వైసీపీలోకి వెళ్లి తప్పు చేశామా? కరుడుకట్టిన ఆ ఇద్దరు టీడీపీ నేతల్లో అంతర్మథనం..!

ఇద్దరు కీలక నేతలు టీడీపీలో కొనసాగితే మంచి గుర్తింపుతోపాటు భవిష్యత్‌ ఉండేదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. కానీ, తొందరపాటుతో ఇద్దరూ రాంగ్‌ స్టెప్పులు వేయడం వల్ల చేజేతులా పొలిటికల్‌ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టుకున్నారని అంటున్నారు పరిశీలకులు.

వైసీపీలోకి వెళ్లి తప్పు చేశామా? కరుడుకట్టిన ఆ ఇద్దరు టీడీపీ నేతల్లో అంతర్మథనం..!

Updated On : September 19, 2024 / 10:41 PM IST

Gossip Garage : ఆ ఇద్దరు నేతలు బై బర్త్‌ టీడీపీ… పసుపు కండువా తప్ప.. మరే రంగు ఎరుగని ఆ ఇద్దరు నేతలు గత ప్రభుత్వంలో టెమ్ట్‌ అయ్యారు. తరతరాల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి… ప్రత్యర్థితో చేతులు కలిపారు. ఇంకే తమ జీవితం సూపర్‌ అనుకున్నారు… కానీ, రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు… రైట్‌ అనుకున్నది రాంగ్‌ అవుతుంది.. రాంగ్‌ అనుకున్నది రైట్‌ అవుతుంది… ఇలాగే ఆ ఇద్దరి రాజకీయ జీవితాలు తలకిందులయ్యాయట… ఇప్పుడు తరతరాల బంధం గుర్తుకు తెచ్చుకుని… మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారట… మరి కష్టకాలంలో హ్యాండిచ్చిన ఆ ఇద్దరినీ టీడీపీ దగ్గరకు తీసుకుంటుందా? మనోళ్లే అని కలిపేసుకుంటుందా? వైసీపీకి వెళ్లి దెబ్బతిన్న ఆ కరుడు కట్టిన టీడీపీ నేతలు ఎవరు?

ఆ ఇద్దరి పొలిటికల్‌ కెరీర్‌కి రెడ్‌ సిగ్నల్‌..!
అదృష్టం ఒక్కసారే తలుపుతడుతుంది… దురదృష్టం వద్దన్నా వెంటాడుతుంది… ఇది అందరి విషయంలో కామనే అయినా.. పొలిటీషియన్స్‌ విషయంలో కాస్త డిఫరెంట్‌గానే చెప్పాలి. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడే పొలిటీషియన్స్‌ అసలు రంగు బయటపడుతుంది. కొందరు తాత్కాలిక ప్రయోజనాల కోసం తమ రాజకీయ భవిష్యత్‌ను పణంగా పెడుతుంటారు. అలాంటి వారిలో కడప జిల్లాకు చెందిన ఇద్దరి నేతల పేర్లు ముందుగా వినిపిస్తాయి. ఆ ఇద్దరిలో ఒకరు వైసీపీ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, మరొకరు మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌, ఎస్‌వీ సతీశ్‌ రెడ్డి. ఈ ఇద్దరు ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ వారి రాజకీయ జీవితం మొత్తం టీడీపీలోనే కొనసాగింది. నాలుగు దశాబ్దాలుగా టీడీపీతో ఉన్న బంధాన్ని తెంపుకుని వైసీపీలో కొత్త భవిష్యత్‌ వెతుక్కున్న ఆ ఇద్దరి పొలిటికల్‌ కెరీర్‌కి ఇప్పుడు రెడ్‌ సిగ్నల్‌ పడిందనే టాక్‌ వినిపిస్తోంది.

రామసుబ్బారెడ్డిని వెంటాడుతున్న దురదృష్టం..
కడప జిల్లాలో వైఎస్‌ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయం చేయడమంటే ఒకటి సతీశ్‌రెడ్డి కుటుంబం… ఇంకొకటి రామసుబ్బారెడ్డి కుటుంబానికే చెల్లిందని చెబుతారు. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ ఇద్దరి కుటుంబాలు టీడీపీలోనే కొనసాగాయి. 1983 నుంచి 1999 వరకు జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యేలుగా రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులే గెలిచారు. 2004లో తొలిసారి ఓడిన తర్వాత రామసుబ్బారెడ్డిని దురదృష్టం వెంటాడుతూనే వచ్చింది.

ఇక 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామసుబ్బారెడ్డి సేవలను గుర్తించి 2016లో ఎమ్మెల్సీని చేసింది. అయితే అదే సమయంలో వైసీపీ నుంచి అప్పటి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకోడాన్ని జీర్ణించుకోలేకపోయారు రామసుబ్బారెడ్డి. అయినప్పటికీ రామసుబ్బారెడ్డి మాటకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది టీడీపీ… 2019 ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని, రామసుబ్బారెడ్డికే టికెట్‌ ఇచ్చింది.

