్రాన్ని భీమవరంకు తరలించారని.. నరసాపురంలోనే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిరసనలకు దిగుతున్నారు. ఇలా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఇప్పుడు రాజకీయ రచ్చకు కేరాఫ్ అయింది. ఈ పంచాయితీని చంద్రబాబు, పవన్ ఎలా పరిష్కరిస్తారో? వైసీపీ రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.
Also Read: రూటు మార్చిన జనసేనాని.. టీడీపీ, వైసీపీకి ధీటుగా స్ట్రాంగ్ ఫోర్స్‌గా రెడీ అయ్యే స్కెచ్..!