రేషన్ బియ్యం అక్రమాల్లో త్వరలో అరెస్టులు..! ప్రభుత్వం హిట్ లిస్టులో ఉన్న ఆ బిగ్ వికెట్లు వీరేనా?
నాదెండ్ల హెచ్చరికలతో ఇప్పటికే కేసుల భయంతో అజ్ఞాతం గడుపుతున్న వైసీపీ నేతలు... ఇప్పుడు తాజా హెచ్చరికలతో మరింత టెన్షన్ పడుతున్నారు.

Gossip Garage : రైస్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెబుతున్న సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల… త్వరలో బిగ్ వికెట్లను అరెస్టు చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే కాకినాడ కేంద్రంగా బియ్యం ఎక్స్‌పోర్ట్స్‌పై గట్టి నిఘా వేసిన ఎన్‌డీఏ సర్కార్… అక్రమాలను కట్టడి చేసింది. గత సర్కార్‌లో దోచుకున్నది కక్కిస్తామని చెబుతున్న మాటలే… వైసీపీకి చెందిన కొందరు నేతలకు వణుకు తెప్పిస్తున్నాయి. బియ్యం మాఫియాలో అరెస్టులు తప్పవన్న మంత్రి హెచ్చరికలతో భయపడుతున్నది ఎవరు? కాకినాడలో రైస్ మాఫియాను నడిపిన డాన్ ఎవరు?
ప్రభుత్వం దృష్టిలో ఉన్న ఆ బిగ్ వికెట్లు ఎవరు?
గత ప్రభుత్వంలో అక్రమాలను వెలికితీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం… అరెస్టులతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విజయవాడలో 5 కోట్ల విలువ చేసే అగ్రి గోల్డ్ ల్యాండ్ స్కాంలో మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడి అరెస్టు తర్వాత… సివిల్ సప్లయిస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ చేసిన హెచ్చరికలు పొలిటికల్ సర్కిల్స్‌లో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమాల్లో త్వరలో అరెస్టులు ఉంటాయని…. బిగ్ వికెట్లను కటకటాల్లోకి పెడతామని చాలా సూటిగా చెప్పారు నాదెండ్ల. దీంతో ప్రభుత్వం దృష్టిలో ఉన్న ఆ బిగ్ వికెట్లు ఎవరనే చర్చ జరుగుతోంది.
కోట్ల రూపాయల విలువైన పీడీఎస్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలింపు..
జూన్ 12న రాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరిన వెంటనే అదే నెల 28, 29 తేదీల్లో కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతులు జరుగుతున్నట్లు గుర్తించారు మంత్రి మనోహర్. రెండు రోజుల పాటు కాకినాడలో పర్యటించి.. బియ్యం అక్రమంగా నిల్వ చేసిన గోడౌన్లను సీజ్ చేశారు. పౌరసరఫరాల అధికారులతో విచారణకు ఆదేశించారు. అధికారుల దర్యాప్తులో కాకినాడ కేంద్రంగా కోట్ల రూపాయల విలువైన పీడీఎస్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలుతున్నట్లు గుర్తించారు. ఈ నివేదికలో వైసీపీలోని కీలక నేతలు పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు.
కాకినాడలో ఎవరిని అరెస్ట్ చేస్తారు?
పౌరసరఫరాల అధికారుల నివేదికతో వైసీపీ నేతల అక్రమ బాగోతం తెలుసుకున్న ప్రభుత్వం… వెంటనే చర్యలకు దిగాలని భావిస్తోంది. ప్రస్తుతం మంత్రి నాదెండ్ల మనోహర్ టేబుల్‌పై ఉన్న నివేదిక సీఎం చంద్రబాబుకు దృష్టికి తీసుకువెళ్లి… ఆయన ఆదేశాల ప్రకారం యాక్షన్‌లోకి దిగాలని చూస్తున్నారు మంత్రి మనోహర్. ఇక సీఐడీ కేసు నమోదు చేస్తే కాకినాడలోని ముఖ్యనేతలు అరెస్టు తప్పదని ఖరాకండీగా చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం హిట్‌లిస్టులో ఉన్న నేతలు ఎవరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడి అరెస్టు చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ప్రస్తుతం జోగి అరెస్టు నుంచి రక్షణ పొందారు. అదేవిధంగా మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపైనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కాకినాడలో ఎవరిని అరెస్టు చేస్తారనేదే ఉత్కంఠ రేపుతోంది.
టార్గెట్ ద్వారంపూడి..
మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీల్లో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితుల గొడౌన్లనే లక్ష్యంగా చేసుకున్నారనే ప్రచారం ఉంది. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం ఎక్స్‌పోర్టింగ్‌లో ద్వారంపూడే ప్రధాన సూత్రధారిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కూడా… విపక్షంలో ఉండగా పలుమార్లు ద్వారంపూడి బియ్యం మాఫియా నడుపుతున్నట్లు ఆరోపించారు. సీఎం చంద్రబాబు సైతం… కాకినాడలో బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టి నిందితులను కటకటాల వెనక్కి నెడతామని హెచ్చరించే వారు.
ద్వారంపూడి, కొడాలి నాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
ఇక ద్వారంపూడి సైతం అప్పట్లో ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ… తన తప్పుంటే అరెస్టు చేయొచ్చని సవాల్ చేసేవారు. అప్పట్లో అధికార పక్షంలో ఉండగా ప్రకటనలతో రెచ్చగొట్టిన ద్వారంపూడి… వైసీపీ ఓడిన తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడుగులు చూస్తుంటే ద్వారంపూడి లక్ష్యంగానే పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వ్యవహారంలో అప్పటి పౌరసరఫరాల మంత్రి కొడాలి నానికి ఏమైనా ప్రమేయం ఉందా? అనే దిశగాను దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందంటున్నారు. దీంతో ద్వారంపూడి, కొడాలి నానిని ఉద్దేశించే మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరికలు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి నాదెండ్ల హెచ్చరికలతో ఇప్పటికే కేసుల భయంతో అజ్ఞాతం గడుపుతున్న వైసీపీ నేతలు… ఇప్పుడు తాజా హెచ్చరికలతో మరింత టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం బిగిస్తున్న ఉచ్చులో ఒక్కొక్కరుగా ఇరుక్కుపోతుండటమే రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారుతోంది.
Also Read : ఎటూ తప్పించుకోలేని పరిస్థితిలో వైసీపీ నేత..! జోగి రమేశ్ చుట్టూ ఉచ్చుబిగిస్తున్న ప్రభుత్వం