Gossip Garage : తన వారసుడిగా తమ్ముడిని తెరమీదకు తెచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..! కారణం అదేనా?

ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలకు కష్టపడినట్టు కాకుండా..ప్రతిరోజు ఎన్నికలున్నట్లు కష్టపడటం కోటంరెడ్డి బ్రదర్స్ ప్రత్యేకత.

Gossip Garage : సింహపురి పాలిటిక్స్‌లో ఆ బ్రదర్స్ రూటే సెపరేటు. ఎప్పుడూ పబ్లిక్‌లోనే ఉంటారు. మంచో చెడో తమ గురించే డిస్కషన్ జరగాలని కోరుకుంటారు. వాళ్ల రాజకీయ ఎత్తులు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. తమ పొలిటికల్ మైలేజీని పెంచుకునేందుకు బ్రదర్స్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి అంతు కూడా చిక్కదు. ప్రజల్లోనే ఉంటూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న ఆ నేత..ఇప్పుడు తన తమ్ముడ్ని వారసుడిగా తెరమీదకు తెస్తున్నారు. ఇంతకీ ఎవరా అన్నదమ్ముళ్లు.? వాళ్ల రాజకీయ ఎత్తులు ఏంటి.?

ఎమ్మెల్యే కోటంరెడ్డి విజయాల వెనుక సోదరుడి కీలక పాత్ర..
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. సంచలన రాజకీయాలకు కేరాఫ్‌. నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా..నియోజకవర్గంలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ..ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటారు. వరుసగా మూడుసార్లు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని లీడర్‌గా ఎదిగారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పలు కారణాలతో ఆ పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి..టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేశారు. మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. అయితే ఎమ్మెల్యే కోటంరెడ్డి విజయాల వెనుక ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాత్ర ఎంతో ఉందనేది ఆయన అనుచరులు చెబుతున్న మాట. ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఎదిగిన ఈ అన్నదమ్ములు చేస్తున్న రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఇప్పుడు రాజకీయ వారసుడిగా తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ప్రజా క్షేత్రంలోకి దించేశారు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి. నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే గిరిధర్ రెడ్డి కూడా అప్పుడే ప్రయత్నాలను మొదలు పెట్టేశారు. అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన స్ట్రాటజీనే ఫాలో అయిపోతున్నారు. ఇటీవలే “గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి” కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన రూరల్ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..గడపగడపకు ఎమ్మెల్యే..నేను నా కార్యకర్త..ఒక్కడే ఒంటరిగా..ఇలా వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు అన్ని మతాలకు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ ప్రజలను మరింత ఆకట్టుకుంటున్నారు కోటంరెడ్డి బ్రదర్స్.

ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలకు కష్టపడినట్టు కాకుండా..ప్రతిరోజు ఎన్నికలున్నట్లు కష్టపడటం కోటంరెడ్డి బ్రదర్స్ ప్రత్యేకత. ఎన్నికలకు నాలుగేళ్ల ముందు నుంచే ప్లాట్ ఫామ్ సిద్ధం చేసుకుంటారు. ఈ బ్రదర్స్ వ్యూహాలు..రాజకీయ నిర్ణయాలు ఎవరికీ అర్థం కావన్న టాక్ ఉంది. నియోజకవర్గంలో తామున్న పార్టీని పటిష్ట చేయడంతో పాటు..తన వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. ఈ క్రమంలోనే అధికార పార్టీలోకి వైసీపీ నుంచి భారీగా చేరికలు చేపట్టి టీడీపీ మరింత పటిష్ట పరిచారు. అటు నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోనే ఉంటూ సొంత ఇమేజ్‌ను పెంచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డిని బరిలోకి దించే ఆలోచనలో శ్రీధర్‌రెడ్డి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. తమ్ముడికి ఇంకో నియోజకవర్గం నుంచి టికెట్ దక్కితే ఓకే. లేకపోతే నెల్లూరు రూరల్ నుంచి తాను తప్పుకుని గిరిధర్‌రెడ్డిని బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారట కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.

Also Read : దేవినేని ఉమాకు మళ్లీ రాజకీయ యోగం దక్కేనా?