రాజకీయ విరోధులైన వైఎస్‌ కుటుంబంతో సర్దుకుపోయిన వైనం..
అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి అయిన ఆదినారాయణరెడ్డిని కడప పార్లమెంట్‌కు మార్చింది. ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోగా, ఎన్నికల అనంతరం వైసీపీకి వెళ్లిపోయారు రామసుబ్బారెడ్డి. సొంత నియోజకవర్గంలో ప్రత్యర్థితో సయోధ్య కుదిర్చినా ఇష్టపడని రామసుబ్బారెడ్డి… తరతరాలుగా తమ కుటుంబానికి రాజకీయ విరోధులైన వైఎస్‌ కుటుంబంతో సర్దుకుపోవడం కడప రాజకీయాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక వైసీపీలో చేరిన తర్వాత రామసుబ్బారెడ్డికి షరా మామూలుగా వర్గ విభేదాలు వెంటాడటంతో మళ్లీ టీడీపీలోకి వచ్చే ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఎన్నికల ముందు మళ్లీ ఎమ్మెల్సీ రావడంతో ఆగిపోయారు రామసుబ్బారెడ్డి.

మళ్లీ చలో టీడీపీ అంటూ రామసుబ్బారెడ్డిపై ఒత్తిడి..
ఇక ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో మళ్లీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైపోయారంటున్నారు. దాదాపు 40 ఏళ్లుగా అంటిపెట్టుకున్న టీడీపీ ఇప్పుడు కడప జిల్లాలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన సమయంలో రామసుబ్బారెడ్డి లేని లోటు కనిపిస్తోందని ఆయన అనుచరులు వాపోతున్నారట. మళ్లీ చలో టీడీపీ అంటూ రామసుబ్బారెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైఎస్‌ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఎస్‌వీ సతీశ్‌రెడ్డికి గుర్తింపు..
ఇక పులివెందుల నియోజకవర్గానికి చెందిన సతీశ్‌రెడ్డిది సేమ్‌ స్టోరీనే… వైఎస్‌ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఎస్‌వీ సతీశ్‌రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పులివెందులలో ఆయన గెలుపుపై ఎవరికీ అంచనాలు ఉండవు. కానీ, వైఎస్‌ కుటుంబాన్ని ఎదుర్కొనే ధీశాలిగా ఆయనకు స్టేట్‌ మొత్తం క్రేజ్‌ ఉంది. టీడీపీ కూడా ఆయనను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చింది. పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు సతీశ్‌రెడ్డికి నామినేటెడ్‌ పోస్టుల్లో నియమించేది. 2014లో మండలి వైస్‌ చైర్మన్ హోదా కట్టబెట్టింది. ఇక సతీశ్‌రెడ్డి కుటుంబానికి వైఎస్‌ కుటుంబానికి రాజకీయ వైరంతోపాటు వ్యక్తిగత విరోధమూ ఉందనే ప్రచారం ఉంది. ఈ రెండు కుటుంబాలు కలవడమంటే తూర్పు పడమరలు ఏకమైనట్లేనని చెబుతారు. అలాంటి పరిస్థితుల నడుమ… అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైసీపీలో చేరిపోయారు సతీశ్‌రెడ్డి.

వైసీపీ తీర్థం పుచ్చుకుని సతీశ్‌రెడ్డి సెల్ఫ్‌గోల్‌?
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మాజీ సీఎం జగన్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమైన సతీశ్‌రెడ్డి… నాలుగున్నరేళ్ల తర్జనభర్జన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే అధికారికంగా వైసీపీలో చేరిపోయారు. 2014-19 మధ్య అధికారాన్ని అనుభవించిన సతీశ్‌రెడ్డి… 2019 తర్వాత సైలెంట్‌ అయినా టీడీపీ ఆయన విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధం కొనసాగుతున్న సమయంలో పులివెందులలో రాజకీయం చేయాల్సిన క్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకున్నట్లే సతీశ్‌రెడ్డిని వెనకేసుకొచ్చింది. కానీ, టీడీపీ వారిస్తున్నా చివరికి వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో సతీశ్‌రెడ్డి సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నట్లైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Also Read : వైసీపీని వీడుతున్న బొత్స ముఖ్య అనుచరులు.. ఎదురుదెబ్బేనా? లేక వ్యూహమా?

శాశ్వత ప్రతిపక్షంగా మిగిలిన ఇద్దరు నేతలు..
ఇలా ఇద్దరు కీలక నేతలు టీడీపీలో కొనసాగితే మంచి గుర్తింపుతోపాటు భవిష్యత్‌ ఉండేదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. కానీ, తొందరపాటుతో ఇద్దరూ రాంగ్‌ స్టెప్పులు వేయడం వల్ల చేజేతులా పొలిటికల్‌ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టుకున్నారని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి ఇద్దరు రెడ్లు పార్టీ మారి ఏం సాధించారని అనుచరులు ప్రశ్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోజురోజుకు అనుచరుల నుంచి ఈ తరహా ప్రశ్నలు ఎక్కువ కావడంతో ఇద్దరూ మళ్లీ సొంత గూటికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.