మాజీ మంత్రి బొత్స ఎవరికి ఎర్త్‌ పెట్టాలని భావిస్తున్నారు? వైసీపీ నేతల వెన్నులో వణుకుపుట్టించిన వ్యాఖ్యలు

మొత్తానికి ఇటు అధికార పక్షంలోనూ.. అటు ప్రతిపక్షంలోనూ సందేహాలు రేకెత్తించేలా బొత్స వ్యాఖ్యలు ఉండటంతో ఆయన టార్గెట్‌ ఎవరై ఉంటారనేది ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌ను కుదిపేస్తోంది.

Gossip Garage : ఆ సీనియర్‌ నేతకు ఓ లెక్క ఉంటుంది. దేన్నైనా తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థత ఆయన సొంతం… పార్టీలో ట్రబుల్‌ షూటర్‌… రాజకీయంలో అపర చాణుక్యుడిగా పేరు… సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులను అధిష్టించిన ఆయన అడుగులు ఎవరికీ అంతుచిక్కవు. ఉన్నది ఉన్నట్లే చెబుతారు? కానీ అందులో ఏదో మతలబు పెడుతుంటారు..? ఆ మతలబు ఏంటో ఎవరికీ అర్థం కానట్లే ఉంటుంది… కానీ అర్థమవ్వాల్సిన వారికి అర్థమయ్యేలానే ఉంటుంది.

ఇప్పుడూ అంతే. విశాఖ భూకబ్జాలు.. డ్రగ్స్‌ కంటైనర్‌పై ఆయన లేవనెత్తిన సందేహాలు ఎవరెవరికో గుచ్చుకుంటున్నాయట. మనోడు ఎందుకిలా మాట్లాడారు? మనల్ని ఇరికించాలనుకుంటున్నాడా? మన తప్పు ఏమీ లేదని చెప్పాలని అనుకుంటున్నాడా? అంటూ స్వపక్షంలోనే చర్చకు తెరలేపారు ఆ సీనియర్‌ నేత? ఇంతకీ ఎవరికీ అంతుచిక్కని ఆ నేత ఎవరు? ఆయన లేవనెత్తిన సందేహాలేంటి?

స్వపక్షంలోనూ కొందరిని టార్గెట్‌ చేశారా?
విశాఖ నగరంలోని భూకబ్జాలు, డ్రగ్స్‌ కంటైనర్‌పై చర్యలకు డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి, సీనియర్‌ నేత బొత్స సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. టీడీపీ ప్రభుత్వాన్ని ఇరికిస్తున్నట్లే వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స… స్వపక్షంలోనూ కొందరిని టార్గెట్‌ చేశారా? అనే అనుమానాలకు తెరలేపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రశాంత విశాఖలో వేల కోట్ల భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.

ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల వెన్నులో వణుకుపుట్టించిన బొత్స..
ప్రస్తుత అధికార పక్షం టీడీపీ, విపక్షం వైసీపీ పార్టీల్లో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఎందరో ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలోనూ… ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలోనూ ఈ భూ కుంభకోణాలపై విచారణలు జరిగాయి. కానీ ఏ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి న్యాయం చేయలేదనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు నాలుగోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కూడా విశాఖ భూ వ్యవహారాలపై సీరియస్‌గా ఉన్నట్లు సంకేతాలిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

బొత్స ఎందుకిలా మాట్లాడారనే సందేహం..
ఎన్నికల ముందు విశాఖకు వచ్చిన డ్రగ్స్‌ కంటైనర్‌ లోగుట్టు బయటపెట్టాలని తాజాగా డిమాండ్‌ చేసిన బొత్స…. పనిలోపనిగా విశాఖలో భూ కుంభకోణాలపైనా విచారణ జరపాలని… చంద్రబాబు ప్రభుత్వానికి చేతనైతే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉండగా గతంలో వేసిన సిట్‌ ఇచ్చిన నివేదికపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీయడం ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు వెన్నులో వణుకు పుట్టించారు బొత్స. ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉన్నప్పటికీ… ప్రభుత్వం చర్యలు తీసుకోడానికి మీనమేషాలు లెక్కిస్తుందనే సంకేతాలిస్తున్నప్పటికీ… ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల్లో ఎక్కువ మంది తమ పార్టీ వారే ఉండటమే పెద్ద చర్చకు దారితీసింది. బొత్స ఎందుకిలా మాట్లాడారనే సందేహాలకు తెరలేపింది.

