Kethireddy Venkatarami Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఆ లీడర్ స్టైలే వేరు. తనకంటూ కొంత ఫాలోయింగ్ ఉన్న ఆ నేత.. తన నియోజకవర్గంలో ఒక పవర్ ఫుల్ లీడర్‌గా ఎదిగారు. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం లైమ్‌లైట్‌లో ఉంటూ వచ్చారు. పార్టీకి పవర్ పోయింది.. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆ నేత అంతర్మథనంలో పడిపోయారట. అందుకే అప్పుడప్పుడు సోషల్ మీడియా పోస్ట్‌లు తప్ప..నియోజకవర్గంలో మాత్రం యాక్టీవ్ కావడం లేదంటున్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే మౌనం వెనుక వైరాగ్యం ఉందా? లేక కాస్త గ్యాప్ తీసుకుందామని అనుకుంటున్నారా?
అపోజిషన్‌లోకి వచ్చేసరికి సైలెంట్ అయిపోయారు..
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి… రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఒక సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన.. ఎన్నికల్లో ఓడిన తర్వాత సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రెస్పాండ్ అవడం తప్ప..ప్రజాక్షేత్రంలో మాత్రం యాక్టీవ్ కావడం లేదు.
ఇదే ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో ఉన్న కేతిరెడ్డి.. అపోజిషన్‌లోకి వచ్చేసరికి సైలెంట్ అయిపోవడం..ప్రజా సమస్యలను పెద్దగా పట్టించుకోకపోవడం..నిరసనలకు దూరంగా ఉండటం చర్చనీయాంశం అవుతోంది.
గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రోల్ మోడల్‌గా మారిపోయారు..
కేతిరెడ్డి మార్క్ పాలిటిక్సే వేరు. తండ్రి ఫ్యాక్షన్ కక్షలకు బలైతే..అనుకోకుండా 2005లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2009లో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడినా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల్లో ఉంటూ అందరికీ ఒక రోల్ మోడల్‌గా మారిపోయారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దూరంగా ఉంటూ..సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే కేతిరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితంగా మారిపోయారు.
Also Read : సీఎం చంద్రబాబుకి తలనొప్పిగా మారిన ఆ ఎమ్మెల్యే ఎవరు? వేటు తప్పదా?
చెరువు స్థలాన్ని ఆక్రమించి.. విలాసవంతమైన ఫామ్‌హౌస్ కట్టుకున్నారన్న ఆరోపణలు..
ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ధర్మవరం డెవలప్ మెంట్‌లో తన మార్కు చూపించారు. అలా అని ఆయనపై ప్రతర్థుల ఆరోపణలు, విమర్శలేం తక్కువ లేవు. ధర్మవరంలో చెరువు స్థలాన్ని ఆక్రమించి.. ఒక విలాసవంతమైన ఫామ్‌హౌస్ కట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ పేరుతో జనంలోకి వెళ్లి.. సమస్యలు పరిష్కరించడం ఒకవైపు అయితే.. ఖాళీ స్థలాలను కబ్జా చేశారని అలిగేషన్స్ వినిపించాయి.
వీటన్నింటిని కేతిరెడ్డి బలంగా తిప్పి కొట్టలేకపోయారు. 2024 ఎన్నికలు వచ్చే సమయానికి..ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో టీడీపీ బలంగా మారింది. అయితే పొత్తుల్లో భాగంగా ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ్‌కు కాకుండా బీజేపీ నేత సత్యకుమార్‌కు ఇచ్చారు.
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సత్యకుమార్ గెలుపు..
వాస్తవానికి కేతిరెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసు. ధర్మవరం ప్రజలకు ఇంకా బాగా తెలుసు. ఇలాంటి క్రమంలో అసలు పరిచయం లేని సత్యకుమార్ ఎలా గెలుస్తారన్న అభిప్రాయం అందరిలోనూ ఉండేది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సత్యకుమార్ స్వల్ప మెజారిటీతో కేతిరెడ్డిపై విజయం సాధించారు. దీంతో ఒక్కసారిగా కేతిరెడ్డి డీలా పడిపోయారు. ఓటమి తర్వాత ఆయన వైరాగ్యంలో కనిపించారు.
