Gossip Garage : దేవినేని ఉమాకు మళ్లీ రాజకీయ యోగం దక్కేనా?
పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధినేత మాట జవదాటని నాయకుడిగా..పార్టీ పట్ల అంకితభావంతో పని చేసిన నేతగా ఆయనకు ఉన్న గుర్తింపే ఎమ్మెల్సీ పదవిని తెచ్చి పెడుతుందని టీడీపీలో చర్చ జరుగుతోంది.

Gossip Garage Devineni Uma (Photo Credit : Google)
Gossip Garage : మొన్నటి వరకు పార్టీలో ఆయన ఎంత చెప్తే అంత. జిల్లా రాజకీయాల్లో సింగిల్ హ్యాండ్ గణేష్‌లా చక్రం తిప్పేవారు. పార్టీకి, అధినాయకుడికి వీరవిధేయుడు. కానీ ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ ప్రభావం ఇప్పుడు తగ్గిపోయింది. పార్టీ బంపర్ విక్టరీ సాధించినప్పుడు ఆయన సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఎందరికో పదవులు ఇప్పించిన ఆ నేత.. ఇప్పుడు తనకే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందోలేదోనని ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. ఆ మాజీమంత్రికి మళ్లీ పూర్వవైభవం దక్కబోతోందా.? ఎమ్మెల్సీ రేసులో ఆనయనెంత దూరం.?
కళ్ళ ముందే కుప్పకూలిన రాజకీయ సామ్రాజ్యం..
మొన్నటి వరకు ఒంటి చేత్తో జిల్లా రాజకీయాలను నడిపించిన ట్రాక్ రికార్డు మాజీ మంత్రి దేవినేని ఉమాది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరంతరం పోరాడిన నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఒకప్పుడు కృష్ణా జిల్లా టీడీపీలో ఆయన గీసిన గీతను దాటడానికి కూడా ఏ నాయకుడు సాహసించే వారు కాదు. కానీ కళ్ళ ముందే ఆయన రాజకీయ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ కూడా దక్కని పరిస్థితి. చివరికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్‌లో ఉన్నారు దేవినేని ఉమా.
సోదరుడు దేవినేని రమణ అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఉమా టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగి తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే దేవినేని ఉమా.. ఉమా అంటే తెలుగుదేశం పార్టీ అనే స్థాయిలో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అయినట్లు ఉమా రాజకీయ ప్రభావం తగ్గిపోయింది. జిల్లా రాజకీయాలను..పార్టీ వ్యవహారాలను తన కనుసైగతో చక్కబెట్టిన ఉమాకు..ఇప్పుడు ఓ పదవి అంటూ లేకుండా పోయింది. గత ఐదేళ్లలో పార్టీలో జరిగిన పరిణామాలు పొలిటికల్‌గా ఆయనను డ్యామేజ్ చేశాయన్న టాక్ ఉంది.
ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ ముందుకు వచ్చే నాయకుడు..
వైసీపీ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేశారు దేవినేని ఉమా. అయినప్పటికీ కృష్ణా జిల్లా టీడీపీలో దేవినేని ప్రాధాన్యత క్రమ క్రమంగా తగ్గిపోయింది. మొన్నటి ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో ఉమాను కాదని వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్‌కు టికెట్ కట్టబెట్టారు. దేవినేని ఉమాకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. దాంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వసంత కృష్ణప్రసాద్ గెలుపు కోసం పని చేశారాయన. అయితే టీడీపీ పవర్‌లోకి వచ్చాక..ఉమాకు మంచి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతూ వస్తోంది.
పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌లు కూడా దేవినేని ఉమా పట్ల సానుకూలంగా ఉన్నారట. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధినేత మాట జవదాటని నాయకుడిగా..పార్టీ పట్ల అంకితభావంతో పని చేసిన నేతగా ఆయనకు ఉన్న గుర్తింపే ఎమ్మెల్సీ పదవిని తెచ్చిపెడుతుందని టీడీపీలో చర్చ జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ ముందుకు వచ్చే నాయకుడు ఉమా అని ద్వితీయ శ్రేణి లీడర్లు చెబుతున్నారు. త్వరలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమంటూ చర్చించుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
మైలవరంలో కూడా ఉమా లేని లోటు కనిపిస్తుందని ఆయన అనుచరులు అంటున్నారు. గొల్లపూడి ఆఫీస్‌లో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా నిమిషాల్లో వాలిపోయేవారట ఉమా. ప్రస్తుతం వసంత కృష్ణప్రసాద్ అందుబాటులో ఉండటం లేదనేది అక్కడి కార్యకర్తలు చెబుతున్న మాట. అందరూ దేవినేని నివాసానికి వెళ్తున్నప్పటికీ ఆయన సున్నితంగా ఎమ్మెల్యేతో పని చేయించుకోవాలంటూ చెబుతున్నారట. గతంలోలాగా అన్ని వ్యవహారాలు మీద వేసుకోకుండా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి స్పందిస్తున్నారని చెబుతున్నారు ఆయన అనుచరులు. దాంతో గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవినేని ఉమాను తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులంతా ఇప్పుడు ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనా సీనియర్ నేతల తీరే వేరు అంటూ దేవినేని ఉమాను తెగ పొగిడేస్తున్నారట లీడర్లు. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో.. ఆయనకు బెర్త్ ఖాయమని చర్చించుకుంటున్నారు.
Also Read : కూటమిలో పంపకాల లొల్లి తప్పదా? పదవి దక్కేదెవరికి?