Gossip Garage : ఏపీలో ప్రస్తుతం ఎవరు పార్టీ మారినా.. చివరికి చేరేది జనసేనలోకేనా..? వలస నేతలు అంతా చలో జనసేన అనటానికి కారణమేంటి? కుప్పలు తెప్పలుగా నేతలు వస్తున్నా… జనసేన మాత్రం ఒకరిద్దరికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి… మిగిలిన వారిని వెయిటింగ్‌లో ఎందుకు పెడుతోంది? పార్టీలో కొత్తగా వస్తామంటున్న నేతలపై జనసైనికులకు అభ్యంతరాలు ఉంటున్నాయా? అందుకే జనసేనాని కూడా చేరికలపై ఆచితూచి అడుగులేస్తున్నారా? దీనికి గత అనుభవాలు కూడా కొంత కారణమా? అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ చేరికలపై జనసేన వైఖరేంటి?
చేరికలపై జనసేన ఆచితూచి అడుగులు..
రాజకీయ పార్టీల్లో చేరికలు.. రాజీనామాలు చాలా కామన్. కానీ, జనసేనలో చేరికలు మాత్రం ప్రస్తుతం డిఫరెంట్‌గా చూస్తున్నారు పరిశీలకులు. ఏ పార్టీలోనైనా ఎన్నికల ముందు చేరికలు ఉంటాయి. అవకాశాల కోసం… ప్రత్యమ్నాయం లేకో నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతుంటారు. కానీ, ఇప్పుడు ఏపీలో జనసేనలో చేరికలు ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయంటున్నారు. ఎన్నికలు జరిగి.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులకు చలో జనసేన అంటూ వలస నేతలు నినదిస్తున్నారు. అయితే ఈ చేరికలపై జనసేన మాత్రం ఆచితూచి అడుగులు వేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
ఆ కారణంతో తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్న పవన్..
ప్రస్తుతం చాలా మంది నేతలు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి రావాలని ప్రయత్నిస్తున్నా… మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మాజీ విప్ సామినేని ఉదయభానుకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జనసేనాని పవన్. అదే సమయంలో వైసీపీ నుంచి వస్తామంటున్న చాలామంది నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ప్రతి జిల్లా నుంచి పెద్దఎత్తున వలస వచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read : వైసీపీలో చివరికి మిగిలేది ఎందరు? జగన్ పార్టీ భవితవ్యం ఏంటి?
జనసేనలో తమకు తెలిసిన నేతల ద్వారా డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు పెద్ద పెద్ద నాయకులు జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారంటున్నారు. అయితే కూటమి పార్టీల్లోకి కొత్తగా ఎవరిని తీసుకోవాలన్నా మూడు పార్టీలు సమన్వయం చేసుకుని, స్థానికంగా కూటమికి ఇబ్బంది లేకుండా చూడాలనే గత ఒప్పందం దృష్ట్యా చేరికలపై పవన్ తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటున్నారు.
అందుకే బాలినేని, సామినేనికి లైన్ క్లియర్..
ఇదే సమయంలో ఒంగోలులో బాలినేని చేరికపైన స్థానిక నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసినా… బాలినేనితో పవన్‌కు ఉన్న వ్యక్తిగత పరిచయంతో ఆయనను కాదనలేకపోయినట్లు చెబుతున్నారు. మరోవైపు తాను కూటమి బంధానికి కట్టుబడి పనిచేస్తానని బాలినేని హామీ ఇవ్వడంతో ఆయనకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు చెబుతున్నారు. ఇక మాజీ విప్ సామినేని ఉదయభాను విషయంలోనూ జనసేన వెనువెంటనే నిర్ణయం తీసుకోడానికి కూడా చాలా కారణాలు చెబుతున్నారు. ఇప్పటికే ఉదయభాను అనుచరగణంలో చాలామంది టీడీపీలో చేరడం… జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య కూడా ఉదయభాను విషయంలో పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడంతో రూట్ క్లియర్ అయ్యిందంటున్నారు.
వైసీపీ కోవర్టులా..? కాదా? అన్నది తేలాకే చేరికలకు అనుమతి..
ప్రస్తుత పరిస్థితుల్లో కూటమిలో పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినకుండా కొత్త చేరికలు ఉండాలని… కొత్తగా వచ్చిన వారు తమ అవకాశాలను తన్నుకుపోకుండా చూడాలని జన సైనికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. జనసేనలో చాలా నియోజకవర్గాలకు ఎమ్మెల్యే స్థాయి నేతలు లేరన్న వాదన ఉంది. కానీ, ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నదని గత ఎన్నికల్లో రుజువైంది. ఇలాంటి చోట చేరికలకు ప్రాధాన్యమివ్వాలని జనసేన ఆలోచన చేస్తోందంటున్నారు. ఇదే సమయంలో ప్రజారాజ్యం పార్టీలో ఎదురైన అనుభవాలు కూడా డిప్యూటీ సీఎం పవన్‌ను అప్రమత్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read : వైసీపీలోకి వెళ్లి తప్పు చేశామా? కరుడుకట్టిన ఆ ఇద్దరు టీడీపీ నేతల్లో అంతర్మథనం..!
అప్పట్లో చాలా మంది కోవర్టులుగా పనిచేయడంతో ప్రజారాజ్యం దెబ్బతిందని గతంలో స్వయంగా చెప్పిన పవన్… ఇప్పుడు వచ్చిన వారు వైసీపీ కోవర్టులా..? కాదా? అన్న విషయంపై పూర్తిస్థాయిలో సమాచారం తెప్పించుకుని తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారంటున్నారు. మొత్తానికి వైసీపీ నుంచి ఎవరు వచ్చినా వడబోత ద్వారానే నిర్ణయం తీసుకోవాలనేది జనసేన స్టాండ్‌గా చెబుతున్నారు.