×
Ad

Pawan Kalyan: సడెన్‌గా ఢిల్లీ టూర్‌.. వరుసగా కేంద్రమంత్రులతో సమావేశాలు.. పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనపై అనేక ఊహాగానాలు

అంతర్గతంగా సాగిన సమావేశంపై ఏయే అంశాలపై చర్చించారనే ఉత్కంఠ నెలకొంది. ఈసారి పవన్‌ ఢిల్లీ పర్యటన కేవలం విజ్ఞప్తులకే పరిమితం కాకుండా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పటిష్టం చేసే దిశగా సాగిందంటున్నారు.

  • Published On : January 29, 2026 / 07:56 PM IST

Pawan Kalyan Representative Image (Image Credit To Original Source)

  • పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు
  • పిఠాపురం టు ఏపీ స్టేట్‌ ఇష్యూస్‌పై విజ్ఞప్తులు
  • ఏపీ టు తమిళనాడు వయా తెలంగాణ పాలిటిక్స్‌పై చర్చ

 

Pawan Kalyan: ఆల్ ఆఫ్ సడెన్‌గా హస్తినకు వెళ్లారు. వరుస పెట్టి కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. తన సొంత నియోజకవర్గ సమస్యలే కాదు స్టేట్‌ ఇష్యూస్‌ను కూడా కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇటు నిధులు..అటు రాజకీయ అంశాలే ప్రధాన ఎజెండాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ టూర్‌ కొనసాగిందంటున్నారు. బీజేపీ అగ్రనేతలతో పవన్ చర్చించిందేంటి? పిఠాపురం డెవలప్‌మెంట్‌ కోసం ఆయన చేసిన రిక్వెస్ట్ ఏంటి? ఏపీ టు తమిళనాడు..వయా తెలంగాణ పాలిటిక్స్‌పై కూడా డిస్కస్ చేశారా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా హస్తినలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. స్టేట్‌ క్యాబినెట్‌ సమావేశాన్ని డుమ్మాకొట్టి మరీ ఆయన ఢిల్లీకి వెళ్లడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. డిప్యూటీ సీఎం ఇంత సడెన్‌గా దేశ రాజధానికి ఎందుకు వెళ్లారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌ అవుతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం, ఈ సమావేశాల్లో ఏపీకి సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముండటంతో..కేంద్ర క్యాబినెట్ విస్తరణ వార్తల నడుమ పవన్ ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇటు రాష్ట్రంలోనూ అటు దేశ రాజధానిలోనూ పవన్ పర్యటన రకరకాల గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయ్.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన పవన్‌..రాజధాని అమరావతి బిల్లుపై డిస్కస్ చేసినట్లు ఒక ప్రచారం జరుగుతోంది. అలాగే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారని చెబుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉండటంతో జనసేన పార్టీకి ఈసారి ప్రాతినిధ్యం కల్పించాలని కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

నాగబాబుకు కేంద్రమంత్రి పదవి?

త్వరలో ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో తమకు ఒక సీటు కేటాయించడంతో పాటు..మంత్రి పదవి కూడా ఇవ్వాలని పవన్ కేంద్ర పెద్దల దగ్గర ప్రపోజల్‌ పెట్టి ఉంటారన్న చర్చ నడుస్తోంది. నాగబాబును రాజ్యసభకు పంపి..కేంద్ర మంత్రి పదవి ఇచ్చేలా ఢిల్లీ పెద్దలను కోరేందుకు పవన్ ఢిల్లీ వెళ్లినట్లు ఓ టాక్‌ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఇక తన సొంత నియోజకవర్గం పిఠాపురంకు నిధులు కేటాయించాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంత కోతను అరికట్టేందుకు ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్‌కు నిధులు ఇవ్వాల్సిందిగా హోంమంత్రి అమిత్‌షాను పవన్‌ రిక్వెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. కేంద్ర రైల్వే , ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యి.. ఏపీలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రాసెస్‌ను స్పీడప్ చేయాలని కోరినట్లు కూడా తెలుస్తోంది. ఏపీలో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, పిఠాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్‌ స్టేషన్‌గా డెవలప్ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్తున్నారు.

పవన్ కు తమిళనాడు ఎన్నికల ప్రచార బాధ్యతలు?

ఇక అమిత్‌షాతో భేటీలో రాజకీయ అంశాలపై కూడా పవన్ డిస్కస్ చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది. తమిళనాడు ఎన్నికలు రాబోతున్న వేళ అక్కడ ప్రచార బాధ్యతలు తీసుకోవాలని పవన్‌ను అమిత్‌షా కోరినట్లు ఇన్‌సైడ్‌ టాక్‌. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది జనసేన. బీజేపీతో కలిసి పోటీ చేయాలా? లేక ఒంటరిగా బరిలోకి దిగాలా? అనేదానిపై డైలమాలో ఉన్న పవన్..పురపోరులో పోటీపై బీజేపీ పెద్దల దగ్గర ప్రస్తావించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మున్సి పల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడమా, లేదా కూటమిగా ముందుకు వెళ్లడమా అనే విషయంపై స్పష్టత కోసం చర్చలు జరిగాయని హస్తిన వర్గాల టాక్‌.

తెలుగు స్టేట్స్‌ పాలిటిక్స్, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు, రాజ్యసభ సీట్లు, కేంద్రమంత్రివర్గంలో చోటు..ఏపీకి నిధులు..ఇలా అన్ని అంశాలే ఎజెండాగా పవన్ హస్తిన టూర్‌గా జరిగినట్లు చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా పవన్ కల్యాణ్ అమిత్ షాతో భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. అంతర్గతంగా సాగిన సమావేశంపై ఏయే అంశాలపై చర్చించారనే ఉత్కంఠ నెలకొంది. ఈసారి పవన్‌ ఢిల్లీ పర్యటన కేవలం విజ్ఞప్తులకే పరిమితం కాకుండా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పటిష్టం చేసే దిశగా సాగిందంటున్నారు.

వివిధ కేంద్ర మంత్రులతో జరిగిన వరుస భేటీల్లో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ అంశాలు..అభివృద్ధి, నిధులే లక్ష్యంగా పవన్‌ హస్తిన టూర్ జరిగినట్లు చెబుతున్నారు. జనసేనకు కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కుతుందో లేదో? తమిళనాడు ఎన్నికల్లో పవన్‌ రోల్‌ ఎలా ఉండబోతోందో త్వరలోనే క్లారిటీ రానుంది.

Also Read: కేంద్ర బడ్జెట్‌పైనే అందరి ఆశలు.. EMIలు తగ్గుతాయా? పెరుగుతాయా? హోం లోన్లు, పన్ను మినహాయింపులపై సస్పెన్స్!