ఇతరుల జోక్యాన్ని సహించలేకే ఈ వ్యాఖ్యలు చేశారా?
ఉత్తారాంధ్రలో కీలక నేతగా వ్యవహరించే బొత్స… ఈ ప్రాంతంలో ఇతరుల జోక్యాన్ని సహించలేకే ఈ వ్యాఖ్యలు చేశారా? లేక తమ పార్టీ నేతల తప్పు లేకపోయినా ప్రజలను తప్పుదారి పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారని నిరూపించేందుకే ప్రభుత్వానికి సవాల్‌ చేశారా? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఉత్తరాంధ్రలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ. రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రైవేటు భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఆరోపణలు రాగా సీఎం చంద్రబాబు 2004 నుంచి విశాఖలో చోటుచేసుకున్న భూమి వ్యవహారాలపై సిట్‌ వేశారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా మరో సిట్‌ వేసింది.. ఈ రెండు సార్లు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.

వైసీపీ కీలక నేతలపై భూ కబ్జా ఆరోపణలు..
సరికదా… 2019 తర్వాత వైసీపీ హయాంలో విశాఖలో విలువైన భూములు కబ్జాకు గురయ్యాయనే ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. వైసీపీలో కీలక నేతలైన ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డితోపాటు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ వంటివారిపై ఎన్నో విమర్శలు వినిపించాయి. భూ వ్యవహారాలపై ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ ఎంవీవీ మధ్య వాగ్యుద్ధమే జరిగింది. ఇద్దరూ ఒకే పార్టీ వారైనప్పటికీ వేల కోట్ల రూపాయల భూ వ్యవహారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో అగ్గి రాజేసేవారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మారాక మాజీ మంత్రి బొత్స భూ అక్రమాలపై నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం ప్రాధాన్యత సంతరించుకుందంటున్నారు.

సంధ్యా అక్వా యజమానులకు వైసీపీ, బీజేపీ నేతలతో సంబంధాలు!
గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావించినా, కుదరలేదని చేతనైతే మీరు ఇప్పుడు చేసి చూపించాలని బొత్స సవాల్‌ విసరడం ద్వారా ఎవరికి ఎర్త్‌ పెట్టాలని భావిస్తున్నారో అర్థం కాక ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. ఇదే సమయంలో మార్చిలో విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్‌ కంటైనర్‌పైనా బొత్స వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కంటైనర్‌ తెప్పించిన సంధ్యా ఆక్వా యజమానులకు ఇటు వైసీపీతోనూ.. అటు బీజేపీ చీఫ్‌ పురందేశ్వరితోనూ సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది.

డ్రగ్స్‌ కేసులో అసలు దోషులు ఎవరో తెలుసా?
విశాఖలో డ్రగ్స్‌ సంస్కృతి ప్రోత్సహించకూడదనే ఆలోచనతో నిందితులపై చర్యలకు బొత్స డిమాండ్‌ చేసినా… అంతా సైలెంట్‌గా ఉన్నప్పుడు సడన్‌గా బొత్స నోరు విప్పడమే హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికల సమయంలో కంటైనర్‌ పట్టుబడటం వల్ల తమ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని చెబుతున్న బొత్స… అసలు దోషులు ఎవరో తేల్చాలని సీబీఐని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేశారని చెబుతున్న బొత్సకు ఈ కేసులో అసలు దోషులు ఎవరో తెలుసా? లేక దోషులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అనేది అంతుచిక్కడం లేదంటున్నారు.

రెండు పార్టీల్లో సందేహాలు రేకెత్తించేలా బొత్స వ్యాఖ్యలు
ఈ వ్యవహారంలో కొందరు వైసీపీ నేతలపైనా ఆరోపణలు రావడంతో బొత్స అంతరంగం ఏమైవుంటుందనే చర్చకు తావిస్తోంది. మొత్తానికి ఇటు అధికార పక్షంలోనూ.. అటు ప్రతిపక్షంలోనూ సందేహాలు రేకెత్తించేలా బొత్స వ్యాఖ్యలు ఉండటంతో ఆయన టార్గెట్‌ ఎవరై ఉంటారనేది ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌ను కుదిపేస్తోంది. ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాల నేతల జోక్యాన్ని సంహించలేకే బొత్స ల్యాండ్‌ కబ్జాలతోపాటు డ్రగ్స్‌ ఇష్యూని తెరపైకి తెచ్చారా? లేక అధికార పక్షానికి చెక్‌ చెప్పడంలో భాగంగానే విమర్శలు సంధించారా? అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదంటున్నారు.

Also Read : వైసీపీకి బిగ్ షాక్‌ తప్పదా? అధికార పార్టీకి దగ్గరవుతున్న ఎమ్మెల్సీలు..!

ట్రెండింగ్ వార్తలు