చంద్రబాబా మజాకా..! టీడీపీ కంచుకోటలో వైసీపీ కథ కంచికేనా? దారుణంగా దెబ్బతీసిన వైనాట్‌ 175..!

కుప్పం గడ్డపై ప్రకటించిన వైనాట్‌ 175 స్టేట్‌మెంట్‌ వైసీపీకి పూర్తిగా నష్టం చేయగా, ఇప్పుడు కుప్పంలోనూ ఆ పార్టీ దుకాణం బంద్‌ అయ్యే పరిస్థితి నెలకొనడమే పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అవుతోంది.

Gossip Garage : వైనాట్‌ 175 అక్కడే పుట్టింది. మున్సిపాలిటీ, మండలాలు గెలిచిన ఊపులో అసెంబ్లీ ఎన్నికల్లోనూ జెండా ఎగరేస్తామని తొడగొట్టారు. పసుపుదళం కమాండర్‌నే తక్కువ అంచనా వేశారు. నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తామని… ప్రతిపక్షమన్నదే లేకుండా సరికొత్త చరిత్ర లిఖిస్తామని భ్రమల్లో బతికారు. కట్‌ చేస్తే వైనాట్‌ 175… కేవలం 11 సీట్లకే పరిమితమైంది. తొడగొట్టిన వారంతా తుక్కు.. తుక్కుగా ఓడిపోయారు. ఇప్పుడు తప్పైపోయిందని బాబు గారూ అంటూ చంపలేసుకుంటున్నారు. ప్లీజ్.. ప్లీజ్‌ వచ్చేస్తాం.. పార్టీలో చేర్చుకోండి అని బతిమిలాడుతున్నారు. ఈ సీన్‌ చూసిన వారంతా ఇన్నాళ్లు బలమనుకున్నది కేవలం వాపా? అని నిట్టూరుస్తున్నారు. ఇంతకీ వాపు చూసి బలుపు అనుకున్న నేతలు ఎవరు?

కుప్పంలో గెలుపు జెండా ఎగరేస్తామని జబ్బలు చరిచిన వైసీపీ..
కుప్పం.. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. 1985 నుంచి వరుసగా కుప్పం ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు చంద్రబాబు. అలాంటి నియోజకవర్గంలో తమ పార్టీ జెండా ఎగరేయాలని భావించింది వైసీపీ. కుప్పం మున్సిపాలిటీతో సహా.. నియోజకవర్గంలోని అన్ని మండలాల జడ్పీటీసీలు, మండలాధ్యక్షుల పీఠాలను కొల్లగొట్టింది. టీడీపీ అడ్రస్‌ లేకుండా చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించినా, కుప్పం మున్సిపాలిటీలో మాత్రం ఆ పార్టీ పోటీ చేసింది. కానీ, అప్పటి జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో కుప్పం మున్సిపాలిటినీ గెలిచింది వైసీపీ. ఇక ఆ ఊపుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో గెలుపు జెండా ఎగరేస్తామని జబ్బలు చరిచింది.

టీడీపీలోకి వచ్చేస్తాం.. చేర్చుకోండి అంటూ వేడుకుంటున్నారు…
కానీ, చంద్రబాబు హవాతో కుప్పమే కాదు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడిపోయింది వైసీపీ. ఇక చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యాక కుప్పం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. సీన్‌ ఫుల్‌ రివర్స్‌ అవడంతో వైసీపీకి చెందిన మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు తట్టాబుట్టా సర్దేస్తున్నారని సమాచారం. టీడీపీలోకి వచ్చేస్తాం.. జాయిన్‌ చేసుకోండంటూ వేడుకుంటున్నారట… ఐతే వైసీపీ నుంచి వస్తామంటున్న కొందరి ముఖం మీదే తలుపులు వేసేస్తోందట టీడీపీ.

వైసీపీలో మిగిలేది ఎమ్మెల్సీ భరత్ ఒక్కరే..!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కుప్పంలో వైసీపీకి నేతలే కరువయ్యారని చెబుతున్నారు. మున్సిపల్ చైర్మన్ మొదలు కౌన్సిలర్లు అందరూ టీడీపీలో చేరడానికి క్యూ కడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కుప్పం వైసీపీ పరిణామాలు పరిశీలిస్తే… గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యర్థిగా పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఒక్కరే ఆ పార్టీకి మిగిలేలా కనిపిస్తున్నారంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పంలో తెలుగు తమ్ముళ్లు జోరు చూపిస్తుండటంతో వైసీపీ శ్రేణులు చెల్లా చెదురవుతున్నాయి. ఐదేళ్లు తమ ప్రతాపం చూపిన వైసీపీ నేతలు పత్తా లేకుండా పోయారు.

టీడీపీలో చేరేందుకు చంద్రబాబు అనుమతి కోరిన మున్సిపల్ చైర్మన్..
కుప్పం మున్సిపాలిటీలో చైర్మన్‌తో సహా మెజార్టీ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. 25 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీలో టీడీపీకి ఆరుగురు కౌన్సిలర్లు ఉంటే.. వైసీపీకి 19 మంది కౌన్సిలర్ల బలం ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసిపి కౌన్సిలర్లు ఆ పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. స్వయంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. ఐతే స్థానిక క్యాడర్‌ వ్యతిరేకించడంతో ఆయన చేరిక తాత్కాలికంగా బ్రేక్‌ పడిందని చెబుతున్నారు.

మున్సిపల్ చైర్మన్ ఆసుపత్రిపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి..
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపల్ చైర్మన్ కొంతమంది వైసిపి కౌన్సిలర్లను పార్టీలో చేర్పించే ప్రయత్నం చేశారని సమాచారం. అయితే చైర్మన్‌ పార్టీలో చేరతారన్న ప్రచారంపై ఆగ్రహం చెందిన టీడీపీ కార్యకర్తలు ఆయన ఆసుపత్రిపై రాళ్ల దాడి చేసి తమ నిరసన తెలిపారు. దీంతో చైర్మన్ సుధీర్‌ను పక్కన పెట్టి మిగిలిన కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఇలా చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోందంటున్నారు.

కుప్పంలోనూ వైసీపీ దుకాణం బంద్..!
వరుసగా ఎనిమిదో సారి గెలిచిన చంద్రబాబును తట్టుకోవడం వైసీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ భరత్‌కు సవాల్‌గా మారిందనే టాక్‌ వినిపిస్తోంది. గత ఐదేళ్లు పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ తమపై రియాక్షన్‌ ఉంటుందోననే భయంతో ఎక్కువ మంది వైసీపీ నేతలు… టీడీపీ నేతలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటున్నారు. ఇదే సమయంలో కుప్పంలో వైసీపీ కార్యాలయం కూడా ఎత్తేయడం చర్చకు దారితీసింది. మొత్తానికి కుప్పం గడ్డపై ప్రకటించిన వైనాట్‌ 175 స్టేట్‌మెంట్‌ వైసీపీకి పూర్తిగా నష్టం చేయగా, ఇప్పుడు కుప్పంలోనూ ఆ పార్టీ దుకాణం బంద్‌ అయ్యే పరిస్థితి నెలకొనడమే పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అవుతోంది.

Also Read : రేషన్‌ బియ్యం అక్రమాల్లో త్వరలో అరెస్టులు..! ప్రభుత్వం హిట్ లిస్టులో ఉన్న ఆ బిగ్ వికెట్లు వీరేనా?

ట్రెండింగ్ వార్తలు