ఓటమి తర్వాత గడ్డం పెంచుకొని..
యంగ్ పొలీషియన్‌గా ఉన్న కేతిరెడ్డి ఎప్పుడూ స్టైలిష్ డ్రస్సులతో, హెయిర్ స్టైల్‌తో కనిపించే వారు. కానీ ఓటమి తర్వాత గడ్డం పెంచుకొని ఆయన లుక్కే మారిపోయింది. తన ఓటమికి కారణాలేంటి.? రాష్ట్రంలో వైసీపీ ఎందుకు ఓడిపోయింది.? అధిష్టానం చేసిన తప్పులు ఏంటి.? ప్రజలు ఏ విధంగా ఆలోచించారు.? ఈవీఎంల పనితీరు ఎలా ఉంది.? ఇలాంటి అంశాల మీదే కేతిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వచ్చారు. కానీ ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం యాక్టివ్ కాలేదు. పార్టీని నమ్ముకున్న ఎంతోమంది ఆయన కోసం ఎదురుచూస్తున్ననప్పటికీ..నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో ఉండట లేదట.
ఒకానొక సమయంలో కేతిరెడ్డి మంచి వాక్ చాతూర్యం, అలాగే సబ్జెక్ట్ పరంగా మాట్లాడే నేతగా ఉండటంతో వైసీపీ అధిష్టానం ఆయనకు జిల్లా పగ్గాలు అప్పగించింది. అయితే ధర్మవరం ప్రజలు తనను ఓడించారన్న బాధనో లేక కోపమో తెలియదు కానీ.. కేతిరెడ్డి నియోజకవర్గ సమస్యల మీద స్పందించడం లేదు. ఇప్పటివరకు ఎక్కడా ధర్మవరం రాజకీయాలపై మాట్లాడలేదు. పైగా పార్టీ అధిష్టానం రైతు సమస్యల మీద రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తే..జిల్లాలో అందరూ నాయకులు పాల్గొన్నా కేతిరెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్.
కేతిరెడ్డి మౌనంపై రకరకాల చర్చలు..
ఆ తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపుపై అధిష్టానం ఇచ్చిన పిలుపుకు కేతిరెడ్డి స్పందించారు. ధర్మవరంలో భారీ నిరసన చేపట్టి..మళ్లీ యాక్టీవ్ అవుతున్నట్లు సంకేతం ఇచ్చారు. ఆ నిరసన తర్వాత కూడా మళ్లీ ఆయన సైలెంట్‌గానే ఉంటున్నారు. తిరుపతి తొక్కసలాట ఘటనపై సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించారు. కానీ కేతిరెడ్డి ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో కనిపించడం లేదు. అయితే కేతిరెడ్డి ఎందుకు యాక్టివ్ కాలేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకానొక సందర్భంలో ఆయన జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం కూడా సాగింది. కానీ కేతిరెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే అందులో నిజం లేదన్నది తేలిపోయింది.
అసలు కేతిరెడ్డి మనసులో ఏముంది? ఆయన ఎందుకు నియోజకవరంగంలో యాక్టీవ్ కావడం లేదన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. వాస్తవంగా ధర్మవరంలో చాలా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చేనేత సామాజికవర్గం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో నలిగిపోతోందట. ఈ అంశం మీద కదిరి ఎమ్మెల్యే కందికుంటనే స్పందించారు కానీ.. ధర్మవరంలో కీలకంగా ఉండే కేతిరెడ్డి మాత్రం రియాక్ట్ కాలేదు.
అయితే అధికార కూటమి సర్కార్‌కు టైమ్ ఇవ్వాలనే ఆలోచనతోనే కేతిరెడ్డి మౌనంగా ఉంటున్నట్లు క్యాడర్, ఆయన అనుచరులు చెప్తున్నారు. త్వరలోనే తమ నేత మళ్లీ యాక్టీవ్ అయి..ప్రజా సమస్యలపై పోరు మొదలుపెడతారని అంటున్నారు. చూడాలి మరి కేతిరెడ్డి అడుగులు ఎటువైపు పడుతాయో.
Also Read : రేవంత్ సర్కార్‌కు జనవరి 26 గుబులు..! ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంగారు ఎందుకు?