Gossip Garage : వివాదాలకు కేరాఫ్‌గా టీడీపీ ఎమ్మెల్యే..! అధినేత మందలించినా ఎందుకు మారడం లేదు?

పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలను బహిరంగ సభల్లో ప్రస్తావించి..పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని క్యాడర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Gossip Garage : వివాదాలకు కేరాఫ్‌గా టీడీపీ ఎమ్మెల్యే..! అధినేత మందలించినా ఎందుకు మారడం లేదు?

Updated On : January 14, 2025 / 9:30 PM IST

Gossip Garage : అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యారు. కొని మరీ సమస్యలు తెచ్చి పెట్టుకుంటున్నారు. వరుసగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అవుతున్నారు ఆ శాసనసభ్యుడు. అధికార పార్టీలో ఉండి.. ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తెరలేపుతూ చిక్కుల్లో పడిపోతున్నారు. వివాదం ఆయనను వెతుక్కుంటూ వస్తుందో..లేకపోతే ఆయనే కావాలని కాంట్రవర్సీల్లో కాలు పెడుతున్నారో తెలియదు కానీ.. నిత్యం టాక్‌ ఆఫ్‌ ది మీడియాగా ఉంటున్నారు. ఆ ఎమ్మెల్యే తీరు..పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతుందట. అధినేత సీరియస్‌ అయినా ఆయన తీరు మారడం లేదట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే.? ఏంటా కాంట్రవర్సీలు.?

కొలికపూడి శ్రీనివాసరావు. అమరావతి రైతుల ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన ఈయన..గత ఐదేళ్లు లైమ్‌లైట్‌లో ఉంటూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచి..వివాదాలతో నిత్యం వార్తల్లో ఉంటూ వస్తున్నారు. దాంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ తీరు టీడీపీ అధిష్ఠానాన్ని చిక్కుల్లో పడేస్తోందట. తరచూ వివాదాలకు కేరాఫ్‌ అవుతూ.. పార్టీకి, క్యాడర్‌కు తలనొప్పిగా మారారన్న చర్చ జరుగుతోంది.

రోడ్డు పంచాయితీలో తలదూర్చి ఇరకాటంలో పడ్డ ఎమ్మెల్యే..
తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలోని ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య రోడ్డు పంచాయితీలో తలదూర్చి ఇరకాటంలో పడిపోయారు కొలికపూడి. ఎమ్మెల్యే తమ ఇంట్లోకి వచ్చి మరీ కొట్టి, అవమానకరంగా తిట్టారంటూ వైసీపీ వార్డు సభ్యురాలు భూక్యా చంటి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇష్యూ పెద్దది కావడంతో సీఎం చంద్రబాబు కొలికపూడి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఆ భవనం పడగొట్టాల్సిందేనంటూ ఆందోళన..
ఇదొక్కటే కాదు పలు సందర్భాల్లో వివాదాలకు కేరాఫ్ అయ్యారు కొలికపూడి. అనూహ్యంగా ఎమ్మెల్యే అయిన ఆయన..తన దుందుడుకు తీరుతో టీడీపీ అధిష్టానానికి హెడెక్‌గా మారారట. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే గతేడాది జూలైలో ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైసీపీ నేత పంచాయతీ స్థలం ఆక్రమించి, భవనం కట్టాడని దాన్ని పడగొట్టాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. ఉన్నపళంగా బిల్డింగ్‌ను కూల్చలేమని, ప్రొసీజర్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా వినకుండా అక్కడే భైఠాయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో సీఎం చంద్రబాబు శ్రీనివాస్‌ను మందలించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Also Read : నారావారిపల్లె సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలు ఆవిష్కరణ

ఆ తర్వాత పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంటూ సొంత పార్టీ నేతను అందరి ముందు తిట్టడంతో సదరు ప్రజాప్రతినిధి సతీమణి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ వివాదం చల్లారకముందే ఏకంగా మద్యం షాపులకు తాళాలు వేసి సంచలనం సృష్టించారు. ఇక లేటెస్ట్‌గా ఎస్టీ మహిళ అని కూడా చూడకుండా వార్డు సభ్యురాలిపై దాడి చేయడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.

వైసీపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే దందా?
తిరువూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. మట్టి దందాకు కొలికపూడి అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక తన గెలుపు కోసం పనిచేసిన పార్టీ శ్రేణులను పక్కనపెట్టి వైసీపీ వాళ్లతో అంటకాగుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ వారే తిరువూరు మైనింగ్‌లో కీలకంగా ఉన్నారట. వాళ్లతో కలిసే కొలికపూడి దందా చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన నియోజకవర్గ టీడీపీ నేతలు కొద్ది రోజుల క్రితం పెద్దసంఖ్యలో పార్టీ హెడ్‌ ఆఫీస్‌కు వెళ్లి ఫిర్యాదు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి.

కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది అంటూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు..
ఇక కొలికపూడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. నియోజకవర్గంలో సొంత నిధులతో కాల్వ పూడిక తీయిస్తే తనకు సంఘీభావం తెలపలేదంటూ రైతులపై కస్సుమన్నారు. కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది కానీ.. కొందరు రైతులకు విశ్వాసం ఉండదంటూ వివాదానికి తెరలేపారు. ఇలా కొలికపూడి వ్యవహారం తిరువూరులోనే కాదు..రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలను బహిరంగ సభల్లో ప్రస్తావించి..పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా కొలికపూడి వ్యవహరిస్తున్నారని క్యాడర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొలికపూడి తీరుతో పార్టీకి నష్టం జరుగుతోందని..ఆయనపై అధిష్ఠానం యాక్షన్‌ తీసుకుని పరిస్థితిని చక్కబెట్టాలంటున్నారు నియోజకవర్గ టీడీపీ నేతలు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తీరు మారుతుందా.? లేక అధినేత చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి మరి.

 

Also Read : రేవంత్ సర్కార్‌కు జనవరి 26 గుబులు..! ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంగారు ఎందుకు?