Pulivendula Bypoll: పట్టుబట్టి..గిరిగీసి..జగన్ కంచుకోటను బద్దలు కొట్టారు. అడుగుపెట్టలేమన్న చోట..గెలవాలనుకున్నారు. గెలిచి తీరారు. ఇలాకాలోనే వైసీపీని ఓడించి తీరాలనుకున్నారు. ఓడగట్టారు. ఓటమి అంటే వైసీపీకి మామూలు ఓటమి చూపించలేదు. ఏకంగా డిపాజిట్ గల్లంతైన పరిస్థితి. అయితే టీడీపీ దొంగ ఓట్లతో గెలిచింది. తమదైన రోజు తాము నిజమైన ఓట్లతో గెలిచి చూపిస్తామంటోంది వైసీపీ. పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌లో గెలుపుతో టీడీపీ చెప్పాలనుకున్నదేంటి? జగన్ సొంత నియోజకవర్గంలోనే గెలిచామని చెప్పుకునే ప్లానా? ప్రజాస్వామ్యం గెలిచిందా? టీడీపీ విన్ అయ్యిందా?
ఏపీ పాలిటిక్స్‌లో సంచలనం నమోదైంది. పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌లో టీడీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. వైఎస్ జగన్ అడ్డాలో వైసీపీకి షాక్ తగిలింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి బంపర్ మెజార్టీతో గెలిచారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత..పులివెందులలో తొలిసారి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.
అసెంబ్లీ ఎన్నికలను తలపించేంత హోరాహోరీగా కనిపించిన ఎన్నికల సమరం..పోలింగ్‌కు ముందు రోజు వరకు ఉత్కంఠ రేపింది. ఫైనల్‌గా అధికార పార్టీకి గెలుపు దక్కింది. పులివెందుల కోట మీద పసుప జెండా ఎగరవేశారు తెలుగు తమ్ముళ్లు.
ఇదే జోష్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ను కూడా ఓడిస్తామంటోంది టీడీపీ. మొట్టమొదటి సారి పులివెందులలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగాయని..ప్రజలు జగన్ తీరుకు వ్యతిరేకంగా ఓటేశారని చెప్తున్నారు టీడీపీ నేతలు. ఇలాకా, కంచుకోట అని చెప్పుకున్న చోట్లోనే వైసీపీకి ఓటమి అంటే ఏంటో చూపించామంటోంది టీడీపీ.
ఒకే ఒక్క బైపోల్ సెంట్రిక్‌గా వైసీపీ, టీడీపీ మధ్య హైవోల్టేజ్ పొలిటికల్ వార్ నడిచింది. టీడీపీ రిగ్గింగ్ చేసి, దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ జరగలేదని.. పోలీసులను అడ్డంగా పెట్టుకుని టీడీపీ అక్రమాలకు పాల్పడి గెలిచిందంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. పులివెందుల, ఒంటిమిట్టలో కేంద్ర బలగాలను మోహరించి..మళ్లీ ఎన్నికలు పెట్టి గెలిచే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు.
పులివెందుల జడ్పీటీసీ బైపోల్ జరిగిన తీరు..దొంగ ఓట్లు అంటూ కోర్టుకు కూడా వెళ్లింది ఫ్యాన్ పార్టీ. అయితే వైసీపీ విమర్శలకు అదే రేంజ్‌లో కౌంటర్ ఇస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌లో గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు. డెమొక్రటిక్ పద్దతితో ఎన్నికలు జరిగాయి కాబట్టే..11 మంది నామినేషన్ వేశారని రివర్స్ అటాక్ చేశారు.
పులివెందుల కౌంటింగ్ సందర్భంగా బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు స్లిప్‌లు రాసి వేశారని..30 ఏళ్ల తర్వాత ఓటు వేయడం ఆనందంగా ఉందని ప్రజలు స్లిప్పుల మీద రాశారని చెబుతున్నారు. దాన్ని బట్టే గతంలో పులివెందులలో పరిస్థితులు ఎలా ఉండేవో ప్రజలు అర్థం చేసుకోవాలంటోంది టీడీపీ. జగన్ అరాచకాల నుంచి పులివెందుల ప్రజలు ఇప్పుడే బయటపడుతున్నారని అంటున్నారు టీడీపీ నేతలు.
అయితే పులివెందులలో ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ఏకగ్రీవం అయిన సందర్భాలే ఉన్నాయి. అలాంటిది ఫస్ట్ టైమ్ జడ్పీటీసీ బైపోల్‌ను ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించామని..అధికారంలో ఉన్నాం కదా అని తాము అడ్డగోలుగా బిహేవ్ చేయలేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 11 మంది నామినేషన్లు వేశారు.
దాదాపు 8వేల మంది పోలింగ్ బూతులకు వచ్చి ఓట్లేశారని చెబుతున్నారు. ప్రజలకు పూర్తి స్వేచ్చ..ఇచ్చాం..ప్రజాస్వామ్య బద్దంగానే గెలిచామని చెప్తోంది టీడీపీ. ఈ ఉప ఎన్నికతో టీడీపీ చెప్పాలనుకున్నది కూడా ఇదేనన్న చర్చ జరుగుతోంది.
పులివెందులలో ఎలాంటి బెదిరింపులు, అరాచకాలు లేకుండా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగితే..ఏ ఎన్నికలో కూడా వైసీపీ గెల్వలేదనే విషయం జనాల్లోకి పంపాలనేదే టీడీపీ ప్లానట. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల ఫలితం ఇలాగే ఉంటుందని చెప్తోంది. అయితే పులివెందుల పబ్లిక్‌లో ఓ చర్చ జరుగుతోందట. వాస్తవానికి వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నియోజకవర్గం మీద ఎప్పుడూ ఇంత సీరియస్‌గా ఫోకస్ పెట్ట లేదంటున్నారు. చంద్రబాబు కూడా పులివెందుల మీద ఇంతలా ఎప్పుడూ కాన్సంట్రేట్ చేయలేదని గుర్తు చేస్తున్నారు.
కానీ గత ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునే ఓడిస్తామని వైసీపీ చేసిన సవాళ్లు.. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచిన తీరు..టీడీపీ నేతలు రగిలిపోతున్నారట. అదే కసితో జగన్‌కు తెలిసివచ్చేలా చేయాలనే..పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌ను ఇంత సీరియస్‌గా తీసుకుందట టీడీపీ. అందుకు తగ్గట్లే జగన్ కోటలో గెలిచి తీరింది. ఇప్పుడిదే లైన్‌తో పబ్లిక్‌లోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.
జగన్ సొంత నియోజకవర్గంలోనే వైసీపీని ఓడించి తీరాం..ఇక ఆ పార్టీకి బలమెక్కడా అని వాయిస్ రేజ్ చేస్తోంది కూటమి. పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌లో వైసీపీ ఓటమి..ఆ పార్టీకి కాస్త నిరాశ కలిగించే అంశమే. ఇంత హైవోల్టేజ్ హీట్‌లో కొనసాగిన ఎన్నికలో వైసీపీ స్వల్ప మెజార్టీతో గెలిచినా..బూస్టింగ్‌గా ఉండేదని అంటున్నారు నేతలు. ఈ ఫలితం ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
Also Read: చంద్రబాబుతో సోమువీర్రాజు భేటీ.. టీడీపీ, బాబు పేరు ఎత్తితే ఫైరయ్యే లీడర్‌లో ఎందుకింత మార్పు?